క్రానిక్‌ పెయిన్‌ని స్వీట్‌ పెయిన్‌గా మార్చేది పద్యమే

E-Mail Interview with poet Ravi Virelli - Sakshi

అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉన్నవాడిక్కూడా ఎందుకీ కుందాపన?
మన చుట్టు అందరూ ఉంటారు. అన్నీ ఉంటాయి. అయినా తెలియని ఒంటరితనం దిగులు కడుతుంది. దేశానికి దూరంగా ఉన్నపుడు అది ద్విగుణం అవుతుందనుకుంటా. ఆధునిక జీవితంలోని సంక్లిష్టత మన చుట్టూ మనకు తెలియకుండానే శత్రు సైన్యాన్ని మోహరిస్తుంది. ఈ కుట్రను చేధించాలంటే ఏదో కావాలి. దాన్ని కనుక్కునే దారిలో తారసపడి, నాతో నడిచిన తోడు ఈ కుందాపన. అన్ని దార్లు మూసుకుపోయినపుడు పద్యం తనలోకి ఆహ్వానిస్తుంది. నా దృష్టిలో కష్టమనే chronic painని ఇష్టమైన sweet painగా మార్చేది పద్యం.

2012లో ‘దూప’ తర్వాత ఐదేళ్లకు కుందాపన తెచ్చారు. అప్పటి మీలోని కవికీ ఇప్పటికీ తేడా ఏమిటి?
ఈ ఐదేళ్ళలో రాసిందానికంటే చదివిందే ఎక్కువ. కొన్ని వేల కవితలు, ఎంతో మంది కవుల జీవితానుభవాలు చదివాను. ఐదేళ్ళ కిందటి నా కవిత్వంలో ఒక అమాయకత్వం ఉండేది. కవిత్వం మీద ఒక గుడ్డి ప్రేమ ఉండేది. ఇప్పుడు కవిత్వం మీద కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏర్పడ్డాక, ఆ గుడ్డిప్రేమను evaluate చేసుకోవడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో కవితలు ఎలా ఉండాలో/ఉండకూడదో తెలిసింది. నిజం చెప్పాలంటే ఈ ఐదేళ్ళలో పొల్యూట్‌ అయ్యాను.

ఆ పొల్యూషన్‌ కవిని ఎదిగేలా చేయదంటారా? ఏమిటి  సరిగ్గా మీరనేది?
ఒక విషయాన్ని అధ్యయనం చేసినప్పుడు దాని మీద పూర్తి అవగాహన వస్తుంది. కొన్ని మెళకువలు తెలుస్తాయి. అవి కవిత్వాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడినా ఒక్కోసారి కవిత్వం purityనే దెబ్బతిసే ప్రమాదం ఉంటుంది. కవి అద్దిన మెరుగులు తన స్వీయానుభవపు స్వచ్ఛతకు భంగం కలిగించనివిగా ఉండాలి. నలుగురు చదవడానికి అనుకూలంగా మార్చే ప్రక్రియలో తెలియకుండానే ఇంప్యూరిటీస్‌ని కలుపుతామేమో! పొల్యూట్‌ అవడం అంటే కవిత్వంతో ఆ honeymoon రోజులు అయిపోయాయి; ఇక సంసారం చేయడానికి కావాల్సిన లౌక్యం నేర్చుకుంటున్నా అని.

కవిత్వమంటే మీరు జార్చుకున్నదాని నెమరువేతా? ఇంకేమైనా?
వయసు పెరుగుతున్న కొద్ది జ్ఞాపకాలూ అనుభవాలూ పెరుగుతాయి. కవిత్వం జీవితం నుంచే చిగురిస్తుంది కాబట్టి, కవిత్వంలో తొంగిచూసే వస్తువులూ ఉపయోగించే పోలికలూ జ్ఞాపకాల్లోంచే జారిపడతాయి. కానీ, కవిత్వం ఒక్క నెమరువేత మాత్రమే కాదు; ఆ నెమరువేతను ఉల్లిపాయలా నంజుకుంటూ తినే చద్దన్నం.
 
మీదైన రచనా పద్ధతి ఏమైనా ఉందా?
ఏదైనా ఒక ఎమోషన్‌ సముద్రపుటలలా ఎగిసినపుడు ఆ అనుభవాన్ని ఉన్నదున్నట్టూ రాయడానికే ఇష్టపడతాను. కుందాపన టైటిల్‌ పొయెమ్‌ అలా రాసిందే. కవిత చివరంచు పట్టుకుని పైకి ఈదుతూ శీర్షికను దొరకబట్టుకున్న రోజులూ ఉన్నాయి. ఒక్కోసారి కొన్ని వాక్యాలు మనసులో మనసు లేకుండా చేస్తాయి. అలా ఒక వాక్యం బుర్రలో రొద చేసినపుడు ఆ వాక్యం చుట్టూ కవితను అల్లిన సందర్భాలున్నాయి. కవితలకు సమాధానంగా కూడా కవితలు రాసాను.

(కుందాపన; కవి: రవి వీరెల్లి; ప్రతులకు: 8–145/89, సప్తగిరి కాలనీ, మియాపూర్, హైదరాబాద్‌–49. కవి మెయిల్‌: ravinder.verelly@gmail.com)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top