పర్యావరణ కవిత్వ నేత్రం

 Ecological poetry eye - Sakshi

‘అభివృద్ధి క్రమం అంతా ప్రకృతి హక్కుల ఉల్లంఘనే’ అంటారు కవి, చిత్రకారుడు, ఫొటోగ్రాఫర్, పర్యావరణ కార్యకర్త అయిన సత్య శ్రీనివాస్‌. ‘మనం ఈ భూమి నైసర్గిక స్వరూపాన్ని పూర్తిగా మార్చలేదు కాని, భూ వినియోగ స్వరూపాన్ని మార్చుకుంటూ పోతున్నాం’. దాని ఫలితాలు ఏమిటో మనకు తెలుసు. పరిస్థితి ఇంకా దుర్భరం కాకముందే మనలో ఒక పచ్చని ఆలోచన మొలకెత్తించుకోవాల్సిన అవసరం గురించి తాపత్రయపడతారు శ్రీనివాస్‌. ఇలాంటి కవి కార్యకర్తలు ప్రపంచవ్యాప్తంగా సామాజిక బాధ్యతగా వినిపిస్తున్న గానం ఇకో పొయెట్రీ. ఇది, ‘ప్రకృతితో సంబంధాన్ని పునరావృతం చేసుకునే ధ్వని. ప్రకృతి విధ్వంసంపై ప్రతిఘటన. మెరుగైన, ఆరోగ్యకరమైన ప్రకృతి కోసం పర్యావరణ సంరక్షణ ప్రణాళికల్ని, చట్టాల్ని ప్రోద్బలించేది’. 
నా జీవితం
నే చనిపోయిన తర్వాత, జీవితాన్ని ఇవ్వాలి
నన్ను పోషించిన వాటికి
భూమి నా శరీరాన్ని తనలో ఇముడ్చుకుంటుంది
మళ్లీ మొక్కలకిస్తుంది
గొంగళి పురుగులకి కూడ
పక్షులకి
నా తర్వాత వాళ్లకి
ప్రతి దానికీ దాని వంతుంది
జీవిత చక్రం ఎప్పటికీ ఆగిపోకుండా

–ఒక నేటివ్‌ అమెరికన్‌ కవి

ఆన్‌లైన్లో కవిసంగమం వేదికగా రాసిన ఈ పర్యావరణ కవిత్వ వ్యాసాలు ఇప్పుడు పుస్తకంగా వచ్చాయి. మనిషికీ ప్రకృతికీ మధ్య ఉన్న సంబంధాన్నీ, ఉండాల్సిన దగ్గరితనాన్నీ పెరిగిన ఎడాన్నీ కూడా భిన్న అనుభవాలూ ఉటంకింపుల ద్వారా రచయిత చర్చిస్తాడు. కేతు విశ్వనాథరెడ్డి అన్నట్టు, ‘ఇది పర్యావరణ కవిత్వ సంకలనం కాదు. పర్యావరణ కవిత్వ మూలాలనూ, ప్రేరణలనూ, చోదక శక్తులనూ పరిచయం చేస్తున్న పుస్తకం. ప్రకృతి విధ్వంసానికీ, పర్యావరణ సంక్షోభానికీ దారితీసిన, దారితీస్తున్న యథార్థ ఘటనలనూ, వాటి నేపథ్యాలనూ వివరించిన పుస్తకం’. పర్యావరణ కవిత్వ స్పృహే అంతగా లేని తెలుగు సాహిత్య లోకంలో ఏకంగా పర్యావరణ కవిత్వాన్ని చర్చించే పుస్తకం రావడం గమనించాల్సిన విషయం.

(మట్టిగూడు పరిచయ సభ నవంబర్‌ 5న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి మినీ హాల్లో జరగనుంది.)

మట్టిగూడు; రచన: జి.సత్యశ్రీనివాస్‌; పేజీలు: 166; వెల: 120; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌.
ఫోన్‌: 24224453 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top