విద్య నేర్పిన వినయం

Education Minister Ravindra Nath Visit Government high school  - Sakshi

మినిస్టర్‌

మంత్రిగారంటే ఎలా ఉండాలి? ఎలా ఉంటారని ఊహించుకుంటాం! మందీ మార్బలం, అంగరక్షకులు, ఆయన ప్రయాణించే కారుకు ముందూ వెనకా బయ్‌మంటూ వెళ్లే కాన్వాయ్‌.. కానీ ఈయనేంటీ ఇంత సింపుల్‌గా మామూలు దుస్తులు ధరించి, కనీసం కొయ్య కుర్చీలో కూడా కాకుండా కటిక నేలమీద చతికిలబడి కూచుని విద్యార్థులతో ఇంత కులాసాగా నవ్వుతూ మాట్లాడుతున్నారు? నమ్మగలమా! కళ్లెదుట కనిపిస్తుంటే నమ్మక తప్పదు మరి. ప్రస్తుత కేరళ విద్యాశాఖ మంత్రి సి. రవీంద్రనాథ్‌ ఆయన. రాజకీయాలలోకి రాక మునుపు కెమిస్ట్రీ ప్రొఫెసర్‌. సింపుల్‌గా ఉండటం ఆయన నైజం. మంత్రి అయినా కూడా ఆయన తన సహజ స్వభావాన్ని పోగొట్టుకోలేదు సరికదా సామాన్య జనంతో మరింత సామాన్యంగా మెలుగుతున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఈ ప్రొఫెసర్‌గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి గత మూడేళ్లలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య దాదాపు ఐదు లక్షలకు పెరిగింది.

అంతకుముందు గత పాతికేళ్లుగా కేరళలో ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోతూ వస్తోంది. ఈ ట్రెండ్‌ను ఈయన పూర్తిగా మార్చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం నలభై వేల తరగతి గదులను నిర్మించారు. అదీ లాప్‌టాప్‌లూ, మల్టీ మీడియా ప్రొజెక్టర్ల వంటి అత్యాధునిక సదుపాయాలూ, పూర్తి హంగులతో! ఇటీవల ఆయన పెరూర్‌క్కడలోని ప్రభుత్వ బాలికల హైయర్‌ సెకండరీ హైస్కూల్‌కి వెళ్లినప్పుడు అక్కడ ప్రఖ్యాత చరిత్రకారులు ప్రొఫెసర్‌ కె.ఎన్‌. ఫణిక్కర్‌తో విద్యార్థినులు మాట్లాడుతున్నప్పుడు ఆయన కుర్చీ పక్కనే ఈయన నేలపైన కూర్చుని, తాదాత్మ్యంతో ఆయన మాటలు వింటూ కనిపించారు. అదీ విద్యార్థులు సోఫాల్లో కూర్చుని ఉండగా! అందుకే కాబోలు... కేరళలో విద్యాప్రమాణాలు అంతగా పెరిగాయి. అభినందనలు ప్రొఫెసర్‌ రవీంద్రనాథ్‌ గారూ!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top