లవ్‌ యూ.. బీ బ్యాక్‌

Doctor Madhavi Corona Emergency Services Special Story In Sakshi Family

‘గుడ్‌ మార్నింగ్‌ మమ్మీ.. ఎలా ఉన్నావ్‌? నిన్నటికన్నా మెరుగ్గా ఉంది కదా! నువ్వు త్వరగా కోలుకుంటావ్‌. కోలుకోవాలని రోజూ దేవుడికి దండం పెట్టుకుంటున్నా. ఇంట్లో నువ్వు లేకపోతే ఏం బాగాలేదు. పుస్తకాలు ముందేసుకున్నా చదవలేకపోతున్నా. నువ్వే గుర్తొస్తున్నావ్‌. మమ్మీ.. ఐ నీడ్‌ యూ! నువ్వు లేకపోతే నేనే కాదు నాన్న, అమ్మమ్మ ఎవ్వరం ఉండలేం. శక్తి తెచ్చుకుని పోరాడు.. గెలిచి ఇంటికి రా మమ్మీ.. నన్ను హగ్‌ చేసుకో.. ప్లీజ్‌.. ప్లీజ్‌.. ఐ లవ్‌ యూ.. నువ్వంటే నాకెంత ఇష్టమో నువ్వూహించలేవు మమ్మీ.. ప్లీజ్‌ కమ్‌ బ్యాక్‌’ పద్దెనిమిదేళ్ల మిన్నాలీ వాట్సప్‌ మెసేజ్‌ పెట్టింది వాళ్ల అమ్మకు.

‘లవ్‌ యూ’ అని ఆన్సర్‌ చేసింది 61 ఏళ్ల ఆ అమ్మ. ‘మమ్మా.. బీ బ్యాక్‌’ కూతురి అభ్యర్థన.‘వచ్చేస్తాను’ అంటూ అమ్మ మాటైతే ఇచ్చింది. కాని వెళ్లలేదు. కూతుర్ని హగ్‌ చేసుకోలేదు... ఆశ పెట్టి రాకుండా పోయిన అమ్మ  కోసం పొగిపొగిలి ఏడుస్తోంది ఆ బిడ్డ. ఆ బాధను, కోపాన్ని, వేదనను ప్రభుత్వాల మీద వెళ్లగక్కుతోంది... ‘ఆయుధాల్లేకుండా సైనికుడిని యుద్ధంలోకి పంపిస్తారా? మరి మాస్క్‌లు, పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్స్‌ లేకుండా మా అమ్మనెందుకు ఐసీయూలోకి పంపారు?’ అంటూ! అవును వాళ్లమ్మ డాక్టర్‌.. మాధవి అయా.

1994లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు కుటుంబంతో. న్యూయార్క్‌లోని వుడ్‌హల్‌ ఆసుపత్రిలో పనిచేసేవారు. వృత్తి అంటే ప్రాణం ఆమెకు. కరోనా నేపథ్యంలో ఎమర్జెన్సీ వార్డ్‌లో డ్యూటీ వేశారు మాధవికి. సర్జికల్‌ మాస్క్‌ తప్ప ఇతర పర్సనల్‌ కేర్‌ ఎక్విప్‌మెంట్స్‌ ఏవీ లేవు. అయినా వెనకడుగు వేయలేదు. సర్జికల్‌ మాస్క్‌తోనే ఐసీయూలో కరోనా పేషంట్స్‌కు సేవలు అందించింది. ఉన్నట్టుండి ఒకరోజు దగ్గు స్టార్ట్‌ అయింది. మామూలే అనుకొని ఇంట్లోనే తన గదిలో విశ్రాంతి తీసుకుంది. మూడు రోజులు గడిచేసరికి జ్వరం పట్టుకుంది. అప్పుడు అనుమానం మొదలైంది ఆమెలో. భర్త సహాయంతో ఆసుపత్రికి వెళ్లింది. వైద్యపరీక్షలో కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆ రోజు నుంచి ఐసోలేషన్‌ వార్డ్‌లోనే ఉండిపోయింది.

కూతురు మిన్నాలీ, భర్త రాజ్‌లతో మాధవి అయా 

కూతురు, భర్త ఫోన్‌లో మాట్లాడినా తిరిగి మాట్లాడే ఓపిక లేనంత నీరసించి పోయింది. మినాల్‌ తల్లిని బాగా మిస్‌ అయ్యింది. తల్లి జ్ఞాపకాలు ఆమెను వెంటాడసాగాయి. ఉదయం షిఫ్ట్‌కు హాజరుకావడానికి ఏ మూడింటికో నిద్రలేచి ఇంటి పని, వంట పని మొదలుపెట్టేది. కళ్లు మూసుకునే అమ్మ అలికిడిని ఆస్వాదించేది తను. ఆసుపత్రికి రెడీ అయ్యి.. తన గదిలోకి వచ్చి.. తన నుదుటి మీద ముద్దు పెట్టి ‘బై’ అని చెప్పి వెళ్లిపోయేది అమ్మ. తనూ డాక్టర్‌ కావాలనేది అమ్మ కోరిక. తనకు, అమ్మకూ ఉన్న కామన్‌ ఇంట్రెస్ట్‌ ట్రావెలింగ్‌. ఇద్దరికీ స్విట్జర్లాండ్‌ అంటే ఇష్టం. ‘నువ్వు డాక్టర్‌ అయ్యాక స్విట్జర్లా్యండ్‌లో సెటిల్‌ అవుదాం. కొండల మధ్య చిన్న ఇల్లు కట్టుకుందాం’ అనేది. ఆ మాటలు, అమ్మ ఇచ్చే ధైర్యం అన్నీ బాగా గుర్తొచ్చేవి మిన్నాలీకి.

అందుకే  గంటగంటకు మెసేజ్‌లు పెట్టేది అమ్మకు. ఎప్పుడో గాని రిప్లయ్‌ వచ్చేది కాదు మాధవి నుంచి. అదీ పొడిపొడిగా. మాధవి ఆసుపత్రిలో జాయిన్‌ అయిన పదమూడో రోజున ఆ పొడి పొడి మెసేజ్‌ కూడా ఆగిపోయింది. మిన్నాలీకీ అర్థమయ్యే లోపే ఆసుపత్రి నుంచి ఫోన్‌ వచ్చింది మాధవి ఈజ్‌ నో మోర్‌ అని. ఇంటికొచ్చి కూతురిని అక్కున చేర్చుకోలేకపోయింది మాధవి. తల్లిని పట్టుకొని తనివితీరా ఏడ్చే భాగ్యం కలగలేదు మిన్నాలీకి. ఆమడ దూరం నించే ఆమె భౌతికకాయాన్ని చూడాల్సివచ్చింది. 

‘నువ్విలా వెళ్లిపోవడం కరెక్ట్‌ కాదమ్మా... నువ్వు దీనికి డిజర్వ్‌ కాదు.. ప్లీజ్‌ కమ్‌ బ్యాక్‌’ అంటూ కుమిలిపోతోంది ఆ అమ్మాయి. ‘కరోనా పేషంట్స్‌ను ట్రీట్‌ చేస్తున్న డాక్టర్ల సేఫ్టీ పట్టించుకోండి’ అంటూ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తోంది. ‘నేను డాక్టర్‌ కావాలి.. నా గురించి అమ్మ కన్న కలను నెరవేర్చాలి’ అని చెప్తోంది మిన్నాలి  నిశ్చయమైన స్వరంతో!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top