వి+జయ+దశ+మి

Dussehra Festival Special Story - Sakshi

ప్రాచీన రుషులు ఏ పేరుని పెట్టినా అందులో గమనించాల్సిన అనేక రహస్యాలు– అక్షరాల్లో, పదాల్లో, పదాల విరుపుల్లో... ఇలా ఉండనే ఉంటాయి. వాటిని తెలుసుకున్న పక్షంలో పండుగలలో దాగిన గొప్పదనం అర్థమై పదికాలాలపాటు మనం ఈ పండుగ సంప్రదాయాన్ని కొనసాగించగలిగిన వాళ్లం– మీది తరం వాళ్లకి అందజేయగలిగిన వాళ్లం కూడా కాగలం. ఈ దృష్టితో చూస్తే ఈ పండుగ పేరు ‘జయదశమి’ కాదు. విజయ దశమిట.పైగా విజయ ‘దశ’మి ఏమిటి? పదిరోజులపాటు సాగే పండుగట ఇది. మంచిదే! పదిరోజుల పాటే ఉందుకు సాగాలి? సరే! పదిరోజులపాటూ పండుగ చేసుకోకుండా ‘10వ రోజునే ఎందుకు పండుగగా చేసుకోవాలి? ఈ పదిరోజుల్లోనూ మరి మూలా నక్షత్రం రోజున సరస్వతీ పూజా, దుర్గాష్టమి రోజున దుర్గాపూజా కూడా ఉంటూంటే, విజయం మాత్రం 10వ రోజునే వచ్చిందంటూ ‘విజయదశమి’ నాడే విశేష పూజని ఉదయం సాయంకాలాల్లో చేస్తారా? ఎందుకని? ఇలా ఎంతగా ఆలోచించడం మొదలెడితే అంతా ఆశ్చర్యంగానే ఉంటుంది కదా! లోపలికి వెళ్లి రహస్యాలని తెలుసుకుందాం!

జయం వేరు– విజయం వేరు
కేవలం మనకున్న అంగబలంతో (మనుష్యుల సహాయం) అర్ధ (దాడి చేయడానికి కావలసిన ధనం) బలంతో ఎదుటివారి మీదికి వెళ్లి గెలుపుని సాధించగలిగితే– గెలిస్తే దాన్ని ‘జయం’ అనాలంది శాస్త్రం. ఇలా సాధించిన ‘జయం’ ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. ఇది నిజం కాబట్టే ఈ యుద్ధంలో గెలుపుని సాధించిన రాజు పైసారి యుద్ధంలో గెలుపుని సాధించని సందర్భాలెన్నో కనిపిస్తాయి మనకి. అశాశ్వతమైన గెలుపుని ‘జయం’ అనాలంది ధర్మశాస్త్రం. అదే మరి ‘విజయ’మైతే అది సంపూర్ణం శాశ్వతం కూడా. జయానికీ విజయానికీ మధ్యనుండే తేడా అనేది అంగబలాన్నీ అర్ధబలాన్నీ మరింతగా సమీకరించుకున్న కారణంగా వచ్చేది కాదు. ‘జయం’ అంటే మనుష్య శక్తితో సాధింప» డేదీ, సాధించుకునేదీ అయితే– విజయమనేది మనకి రాబోతున్న గెలుపుకి భగవంతుని అనుగ్రహం తోడైతే లభించేది ఔతుంది.
మనకి కావలసిన అన్ని శక్తులూ ఉన్నా భగవంతుని అనుగ్రహం లేని పక్షంలో మనకి కలిగే గెలుపు సంపూర్ణం శాశ్వతం కానే కాదు. ఇది నిజం కాబట్టే అర్జునునికి ఉన్న పేర్లలో ఒకటి ‘విజయు’డనేది. అంటే ఎల్లకాలమూ అతనికి భగవదనుగ్రహం ఉంటూనే ఉంటుంది సుమా! అని తెలియజెప్పడమన్నమాట. ఆ కారణంగానే అర్జునుని కంటె గొప్పవాళ్లైన ఏకలవ్యుడూ కర్ణుడూ కూడా అతణ్ణి గెలవలేకపోయారు. పైగా ఏవేవో కారణాల వల్ల ఓడిపోయారు కూడా.

మళ్లీ ఇదే అర్జునునికి, భగవదనుగ్రహమనేది ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వీడి వెళ్లినప్పుడు (నిర్యాణమైనప్పుడు) ఉండే వీలే లేకపోయింది. ఆ కారణంగానే అంతఃపుర కాంతలందరికీ రక్షణగా ఉంటూ ఆ స్త్రీలని తెస్తూన్న సందర్భంలో దోవలు కొట్టేవాళ్లంతా అర్జునుని మీద తిరగబడి అర్జునుణ్ణి కావడి బద్దలతో మోదారు. అంటే ఏమన్నమాట? కృష్ణుడున్నంతకాలమే అర్జునునికి ఆ శక్తి ఉండి ‘విజయు’డయ్యాడు. ఆయన గతించాక అర్జునుడు కేవలం ‘పార్థునిగా’నే (కుంతీదేవి పుత్రునిగా మాత్రమే) అయిపోయాడు.

కాబట్టి జయమంటే గెలుపు– విజయమంటే భగవంతుని కృపానుగ్రహాల కారణంగా లభించిన గెలుపని అర్థమన్నమాట! అందుకే సంప్రదాయం తెలిసిన ఎవరికైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నామంటూ చెప్పి పాదాభివందనాన్ని చేస్తే– ‘జయోస్తు’ అనరు. ‘విజయోస్తు’ అనే ఆశీర్వదిస్తారు. ‘నీకు గెలుపు లభించుగాక! దానికి పరమేశ్వరుని అనుగ్రహం ఉండుగాక! ఆ కారణంగా నీది శాశ్వతమైన గెలుపుగా మారుగాక!’ అని దాని అర్థమన్నమాట.

తనంత తానుగా అమ్మే ఓ దేవత అవుతూంటే, మళ్లీ ఆమెకి గెలుపుకోసం మరో దేవతానుగ్రహం కావాలా? అప్పుడే కదా ఆమె జయం– విజయం– ఔతుంది? ఇదేమిటనిపిస్తుంది.
రాక్షసులూ దేవతలూ అనే ఇద్దరూ ఆయా స్థానాలని పొందింది కేవలం తమకి తాముగా ఆచరించిన తపస్సు వల్లనే. అంటే సాధించిన తపశ్శక్తి కారణంగానే.ఈ నేపథ్యంలో రాక్షసులు ఎక్కడ దేవతలని జయించలేమో? అనే దృష్టితో మరింత మరింత తపస్సుని చేశారు. వాళ్లు ఎంత స్థాయి తపస్సుని చేశారంటే– తానొక్కతే గాని వెళ్లి యుద్ధానికంటూ దిగితే చాలనంత. దాంతో ఆమె గణపతి నుండి పాశాన్నీ, కుమారస్వామి నుండి శక్తి ఆయుధాన్నీ, తన భర్త శంకరుని వద్దనుండి శూలాన్నీ, శ్రీ మహావిష్ణువు నుండి చక్రాన్నీ... ఇలా ఇన్నింటినీ ధరించి (8మంది దేవతల నుండి 8 తీరుల తపశ్శక్తిని ఆయుధాల రూపంలో స్వీకరించి అష్టభుజిగా) ఆమె రోజుకొక్క రాక్షసుణ్ణి చొప్పున వధించుకుంటూ వచ్చి వచ్చి 9 మంది రాక్షసులని వధించాక 10 రోజున 10వ రాక్షసుడైన మహిషుణ్ణి వధించింది. ఇలా 9 దాటి 10 వ వధ కాబట్టీ, విజయాన్ని సాధించిన 10వ రోజు కాబట్టీ ‘విజయదశమి’అయింది.

10 (దశ)కున్న గొప్పదనం
10 అనేది పూర్ణసంఖ్య. తన వెనుక 9టిని అండగా కలిగిన సంఖ్య. దిక్కుల సంఖ్య 10. తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తరాలు నాలుగూ, ఈశాన్య ఆగ్నేయ నిరృతి వాయవ్యమనే విదిక్కులూ (దిక్కుకీ దిక్కుకీ మధ్యన ఉండేవి) నాలుగు, పైనా కిందా అనే రెండూ కలిపి 10 మాత్రమే.

శ్రీ హరి ఈ లోకంలో ఉన్న అందరినీ (84 లక్షణల జీవరాశుల్ని) రక్షించే నిమిత్తం ఎప్పటికి ఏది అవసరమో గమనించి అప్పటికి ఆ అవతారాన్నెత్తుతూ క్రమంగా మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ కృష్ణ అనే 9 అవతారాలని ముగించి ఇక తప్పదనే దృష్టితో ‘కల్కి’ అవతారాన్నెత్తి మొత్తం అందర్నీ సంహరించి యుగానికి ముగింపుని 10వ అవతారంతోనే చేశాడు.
పది తర్వాత అంకెలన్నిటిలోనూ పది అంకె ప్రవస్తావన ఉంటూనే ఉంటుంది. ఏకాదశి (1+10=11), ద్వాదశ (2+10=12) త్రయోదశ (3+10=13) చతుర్దశ (4+10=14)... ఈ తీరుగా ఉంటూనే ఉంటుంది.
వ్యక్తి శరీరం కూడా బాల్యం– బుద్ధిబలం– శరీరబలం – కంటిబలం తగ్గడం– శుక్రశక్తి తగ్గడం– రక్తం తగ్గడం– మానసిక ధైర్యం తగ్గడం– శరీరం స్పర్శనీ, కళ్లు చూపునీ, చెవులు వినికిడినీ, ముక్కు వాసననీ, నాలుక రుచినీ కోల్పోతుంది ప్రతి పదేళ్లకీ. (1 నుండి 10 వరకూ బాల్యం, 11 నుండి 20 వరకూ బుద్ధిబలం... ఇలా ఎదిగిన శరీరం తగ్గుదలవైపుకి వెళ్తూ 91 నుండి 100కి అన్ని అవయవాల దిగుదలకీ వ్యక్తి గురవుతూ ఉంటే ఇక్కడ కూడా ప్రాధాన్యం 10 కే కదా!

కేవలం ఓటమి అనేదే లేకపోవడం కాదు. పవిత్రత కూడా ఏమాత్రమూ చెడకపోవడం ఉంటుంది ఈ విజయదశమి రోజున. అమ్మవారు ఈ విజయదశమి రోజున జమ్మిచెట్టు నీడన ఉంటుంది. జమ్మిచెట్టునే సంస్కృతంలో శమీ అంటారు. లోకంలో ఎక్కడైనా అపవిత్రత అనేది ఉండే చోటుగా శ్మశానాన్ని చెప్తారెవరైనా. ఆశ్చర్యకరమైన అంశమేమంటే జమ్మిచెట్టు– అమ్మవారు ఈ విజయదశమి రోజున ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంటారో, అది అపరాజితాస్థలం. ఆ జమ్మిచెట్టు మాత్రమే శ్మశాన స్థలాన్ని కూడా పవిత్రీకరించగల శక్తి కలది.  ఈ కారణంగానే అమ్మవారు జమ్మిచెట్టు కింద కూర్చుని దర్శనమిస్తూ– అ– పరాజిత–నని తన గూర్చి మనకి అర్థమయ్యేలా అనుగ్రహిస్తారు అందర్నీ వీరు, వారు అనే భేదం లేకుండా!

ఇంత లోతు అర్థం కల 10వ తిథి అయిన దశమి నాడు అమ్మ రాక్షసులపై విజ యాన్ని సాధించింది.అందుకే అపరాజితఇంతటి విజయాన్ని సాధించిందీ, 9 దాటి 10వ నాడు విజయ రహస్యాన్ని మనకందించిందీ అమ్మ కాబట్టే ఆమెకి ఈ విజయదశమి నాటి పేరు– ఆమె చేసిన కృత్యాలని బట్టి– అ– పరాజిత– అని. పరాజయం (ఒటమి) అనేదే ఎరుగని తల్లి– లేని తల్లి. (న+ పరాజిత= అపరాజిత)
తన్నో దుర్గిః ప్రచోదయాత్‌!– డా. మైలవరపు శ్రీనివాసరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top