జీవితంలో చేయకూడనివి...

జీవితంలో చేయకూడనివి...


ఆత్మీయంనమ్మకద్రోహం, అనుబంధాలను తెంపుకోవడం, ఇచ్చిన మాట తప్పడం, ఎదుటివారి మనస్సు నొచ్చుకునేట్లు ప్రవర్తించడం... ఈ నాలుగింటినీ చేయకూడదు. ఎందుకంటే గాయపడిన హృదయం చేసే ఆక్రందన పైకి వినిపించదు, లోలోపలే క్షోభిస్తుంది, నరకయాతన అనుభవిస్తుంది. తద్వారా మనోబలం సన్నగిల్లిపోతుంది.ఇక, అసత్యాలు ఆడటం... కొందరికి ఊరికే అబద్ధాలాడటం అలవాటు. ఒక అబద్ధం ఎదుటివారి ప్రాణాలనో, కాపురాన్నో, జీవితాన్నో నిలబట్టేలా ఉండాలి కానీ, తీసేసేలా ఉండకూడదు. నమ్మకద్రోహం... అవతలివారికే కాదు, నమ్మకద్రోహానికి పాల్పడేవారికి కూడా అపాయకరమే. మనం ఎదుటివారికి ఏమి చేస్తామో, అటువంటి ఫలం అంతకు మిక్కిలిగా మనకు లేదా మన సంతానానికి సంక్రమించి తీరుతుంది. అదేవిధంగా ఎదుటివారి మనస్సు నొచ్చుకునేటట్లు చేయడం వల్ల తాత్కాలికంగా మనకు ఆనందాన్ని ఇవ్వవచ్చునేమో కానీ, వారు ఎంతగా బాధపడతారో, తిరిగి అంత బాధనూ మనం అనుభవించవలసి వస్తుంది. ఇది కర్మసిద్ధాంతం. అనుబంధాలను తెంపుకోవడం కూడా అంతే! మనని ఇష్టపడేవారు, మన బాగోగులు కోరుకునేవారు, మనమీద ఆధారపడేవారితో అనుబంధాలను బలవంతంగా తెంచుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదు.అనుబంధాలకు విలువ ఇచ్చేవారు తమకిష్టమైనవారిలో వంద లోపాలున్నప్పటికీ, వారిని ప్రేమించడానికి ఒక్క కారణం చాలంటారు. నచ్చనప్పుడు ఏదో ఒక కారణం చెప్పి మరీ తప్పుకుంటారు. అనుబంధాలను తెంచుకున్న మనిషి సముద్రమంతటి ఒంటరితనాన్ని అనుభవించాల్సి వస్తుంది. అది వినడానికి సముద్ర ఘోష తప్ప మరెవరూ ఉండరు.

Back to Top