రుచికరమైన సమాధానం

Delicious answer - Sakshi

ఆ రోజు పాదుషా అనుకున్న పని అనుకున్నట్లుగా సవ్యంగా జరిగింది. దీంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ శుభవేళ ఏదైనా వైవిధ్యంగా ఉండే భోజనం తినాలనుకున్నాడు. వెంటనే తన వంటవాణ్ణి పిలిచి ఏదైనా మేలైన మాంసంతో భోజనం సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ వంటవాడు పొట్టేలు నాలుక మాంసంతో ఘుమఘుమలాడే రుచికరమైన సూప్‌ను పాదుషా ముందుంచాడు. పాదుషా ఆ సూప్‌ను ఎంతో ఇష్టంగా తిన్నాడు. ఇంత రుచికరమైన వంటకాన్ని అందించిన వంటవాడిని ఎంతగానో ప్రశంసించాడు.

ఇలా కొన్ని రోజులు గడిచాయి. పాదుషా గారికి మళ్లీ ఏదో శుభం జరిగింది. సేవకుడిని పిలిచి పొట్టేలులోని అతి చెడ్డ అవయవ మాంసాన్ని వండిపెట్టమని పురమాయించారు. ఆ సేవకుడు రాజాజ్ఞ మేరకు మళ్లీ పొట్టేలులోని నాలుక మాంసంతోనే సూప్‌ను సిద్ధం చేశాడు. మళ్లీ రాజుగారు నాలుక మాంసం వంటకాన్ని ఎంతో ఇష్టంగా తిన్నారు. అప్పుడు రాజుగారు తన సేవకుడితో ‘‘పొట్టేలులోని మంచి మాంసం వండి పెట్టమన్నప్పుడూ నాలుకనే వండి వార్చావు, చెడ్డ మాంసంతో వంట సిద్ధం చేయమన్నప్పుడు కూడా నాలుకనే వడ్డించావు.

దీని వెనుక ఉద్దేశమేమిటి’’? అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా ‘‘మన నాలుక మంచిదైతే ప్రపంచమంతా మంచిదవుతుంది. నాలుక చెడ్డదైతే ప్రపంచమంతా చెడ్డదవుతుంది. నాలుకను అదుపులో పెట్టుకోకపోతే సంబంధ బాంధవ్యాలు బెడిసికొడతాయి. అదే నాలుక ప్రేమను కురిపిస్తుంది. అదే నాలుక ద్వేషానికి కారణం అవుతుంది. మంచైనా, చెడైనా మన నాలుక మీద ఆధారపడి ఉంటుంది’’ చెప్పాడు వంటవాడు. అతను చేసిన వంటకంతో పాటు చెప్పిన సమాధానం కూడా రుచికరంగా ఉండటంతో వంటవాడికి రాజు అమూల్యమైన బహుమతులెన్నో ఇచ్చి సత్కరించాడు.

– అమ్మార్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top