పిల్లల్లో డిప్రెషన్‌..

Depression in childrens

ఒకప్పుడు యుక్తవయసు వారిని, పెద్దలను మాత్రమే వేధించే డిప్రెషన్‌ ఇప్పుడు చిన్న పిల్లలను సైతం వేధిస్తోంది. ఏడేనిమిదేళ్ల పిల్లలు సైతం దీని బారిన పడుతున్నారు. ఇది వారి చదువుతోపాటు, జీవితంలోని ఇతర అంశాలపైనా ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో పిల్లల సమస్యను తల్లిదండ్రులు త్వరగా గుర్తించి, పరిష్కారాల్ని కనుగొనడం అవసరం. అందుకోసం ముందుగా తల్లిదండ్రులకు పిల్లల్లో కలిగే డిప్రెషన్‌పై అవగాహన ఉండాలి.
                       – సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌

డిప్రెషన్‌ అంటే..
ఇదో మానసిక సమస్య. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో బాధపడడం, ఒంటరిగా ఫీలవడం, భయపడడం వంటి మానసిక స్థితి తలెత్తుతుంది. కొందరు ఈ స్థితి నుంచి త్వరగా బయటపడతారు. మరికొంద రు మాత్రం ఆ పరిస్థితిలోనే ఉండిపోతారు. అంటే నిత్యం భయపడడమో, ఆందోళనకు గురవడమో, ఒంటరిగా ఫీలవడమో చేస్తుంటారు. ఇవన్నీ డిప్రెషన్‌ లక్షణాలు. డిప్రెషన్‌ అంటే తీవ్రమైన మానసిక కుంగుబాటు. అయితే ఇది శారీరక సమస్య కూడా అయ్యుండొచ్చని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు. దీని వల్ల డిప్రెషన్‌ కూడా శారీరక సంబంధమైనదని, రోగ నిరోధక వ్యవస్థలో మార్పుల వల్ల ఈ సమస్య రావొచ్చని కొందరు పరిశోధకుల నమ్మకం. దీని లక్షణాలు ఒక్కరోజులో కనిపించవు. డిప్రెషన్‌ స్థితికి మారడానికి కొంత సమయం పట్టొచ్చు. ఒకప్పుడు యుక్తవయసువారిలో, పెద్దల్లో మాత్రమే ఈ సమస్య ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు పిల్లలు కూడా దీని బారిన పడుతుండడం విచారకరం. డిప్రెషన్‌కు గురవుతున్న చిన్నారుల శాతం ప్రతి ఏటా పెరుగుతోంది.

లక్షణాలు..
పిల్లల ఆకలిలో ఆకస్మిక మార్పులు. అంటే అతిగా ఆకలి వేయడం లేదా ఆకలి తగ్గిపోవడం.
నిద్రలోనూ మార్పులు. ఎక్కువ సేపు నిద్రపోవడం, లేదా రాత్రుళ్లు చాలా సేపు మెలకువగా ఉండడం.
బాధ, నిరాశతో ఉన్నట్లు కనిపించడం. అలసట, నీరసంగా ఉండడం.
ఏకాగ్రత లోపించడం. ఏ విషయంపైనా సరిగ్గా శ్రద్ధపెట్టలేరు.
అపరాధ భావంతో కుంగిపోవడం. తగినంత గుర్తింపు లేదని బాధపడం.
అతి సున్నితత్వం. ఎక్కువగా కోపం రావడం, చిరాకుపడడం.
నిత్యం తలనొప్పి, కడుపునొప్పితో బాధపడడం. చికిత్సకు కూడా పెద్దగా స్పందించపోవడం.
క్రీడలు, చదువు, ఇతర అంశాల్లో దేనిపైనా ఆసక్తి లేకపోవడం.
తోటివారితో సరిగ్గా కలవకపోవడం. ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు.
సరిగ్గా మాట్లాడలేకపోవడం. అంటే భావవ్యక్తీకరణ సక్రమంగా ఉండదు.
ఒంటరిగా ఏడ్వడం. తమలోతామే సంభాషించుకోవడం.
ఉన్నట్టుండి చదువులో, ఆటల్లో వెనుకబడిపోవడం
ఈ లక్షణాలు కనిపిస్తే వారిలో డిప్రెషన్‌ ఉందేమోనని అనుమానించాలి. వారికి తగిన చికిత్స అందించేందుకు వైద్యుల్ని సంప్రదించాలి.

కారణాలు..
పిల్లల్లో డిప్రెషన్‌ సాధారణమే అయినా, దీనికి అనేక కారణాలుంటాయి. ముఖ్యంగా పిల్లలు ఎక్కువ రోజులు అనారోగ్యానికి గురవుతుంటే, తమ శారీరక స్థితిని చూసి వారు ఆందోళన చెందుతారు. తోటిపిల్లల్లాగా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నందుకు బాధపడతారు. ఆరోగ్యం కోసం వాడే మందుల వల్ల శరీరంలోని రసాయనాల్లో మార్పుల వల్ల కూడా డిప్రెషన్‌ రావొచ్చు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన సమస్యలు కూడా డిప్రెషన్‌కు కారణం. అంటే తల్లిదండ్రులు నిత్యం గొడవపడడం, పేరెంట్స్‌కి, పిల్లలకు మధ్య సరైన సంబంధాలు లేకపోవడం, తల్లి లేదా తండ్రి ఒక్కరి పర్యవేక్షణలోనే పెరగడం, సరైన ఆదరణ లేకపోవడం వంటివి సైతం డిప్రెషన్‌కు దారితీస్తాయి. పాఠశాలలో తోటి విద్యార్థుల నుంచి వేధింపులు, ఇతరత్రా హింసకు గురైన వారు ఈ సమస్య బారిన పడతారు. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. జన్యుపరమైన అంశాలు కూడా కారణమవుతాయి.

నివారణ..
ఇదేమీ నివారించలేని సమస్య కాదు. కానీ, ముందుగా తల్లిదండ్రులకు ఈ అంశంపై అవగాహన ఉండాలి. చిన్నారుల్లో డిప్రెషన్‌ లక్షణాలు రెండువారాలపాటు కనిపిస్తే, పిల్లల మానసిక వైద్యుల్ని సంప్రదించాలి. వారు వివిధ లక్షణాల ఆధారంగా వ్యాధిని నిర్ధరిస్తారు. దీనికి కచ్చితమైన వైద్యపరమైన పరీక్షలేమీ అందుబాటులో లేవు. కానీ, రోగి మానసికి స్థితి ఆధారంగా సమస్యను గుర్తించి, చికిత్స అందిస్తారు. చికిత్సలో భాగంగా మందులతోపాటు, సైకోథెరపీ కూడా అవసరం కావొచ్చు. పిల్లలకు యాంటీ డిప్రెషెంట్స్‌ అతిగా వాడడం మంచిది కాదు.

మరిన్ని జాగ్రత్తలు..
డిప్రెషన్‌ను తగ్గించేందుకు కేవలం మందులపైనే ఆధారపడడ మంచిది కాదు. ఈ ఔషధాల్ని అతిగా వాడితే ఇతర సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది.
ఈ సమస్యకు కారణమైన అంశాలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. తల్లిదండ్రులు నిత్యం గొడవలు పడుతుంటే, ఇకపై వాటికి దూరంగా ఉండాలి.
తోటి పిల్లల నుంచి వేధింపులు ఉంటే వాటిని నివారించేలా చూడాలి. అవసరమైతే పిల్లల్ని మరో పాఠశాలలో చేర్పించడం మంచిది.
వారి చుట్టూ ఉండే వాతావరణం ఎప్పడూ బావుండేలా చూడాలి. చిన్నారుల మానసిక స్థితిని నిత్యం గమనించాలి.
ఏ రకమైన సమస్యలున్నా, అవి చిన్నారులదాకా రాకుండా చూడాలి. వారితో రోజులో తగినంత సమయం గడిపేందుకు ప్రయత్నించాలి.
వారిని ఆదరణగా చూస్తూ, సరైన ప్రోత్సాహం అందిస్తుంటే, సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.
ఒకసారి డిప్రెషన్‌ వచ్చిందంటే అది మళ్లీమళ్లీ వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో చాలా అప్రమత్తం అవసరం.
పోషకాలతో కూడిన మంచి ఆహారం కూడా మేలు చేస్తుంది. ఆటలు, ఇతర కరిక్యులర్‌ యాక్టివిటీస్‌పై వారు దృష్టి సారించేలా చేయడం వల్ల త్వరగా కోలుకుంటారు.
 అన్నింటికీ మించి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రేమ చాలా అవసరం. ఇది వారిని అనేక సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top