గుర్తింపు మారని మహిళ జీవితం

Claire Messud New book The Woman Upstairs - Sakshi

కొత్త బంగారం

‘నేనెంత కోపిష్టినో మీరు తెలుసుకోవాలనుకోరు... అయినా, మంచిదాన్నే... మా అమ్మ మరణశయ్య మీదుండగా, నాలుగేళ్ళు సేవలు చేశాను. నాన్నకు రోజూ ఫోన్‌ చేస్తాను.’ యీ మాటలు, అమెరికన్‌ రచయిత్రి క్లెయిర్‌ మిస్యూద్‌ రాసిన ‘ద వుమన్‌ అప్‌స్టైర్స్‌’లో ప్రధాన పాత్రయిన 41 ఏళ్ళ నోరావి. తను అవిశ్వసనీయమైన కథకురాలిననీ, అతిశయోక్తుల అలవాటున్నదనీ నోరా మొదట్లోనే చెప్పుకుంటుంది. తనకు 37 ఏళ్ళున్నప్పుడు అనుభవమైన వృత్తాంతం గుర్తుకు తెచ్చుకుంటుంది. ‘మూడో అంతస్తు కొసన ఉండే ఒంటరి ఆడవాళ్ళం మేము. చప్పుడు చేయం. అందర్నీ నవ్వుతూ పలకరిస్తాం. మాకు కోపం వస్తుంది... ఎవరి కంటికీ కనబడం’ అనే నోరా, తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోలేని అసమర్థురాలు. వయసైపోతోందని దిగులు పడుతుంది. తనున్న పంజరమే సౌకర్యంగా భావిస్తుంటుంది.

ఆమె ప్యారిస్, రోమ్‌లో– కళాకారిణిగా, ఆధునిక జీవితం గడపాలనుకున్న స్త్రీ. కలలు నెరవేరక, మసాచుసెట్స్‌లో కేంబ్రిడ్జ్‌ ఎలిమెంటరీ స్కూల్‌ విద్యార్థులకు ఇష్టురాలైన టీచర్‌గా పని చేస్తుంటుంది. ‘‘నా సమాధి రాయిమీద ‘గొప్ప ఆర్టిస్ట్‌’ అని రాసుండాలి. నేనిప్పుడే చనిపోతే, ‘మంచి టీచర్, కూతురు, స్నేహితురాలు’ అనే ఉంటుంది. నాక్కావల్సినది– ‘మీరందరూ కట్టకట్టుకుని చావండి’ అన్న పెద్దక్షరాలు’’ అంటుంది. ఊపిరాడని తన మందకొడి జీవితంలోకి షాహిద్‌ల కుటుంబం ప్రవేశించినప్పుడు, నోరాకు ‘ఇంకా అంతా ముగిసిపోలేదు’ అన్న ఆశ పుడుతుంది. లెబనాన్‌లో జన్మించిన సికందర్‌ షాహిద్, ఆర్టిస్టయిన అతని ఇటాలియన్‌ భార్య సెరీనా, తన స్కూల్లోనే చేరిన వారి కొడుకు రెజాతో ప్రేమలో పడుతుంది.

వారి ప్రోద్బలంతో తనను తాను కళాకారిణిగా చూసుకుంటూ, ‘అపక్వంగా ముగిసిపోతోందనుకున్న నా జీవితపు తలుపులు తెరవడానికి వచ్చిన వారు ఈ ముగ్గురూ’ అనుకుంటుంది. నోరా, సెరీనా కలిసి విశాలమైన స్టూడియో అద్దెకు తీసుకుంటారు. తాను ప్యారిస్‌లో ప్రదర్శించబోయే ‘వండర్‌లాండ్‌’ లాంటి పెద్ద ప్రాజెక్టులు సెరీనా చేపడుతుండగా, నోరా మాత్రం ఎమిలీ డికెన్సన్‌ పడగ్గదుల వంటి బొమ్మరిళ్ళు వేస్తుంటుంది. ఒక రాత్రి స్టూడియోలో, సికందర్‌తో పక్క పంచుకుంటుంది. విమోచన, ప్రేరణ ఆమెను చుట్టబెట్టినప్పుడు– సెరీనాని తలచుకుంటూ స్టూడియోలో స్వయంతృప్తి పొందుతుందో రోజు. ‘నేనిలాగే ఉంటాను. అక్కరగా, కొరవడుతూ, అవసరంతో– అత్యాశగా ఎవరి జీవితాల్లోకీ ప్రవేశించను. ఎవర్నీ ఏమీ అడగను’ అన్న నిర్ణయాలున్న మనిషి– షాహిద్‌ల విషయంలో మాత్రం సరిగ్గా ఆ బలహీనతనే ప్రవేశించనిస్తుంది. ఆప్తమిత్రురాలైన దీడీ– నోరా వ్యామోహాన్ని గమనించి, ‘నీ బుర్రలో కథలల్లుకోకు’ అని సలహా ఇస్తుంది. ఇతర స్నేహితులు కూడా, ‘ఆ జంట నిన్ను తమ స్వలాభం కోసం వాడుకుంటున్నారు’ అని హెచ్చరిస్తారు.

షాహిద్‌లు, సంవత్సరం తరువాత తిరిగి ప్యారిస్‌ వెళ్ళిపోతారు.కొన్నేళ్ళ తరువాత సెరీనా ఆహ్వానంతో, ప్యారిస్‌లో ఉన్న ఆమె గ్యాలరీకి వెళ్తుంది నోరా. తను స్టూడియోలో చేసిన రహస్య చర్య యొక్క వీడియో కూడా అక్కడ ప్రదర్శనకు పెట్టుంటుంది. అది చూసిన నోరా ఆగ్రహపడుతుంది.ఇన్నేళ్ళూ తన్ని సజీవంగా ఉంచింది తన కోపమే అని గ్రహిస్తుంది. నోరా సికందర్‌తో సంబంధం పెట్టుకున్నందుకు సెరీనా కసి తీర్చుకుందో లేక వీడియోను తన కళాత్మక, ఆర్థిక లాభానికి ఉపయోగించుకుందో స్పష్టంగా చెప్పరు రచయిత్రి. కథ– యధార్థానికి ఒక అనిశ్చితమైన ఉజ్జాయింపో లేక నోరా అస్థిరమైన మనస్సు నుండి పుట్టుకు వచ్చిందో కూడా తేల్చరు.తన వాంఛ వల్ల మేల్కొని– తనకు అందని లోకం కోసం రూపాంతరం చెంది, తిరిగి మారిన స్త్రీ గురించింది ఈ నవల. కచ్చితత్త్వం, కొద్దిపాటి హాస్యంతో కూడింది. 2013లో ప్రచురించింది  నాఫ్‌. స్కాటియాబాంక్‌ గిలర్‌ ప్రైజుతో పాటు మరో నాలుగు అవార్డులకి ఎంపికయింది.
కృష్ణ వేణి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top