మీనూ

Children special story - Sakshi

పంజాబీ మూలం: కర్తార్‌సింగ్‌ దుగ్గల్‌

 అనువాదం: రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

గంటమోగీ మోగగానే పిల్లలు పొలోమని క్లాసురూమ్‌లు వదిలి బయటికి వచ్చేశారు. వాళ్ల తల్లిదండ్రులు, పనిమనుషులు వచ్చి వాళ్లను పిలుచుకుపోయారు. కొందరు స్కూలు బస్సులో వెళ్లిపోయారు. ఇంకొందరు ఇంకొక బస్‌ ట్రిప్‌కోసం ఎదురుచూస్తున్నారు. కొంతమంది మైదానంలో ఆడుకుంటున్నారు. ఇంకొంతమంది చెట్ల కొమ్మల్లో ఊగుతున్నారు. మీనూ క్లాస్‌రూం నుంచి బయటికి వచ్చాడు. వచ్చి రోజూ తనకోసం వచ్చే నౌఖరు ఉండే బాదం చెట్టు దగ్గరికి పరుగెత్తాడు. ఆ చెట్టు కింద ఆ నౌఖరు లేడు.మీనూ కంగారుపడ్డాడు. ఇంతకు ముందెప్పుడూ నౌఖరు రాకపోవడమనేది జరగలేదు. మీనూ ఒక్క క్షణం ఆ చెట్టువైపు అలా చూస్తూ ఉండిపోయాడు. ఎందుకో నౌఖరు రావడం ఆలస్యమైందనుకుంటూ కలకండ అమ్మేవాని చుట్టూ మూగిన గుంపు దగ్గరికి వెళ్లాడు.

ఇంగ్లిష్‌ పాఠశాలల్లో కిండర్‌ గార్డన్‌ క్లాసులు అన్నిటికన్నా చిన్నవి. అందులో మూడు తరగతులున్నాయి. మీనూది చిట్టచివరి క్లాసు. వాళ్ల ఇల్లు అక్కడికి ఒకటిన్నర మైలు దూరంలో ఉంది.మీనూ ప్రతిరోజూ ఉదయం వాళ్ల స్నేహితుని కారులో వస్తాడు. ఆ స్నేహితుడు మీనూ కన్నా పైక్లాసులో ఉన్నాడు. అతని కన్నా ముందు మీనూ క్లాస్‌ అయిపోతుంది. అందుకోసం మధ్యాహ్నం ముసలి నౌఖరు వస్తాడు మీనును ఇంటికి తీసుకుపోవడానికి.క్లాసులు పూర్తికాకముందే వచ్చి చెట్టుకింద నిలబడి ఉంటాడు నౌఖరు. ఈ రోజు రాలేదు. ఏమయ్యుంటుంది ఇవాళ?మీనూ కలకండ అమ్మే మనిషి దగ్గర చాలాసేపు నిలుచున్నాడు. అబ్బాయిలు ఆ మిఠాయిలు కొనుక్కొని వెళ్లిపోయారు. మీనూ ఒక్కడే నిలబడి ఉన్నాడు.

కాసేపైనాక బ్యాగ్‌ ఊపుకుంటూ బస్‌స్టాప్‌ దగ్గర ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి పరుగెత్తిపోయాడు. నిమిషానికొకసారి బాదం చెట్టు వైపు చూస్తున్నాడు. నౌఖరు రాలేదు. బస్సులు తిరిగొచ్చి రెండో ట్రిప్‌ కూడా బయలుదేరుతున్నాయి.మీనూ చెట్టుకొమ్మమీద కూర్చొని ఉన్న తన క్లాస్‌మేట్‌ను చూశాడు. అతడు మీనూను చూసి మీ నౌఖరు రాలేదా?అని అన్నాడు లాలీపాప్‌ చప్పరిస్తూ. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా లేదు’ అన్నాడు మీను.ఏం భయపడొద్దు’’ కొమ్మమీంచి దూకి దగ్గరికి వస్తూ అన్నాడు మీనుతో ఆ అబ్బాయి. అతను మీనూ భుజాల మీద చెయ్యి వేశాడు. ఇద్దరూ కలిసి స్కూలు తోటలో సీతాకోకచిలుకల్ని వెతుకుతూ వెళ్లారు. చాలాసేపైంది. అప్పుడు మీనూ స్నేహితుని నాన్న వచ్చాడు.

వీళ్ల నౌఖరు రాలేదు ఇవాళ’’ అని చెప్పాడు వాళ్ల నాన్నకు మీనూను చూపిస్తూ. దానికోసం భయపడవలసిన పనిలేదు. వాళ్ల నాన్న వచ్చేస్తాడు’’ అన్నాడు ఆయన. వాళ్ల కారు వెళ్లిపోయింది. మళ్లీ మీనూ ఏకాకి అయ్యాడు. బాదంచెట్టూ అలాగే ఉంది. నౌఖరు రాలేదు.దూరంగా కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉండటం చూశాడు మీనూ. వాళ్లు చాలా దూరంగా ఉన్నారు. ఎండ తీవ్రంగా ఉంది. మీనూ కాళ్లీడ్చుకుంటూ వాళ్లవైపు నడిచాడు. వాళ్ల ముఖాలేవీ తనకు పరిచయం లేదు. వాళ్లు తన క్లాస్‌వాళ్లు కారు. వాళ్లు కోతి కొమ్మచ్చి ఆట ఆడుకుంటున్నారు. మీను వాళ్లను చూస్తూ నవ్వుతూ నిలబడ్డాడు. ఆ పిల్లలు పెద్దవాళ్లు, బలంగా ఉన్నారు. వాళ్ల కన్నా చాలా చిన్నవాడు మీనూ. ఒకసారి వాళ్ల బంతి మీనూ కాళ్ల దగ్గర వచ్చిపడింది. మీనూ దానిని తీసుకొని వాళ్లవైపు విసిరేశాడు. అయినా వాళ్లు మీనూను ఆటలోకి పిలవలేదు. వాళ్ల ఆటలో వాళ్లు మునిగిపోయారు. 

కాసేపైనాక వాళ్లు కూడా తమ తల్లిదండ్రులు, నౌఖర్లు రాగా వెళ్లిపోయారు. ఇప్పుడు ఆటస్థలం నిర్మానుష్యంగా ఉంది. మీనూ మళ్లీ సంచీ తీసుకొని బాదం చెట్టు దగ్గరికి వెళ్లాడు. అప్పటికీ నౌఖరు రాలేదు.ఎండ ఇంకా ఎక్కువైంది. మీనూ గొంతు ఎండిపోతూంది. చాలాసేపు నిరీక్షించి, అటు ఇటు ఎండలో నడవడంతో అలసిపోయాడు. చెట్టుకు ఆనుకుని కూర్చున్నాడు. కాసేపటికి నిద్రపోయాడు.మీనూ అలా చాలాసేపు నిద్రపోయాడు. ఉన్నట్టుండి మేల్కొన్నాడు. అంతా నిశ్శబ్దం. విద్యార్థులూ, ఉపాధ్యాయులూ వెళ్లిపోయారు. స్కూలు శుభ్రం చేసి స్వీపర్‌ కూడా వెళ్లిపోయాడు. అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అది తనను మింగేస్తుందేమో అనిపించింది మీనూకు. మీనూ దప్పికతో అల్లాడిపోతున్నాడు. రక్తం గడ్డకట్టకుపోతున్నట్లుంది. తల తిరుగుతూంది. కళ్లముందు చీకట్లు కమ్మాయి. ఉన్నట్టుండి అతని గొంతులోంచి ఒక కేక వచ్చింది. నిస్సహాయంగా ఏడుస్తూ స్కూలు గేటు వైపు పరుగెత్తాడు.

గేటు దగ్గర నిలబడి ఉన్నాడు. కన్నీళ్లు చెక్కిళ్ల మీద జారుతున్నాయి. కార్లు, బస్సులు రోడ్డుమీద పరుగెత్తుతున్నాయి. టాంగాలు, రిక్షాలు కాస్త మెల్లగా పోతున్నాయి. మనుషులు నడిచిపోతున్నారు. ఇదంతా చూస్తూ మీనూ నిలబడి ఉన్నాడు. కన్నీళ్లు ఇంకిపోయాయి.రోడ్డు పక్కన పడివున్న డబ్బాలపై మీను చిన్న చిన్న రాళ్లు తీసుకుని విసురుతున్నాడు. గేటుమీద ఎక్కి ఇటూ అటూ ఊగుతున్నాడు. గేటు ముసల్ది మూలిగినట్లు శబ్దం చేస్తుంటే మీనూకు ఆనందం కలిగింది. ఆ తర్వాత దారిలో పోయే కార్లను లెక్కబెట్టాడు. ఒకటి, రెండు, మూడు, పది, పన్నెండు, ముప్ఫై, నలభై.అబ్బాయ్‌! ఎవరికోసం ఎదురుచూస్తున్నావ్‌?’’ ఎవరో అడిగారు. మీనూ ఉలిక్కిపడ్డాడు.ఇవాళ తనను ఇంటికి తీసుకుపోవడానికి ఎవరూ రాలేదు. ఒకటే నిరీక్షణ, దప్పిక, ఆకలి, అలసట.తన తండ్రి ఆకుపచ్చని కారులో వచ్చే మార్గం వైపు చూశాడు, ఖాకీ డ్రస్సులో నౌఖరు వచ్చే వైపు చూశాడు.అబ్బాయ్‌! ఎవరికోసం ఎదురుచూస్తున్నావు?’’ సైకిల్‌మీద వెళ్లే వ్యక్తి మళ్లీ అడిగాడు.

నన్ను ఇంటికి తీసుకుపోవడానికి ఎవరూ రాలేదు’’ అంటూ మళ్లీ వీధివైపు చూశాడు.

నీకోసం ఎవరు వస్తారు?
మా నాన్న నౌఖరు.
అతను రాకపోతే?
మా నాన్న వస్తాడు.
మీ నాన్న ఏం చేస్తాడు?
పెద్ద ఆఫీసులో పనిచేస్తున్నారు.
మీ యిల్లెక్కడ?
పెద్ద ఇంట్లో.
నేను మీ ఇంటికి తీసుకుపోనా?
వద్దు. మా నాన్న వస్తాడు.
తప్పకుండా వస్తాడా?
ఆ! తప్పకుండా.

ఆయన సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. మీనూకు వాళ్లమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. స్కూలు వదిలి ఒక్కడివే ఎక్కడికీ వెళ్లొద్దు. నౌఖరుతో తప్ప ఇంకెవరితోనూ ఎక్కడికీ వెళ్లొద్దు.తన తోటి పిల్లలు చెప్పే కథలూ మీనూకు గుర్తున్నాయి. పిల్లల్ని దొంగిలించి గోతాల్లో మూటగట్టి దూరంగా తీసుకుపోతారు. కొండలు, చెట్లు, పులులు, సింహాలు, ఏనుగులు ఉంటాయి. అక్కడ పిల్లల్ని చెట్లకు తలకిందులుగా వేలాడదీసి అగ్గిబెడతారు. కరిగిపోయే మెదడును తీసుకుంటారు.పిల్లల మెదడును కరిగించి మాజిక్‌ అయింట్‌మెంట్లు చేస్తారనే కథల్ని తలచుకొని వణికిపోయాడు మీనూ. వీధిలోకి పరుగెత్తాడు. పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి మెల్లగా నడుస్తున్నాడు. కలకండ అమ్మేవాని దగ్గరికి పోయి అతనివైపే చూస్తున్నాడు. అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను కనుమరుగయ్యేదాకా అలాగే చూస్తూ నిలబడుకున్నాడు మీనూ.

మీనూ మళ్లీ నడుస్తున్నాడు. అతని ముందు రెండు రోడ్లు కనిపించాయి. ఒకటి ఎడమవైపు, ఇంకొకటి కుడివైపు. మీనూ ఎడమవైపు రోడ్డుమీద నడుస్తున్నాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత ఆ రోడ్డు ఏడు సందులుగా చీలిపోయి ఉంది. మీనూ స్కూలుకు వెళ్లేటప్పుడు కార్లో వెళతాడు. తిరిగి నౌఖరుతో పాటు సైకిల్లో ఇంటికి తిరిగి వస్తాడు. ఇప్పుడు నడవవలసి వచ్చేసరికి అంతా అయోమయంగా ఉంది. మీనూ తన ఇంటికి వెళ్లే దారి కాకుండా మరోదారి పట్టాడు.
అతను నడుస్తూంటే అక్కడి ఇళ్లన్నీ కొత్తకొత్తగా కనిపిస్తున్నాయి. పరిచయం లేని ఇళ్లు కనిపిస్తున్న కొలదీ అతనిలో భయం పెరుగుతూంది. ఒకడుగు ముందుకేస్తుంటే రెండడుగులు వెనక్కి వేసినట్లు అనిపిస్తూంది. అస్పష్టంగా తాను దారి తప్పినట్లు తెలుసుకున్నాడు. ఆకలి, దప్పిక, అలసట.

ఉన్నట్టుండి మీనూ ఎగిరి గంతేశాడు. అక్కడొక ఆస్పత్రి కనిపించింది. ఆరు నెలల క్రితం తాను అక్కడే వైద్యం చేయించుకున్నాడు. ఒక ఏడాది క్రితం తన చెల్లెలు అక్కడే పుట్టింది. అక్కడినుంచి తన ఇంటికి దారి కనుక్కోవచ్చనుకున్నాడు. ఒక కారు వేగంగా వచ్చి అక్కడ ఆగింది. వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పిపోయింది. మీనూ బిత్తరపోయాడు. తల తిరిగిపోయింది. కళ్లు బైర్లు కమ్మాయి. ఎలాగో పేవ్‌మెంట్‌ మీదికి చేరుకున్నాడు. గజిబిజి రోడ్ల మధ్య ఇరుక్కున్నాడు. ఒక రోడ్డు పోయి ఇంకోదాంట్లో కలిసిపోతూంది. దానికి అడ్డంగా మరి రెండు రోడ్లున్నాయి. తాను ఎక్కడికి వెళ్తాడో మీనుకు అర్థం కాకుండా ఉంది.ఏడుస్తూ నడుస్తున్నాడు మీనూ. అబ్బాయ్‌! ఎందుకేడుస్తున్నావ్‌? ఒక ముసలాయన అడిగాడు. మీనూ బదులు పలకలేదు. ఒక కారు దూసుకుపోయింది. దాంట్లో ఒక స్త్రీ, ఒక పురుషుడు ఉన్నారు. మగాయన ఏడుస్తున్న బాబువైపు చూసి ఏదో అన్నాడు. కారు వేగంగా వెళ్లిపోయింది. ఒక కొత్త స్త్రీ ఎందుకేడుస్తున్నా బిడ్డా?అని అడిగింది. మీనూ ఏమీ చెప్పకుండానే పరిగెత్తాడు. ఒక పోలీసాయన మీనూను ఆపాడు. ఒక టాక్సీలో కూర్చోబెట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకుపోయాడు. మీనూ అరిచాడు, ఏడ్చాడు, గింజుకున్నాడు. పోలీసులు మీనూకు మిఠాయిలు ఇచ్చారు. 

మీనూను బతిమలాడి ఇంటి అడ్రస్‌ రాసుకున్నారు.ఒక పోలీసాయన వాళ్ల ఇంటికి వెళ్లాడు. దిగులుపడిపోయి ఉన్న అతని తల్లిదండ్రుల్ని కలుసుకున్నాడు. రోజూ మీనూను ఇంటికి తీసుకొచ్చే నౌఖరు ఆ రోజు సెలవు పెట్టాడు. ఆ విషయం మీనూ నాన్న మరచిపోయాడు. అమ్మ బజారుకు పోయి, నాన్న వచ్చినాక ఇంటికి వచ్చింది. అన్నం తిని ఇద్దరూ నిద్రపోయారు.పోలీసాయన వచ్చి సంగతి చెప్పగానే ఇద్దరూ స్టేషన్‌కు పరుగుతీశారు.అమ్మ పరుగెత్తుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్లింది. మీనూ వెనక్కి తగ్గాడు. ఆమె అయోమయంలో పడి కొడుకు వంక ఆశ్చర్యంగా చూసింది. నాన్న అతని దగ్గరికి వెళ్లాడు. మీనూ అతన్ని కొత్త వ్యక్తిని చూసినట్లు చూశాడు. మీ నాన్న కాదా బాబూ?’’ అడిగాడు పోలీసాయన.కాదు కోపంతో అన్నాడు మీనూ.ఈమె మీ అమ్మ కాదా? అమ్మను చూపిస్తూ అడిగాడు పోలీస్‌.కాదు అదే గొంతుతో చెప్పాడు మీను.మీనూ బిగ్గరగా ఏడ్చాడు.
( పున్నమిరాత్రి – ఇతర కథానికలు సౌజన్యంతో...)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top