తాగని విలన్

తాగని విలన్ - Sakshi


మరో కోణంగబ్బర్ సింగ్ అసలు పేరు గబ్బర్ సింగ్ కాదని అంజాద్‌ఖాన్ అని తెలియని వాళ్లు ఈ దేశంలో ఇంకా చాలామందే ఉన్నారు. అసలు పేరు కన్నా తెరపేరు జనానికి అంతబాగా పట్టడం అంజాద్ ఖాన్ అదృష్టం (తెలుగులో ‘అంజిగాడు’ అనబడే బాలకృష్ణకు ఆ వైభోగం దక్కింది). గబ్బర్ సింగ్ షోలేలో తాగినట్టుగా కనపడడు. కాని ఆ తర్వాతి చాలా సినిమాల్లో విస్కీగ్లాస్ పట్టుకుని కనిపిస్తాడు. అయితే నిజ జీవితంలో అతడు మద్యం ముట్టడన్న సంగతి చాలామందికి తెలియదు. అంజాద్ మరణానికి అతడు తాగే టీలే కారణం అని అన్నవాళ్లు ఉన్నారు. అంత పిచ్చి అతడికి టీ అంటే. రోజుకు కనీసం ఇరవై ముప్పై కప్పులు అదీ డబుల్ చక్కెరతో తాగేవాడట.కాని చివరి రోజుల్లో కనిపించిన స్థూలకాయానికి కారణం అది కాదు. 1986లో షూటింగ్ కోసం ముంబై నుంచి గోవా వెళుతుంటే అంజాద్‌ఖాన్‌కు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. చనిపోవాల్సిన మాటే. అయితే బతికించడానికి ఇచ్చిన మందులు సైడ్ ఎఫెక్ట్స్ చూపి అతణ్ణి స్థూలకాయుణ్ణి చేశాయి. అంత పెద్ద విలన్ స్థూలకాయం వచ్చాక కామెడీ పాత్రలు చేయాల్సి వచ్చింది. అలా ఉన్నా కూడా ఆ ప్రమాదం తాలుకు దుష్ఫలితం అతణ్ణి వెంటాడింది. ఆరేళ్ల తర్వాత హార్ట్ ఎటాక్ రూపంలో బలి తీసుకుంది. చనిపోయేనాటికి అతడి వయసు కేవలం 51. అయితే అతడి ముగ్గురు పిల్లలూ వృద్ధిలోకి వచ్చారు. సినిమా, నాటక రంగాలలో పని చేస్తున్నారు. ఇండస్ట్రీలో వాళ్ల పట్ల ఇంకా ఆదరణ ఉంది. అంజాద్‌కు అమితాబ్ ఆప్తమిత్రుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. వాళ్లిద్దరూ కలిసి తమ స్నేహానికి గుర్తుగా ‘యారానా’ తీశారు. ఇద్దరూ భయంకరమైన యాక్సిడెంట్లకు గురయ్యారు. కాని అంజాద్ అమితాబ్‌ను ఒంటరివాణ్ణి చేసి వెళ్లిపోయాడు. 1975లో సినిమాకు 50 వేలు తీసుకున్న స్టార్ విలన్ కథ ఇది. 

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top