శ్రమ విలువ

divorce case is currently running between - Sakshi

వంటింటి సింక్‌లో మీగడ కట్టి ఎండిపోయిన పాల గిన్నెను కడగడం తక్కువ శ్రమ, టీమ్‌ లీడర్‌గా కాన్ఫరెన్స్‌హాల్లో బ్రెయిన్‌వాష్‌ చెయ్యడం ఎక్కువ శ్రమ అనుకోవడం  పొరపాటు. 

వాళ్లిద్దరూ భార్యాభర్తలు. ఇప్పుడు కాదు. కొన్నాళ్ల క్రితం వరకు. ఇద్దరి మధ్య ప్రస్తుతం విడాకుల కేసు నడుస్తోంది. భర్త సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్‌. భార్య గృహిణి. కోర్టు వాయిదాలకు హాజరు కావడానికి భర్తే భార్యకు దారి ఖర్చులు ఇవ్వాలని అంతకుముందే ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు ఉన్నది బెంగళూరులో. భార్య ఉన్నది ముజఫర్‌నగర్‌లో. భర్త బహుశా బెంగళూరులోనే ఉంటాడనుకోవాలి. ఈ మధ్య ఆయనకు భార్య తరఫు లాయరు నుంచి నోటీసు వచ్చింది. గత వాయిదాలన్నిటికీ కలిపి ఫ్లయిట్‌లో బెంగళూరు వచ్చిన నా క్లయింటు ప్రయాణాలకు మొత్తం ఇన్ని వేల రూపాయలు ఖర్చయ్యాయి కాబట్టి వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలన్నది సారాంశం. భర్త కోపం నషాళానికి అంటింది. అసలు కేసును వదిలేసి, కొసరు కేసుగా కర్ణాటక హైకోర్టులో భార్యపై కేసు వేశాడు. ‘‘ఇంట్లో ఉండి ఆమె చేసే రాచకార్యాలు ఏమున్నాయి? తీరిగ్గా రైల్లో రావచ్చు కదా. డబ్బులు ఇస్తున్నాను కదా అని ఫ్లయిట్‌లో రావడం ఏమిటి?’’ అని అభ్యంతరం తెలిపాడు. హైకోర్టు నింపాదిగా కేసు వింది. ‘‘గృహిణికి కూడా ఒక ప్రొఫెషనల్‌ ఉన్నంత బిజీగానే ఉంటుంది. కాబట్టి తమరు ఆ డబ్బును చెల్లించవలసిందే’’ అని ఆదేశాలు జారీ చేసింది. ఆ మొత్తం సుమారు ముప్పై వేల రూపాయలు. ఆయన పేరు గౌరవ్‌రాజ్‌ జైన్‌. ఆమె పేరు శ్వేతా జైన్‌. 

శ్రమించే మనుషులను బట్టి, వారి హోదాను బట్టి మనం శ్రమ విలువలను అంచనా వేస్తాం. మనుషులు, వాళ్ల హోదాలు ఎంతవైనా కానివ్వండి. శ్రమ విలువ మాత్రం ఒకటే. ఎక్కువ తక్కువలు ఉండవు. వంటింటి సింక్‌లో మీగడ కట్టి ఎండిపోయిన పాల గిన్నెను కడగడం తక్కువ శ్రమ, టీమ్‌ లీడర్‌గా కాన్ఫరెన్స్‌హాల్లో బ్రెయిన్‌వాష్‌ చెయ్యడం ఎక్కువ శ్రమ అనుకోవడం పొరపాటు. ఎందుకనో ఇంటి శ్రమపై మనకు తక్కువ భావం ఉంటుంది. ‘అది శ్రమపై తక్కువ భావం కాదు, శ్రమ చేస్తున్న మనిషిపై తక్కువ భావం’ అనుకుంటూ ఉంటాం. నిజానికి శ్రమపైనే గౌరవం లేకపోవడం అది. శ్రమ విలువను గుర్తించే సంస్కారం మనలో ఉంటే శ్రమ చేసే మనిషికీ విలువ ఇవ్వగలుగుతాం.  ›
– మాధవ్‌ శింగరాజు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top