భావ సారూప్యతనూ ‘బాబు’ భరించలేరా?

Chandrababu Naidu Joules Politics - Sakshi

‘మనం ఇద్దరం కలిసి పనిచేద్దాం.. రెండు తెలుగు రాష్ట్రాల సత్తా భారతదేశానికి చాటుదాం.. తెలుగు జాతి గౌరవాన్ని కాపాడుదాం.. దేశంలో కీలక పాత్ర పోషిద్దాం. అందులో భాగంగా మాకు 10–15 సీట్లు తెలంగాణ అసెంబ్లీలో కేటాయిస్తే  చాలు’ ఈ మాటలు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ముఖ్యమంత్రి  కేసీఆర్‌తో అన్న మాటలు కావు. ది గ్రేట్‌ విజినరీ లీడర్‌ చంద్రబాబు తన బామ్మర్ది హరికృష్ణ శవం సాక్షిగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో బతిమిలాడినంత పనిచేసి అభ్యర్థించిన మాటలు. తాను టీఆర్‌ఎస్‌కు స్నేహహస్తం చాటానని, కానీ వారు తిరస్కరించారనీ..’ ఇదే చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తుకు పోయే ముందు సంజాయిషీ ఇచ్చుకున్నడు మీడియాకు. కానీ.. అదే చంద్రబాబు ఇవ్వాళ నాలిక మర్లేసిండు. తెలంగాణ ప్రజలతో కలిసిపోవడమే జగన్‌ చేస్తున్న నేరమన్నట్టుగా దుష్ప్రచారం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను రెచ్చగొట్టే కుయుక్తులకు పూనుకుంటున్నడు. ఆంధ్రాకు దక్కే నదీజలాల వాటాను గుంజుకపోవడానికే కేసీఆర్‌ జగన్‌కు మద్దతిస్తాడంట.. ఆంధ్రాను దోచుకోవడానికే ఆంధ్రామీద ఆధిపత్యం చేయడానికే తెలంగాణ సీఎం కేసీఆర్‌.. జగన్‌తో దోస్తీకట్టిండట.. ‘ఇది మీకు సమంజ సమేనా తమ్ముళ్లూ’... అంటూ.. తన రెండు నాలి కలు మల్లేసి జనాన్ని ప్రశ్నిస్తున్నడు బాబు.

తెలుగు జాతి, తెలుగు ప్రజలు, తెలుగు ఆత్మగౌరవం, అంటూ నిత్యం తెలుగు పేరుతో బాకాలు కొట్టే ఈ తెలుగు పేటెంట్‌ హక్కుదారులు.. ప్రజా ఆకాంక్షల మేరకు తెలంగాణ ఆంధ్రా రాష్ట్రాల నడుమ భావసారూప్యతను కూడా భరించలేకపోతున్నరు. కేసీఆర్‌ జగన్‌లు తెలంగాణ ఆంధ్రా జాతీయ ప్రయోజనాల కోసం, ఢిల్లీలో కలసికట్టుగా ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ కలిసివుందాం.. అనుకుంటన్నరు.. అదెట్ల తప్పయితది?  రాష్ట్ర విభజన సందర్భంగా ఈ పచ్చమీడియా పెట్టిన పెడబొబ్బలు, ఐక్యత పేరుతో వూదిన బాకాలు అటు ఆంధ్రా ప్రజలు కానీ ఇక్కడి తెలంగాణ ప్రజలు కానీ మరిచిపోయిండ్రని అనుకుంటున్నరు. మరి ఇవాళ ఏమైంది తెలుగు జాతి ఐక్యత, గౌరవం? ఎందుకని తెలుగు రాష్ట్రాల నడుమ వైషమ్యాలను పెంచుతున్నదీ పచ్చమీడియా?కేంద్రం నుంచి రెండు రాష్ట్రాలకు రావాల్సిన రాజ్యాంగపరమైన హక్కులు కావచ్చు, విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు కావచ్చు. వీటిని దక్కించుకోవాలంటే కేంద్రం మీద ఒత్తిడి వుండాలె. దానికి ఎంపీ సీట్లలో ఎక్కువ సీట్లను దక్కించుకోవాలె. కలిసికట్టుగా చేయిచేయి కలిపి పోరాడాలె. విశాల జాతీయ అవసరాల దృష్ట్యా భావసారూప్యతను కలిగి ఉండాలె. అట్లా ఉండడమూ తప్పేనట.. తాను చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్టు... తాను కలిసిపోతే నికార్సయిన తెలుగు ఆత్మగౌరవం... అదే ఇతరులు ఆలోచిస్తే అది ఆంధ్రులకు చేస్తున్న అపచారమా?

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి, తెలంగాణ నాయకత్వం మొదటి నుంచీ మద్దతు తెలుపుతూనే ఉన్నది. కాకపోతే.. తమదీ వెనకబడిన రాష్ట్రమే కాబట్టి తమకూ అందుకు సమానమైన రాయితీలు గానీ, తద్వారా నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలుగానీ చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నది.. తెలంగాణ. ఇదే విషయాన్ని స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ పలుమార్లు ప్రకటించిండు కూడా. అవసరమైతే బాజాప్తా కేంద్రానికి లెటర్‌ రాస్తానని కూడా స్పష్టం చేసిండు. నదీ జలాల పంపిణీలో ఆంధ్రాకు అన్యాయం చేస్తారని పచ్చి అబద్ధాలు ఆడుతున్న బాబు అండ్‌ కో.. ఎక్కడైనా ఒకచోట నన్నా తెలంగాణ ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేసిందో చూపించగలరా? ప్రజా సంక్షేమాన్ని తమ స్వార్ధానికి బలిచేసి లాభాపేక్షతో పక్కరాష్ట్ర ప్రభుత్వాలతో వ్యవహా రాలు నడిపే బాబు అండ్‌ కో ఇవాళ ఆంధ్రా తెలం గాణ ప్రాంతాల ప్రజలు కలిసి తమ సమస్యలను న్యాయబద్ధంగా విన్‌ విన్‌ పద్ధతుల్లో బతుకు బతకనివ్వు అనే విధానాన్ని అనుసరించి కలిసి నడుద్దామంటే ఎందుకని శోకాలు పెడుతున్నట్టు? ఆనాడు తెలుగు ప్రజల ఐక్యత పేరుతో వీరు, వీరి మీడియా ఊదిన బాకాల మోతలు ఇంకా చెవుల్లో రింగు రింగుమంటూనే ఉన్నయి. నేడు అదే స్వార్థంతో ప్రజల నడుమ చిచ్చురేపడానికి పెడుతున్న శునక శోకాలూ వినబడుతూనే ఉన్నయి. వీటి నడుమ తేడాను గమనిస్తనే ఉన్నరు ఆంధ్రా ప్రజలు. రేపటి ఎన్నికల్లో తమ ఓటు అనే కర్రుకాల్చి రెడీగా పట్టుకొని ఉన్నరు.. బాబుకు వాతలు పెట్టడానికి.

కొసమెరుపు :  తెలుగు ప్రజల ఐక్యతను కోరుకుంటూ సోమవారం నాటి వికారాబాద్‌ సభలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనలను ప్రజలు ఆమోదించారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా విషయంలో సహకరిస్తామని.. పోలవరం నిర్మాణానికి కూడా సహకరిస్తామని సభా ముఖంగా స్పష్టం చేశారు.. తెలంగాణ బాగుపడాలని, ఇరుగుపొరుగుల మేలు కూడా తాము కోరుకుంటామని స్పష్టం చేశారు. తెలుగు ప్రజల ఐక్యతను కోరుకుంటున్న వారెవరో వేరు చేసి విద్వేషాలు రెచ్చగొడుతున్న వారెవరో ప్రపంచం గమనిస్తుంది.     – తెగువేరా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top