పిల్లల్లో వచ్చే క్యాన్సర్లు

Cancers in children - Sakshi

పెద్దవారిలో వచ్చే అన్ని రకాల క్యాన్సర్లూ పిల్లల్లోనూ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా వాళ్లలో రక్తసంబంధిత క్యాన్సర్లు (లుకేమియా), మెదడు కణుతులు (బ్రెయిన్‌ ట్యూమర్స్‌), లింఫోమా, సాప్ట్‌టిష్యూ సార్కోమా వంటివి ఎక్కువ.  పిల్లల్లో వచ్చే క్యాన్సర్‌లు సాధారణంగా ఎలాంటి లక్షణాలూ చూపకుండా అకస్మాత్తుగా జ్వరంతో బయటపడవచ్చు. కొంతలో కొంత ఉపశమనం ఏమిటంటే... పిల్లల క్యాన్సర్లు చాలా వరకు పూర్తిగా నయం చేయదగినవే.  మన దేశంలో ప్రతీ ఏడాదీ దాదాపు 45,000 మంది పిల్లలు క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. వీళ్లలో 70 శాతం మందికి వ్యాధి పూర్తిగా నయమవుతుంది. అయితే 30 శాతం మందిలో వారి జీవితకాలంలో అది ఎప్పుడో ఒకప్పుడు తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. చిన్నప్పుడు 20 ‘గ్రే’ల కంటే ఎక్కువగా రేడియేషన్‌కు గురైనా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ‘గ్రే’అంటే శరీరం గ్రహించిన రేడియేషన్‌ అని అర్థం. మామోగ్రామ్‌ వంటి పరీక్షలు మరీ చిన్నవయసులో చేయించుకోవడం కూడా అంత మంచిది కాదు. 30 ఏళ్లు పైబడ్డాక డాక్టర్‌ సలహా మేరకు చేయించుకుంటేనే మంచిది.  పన్నెండేళ్లు  పైబడ్డాక అమ్మాయికి గానీ, అబ్బాయికి గానీ క్యాన్సర్‌ చికిత్స వల్ల పునరుత్పత్తి వ్యవస్థ మీద ప్రభావం పడుతుందనుకుంటే, ముందుగానే వారి నుంచి అండాలను, వీర్యకణాలను సేకరించి భద్రపరు స్తుంటారు. 

పిల్లల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్‌ లుకేమియా. మనల్ని ఇన్ఫెక్షన్స్‌ నుంచి కాపాడే తెల్లరక్తకణాలు అపరిమితంగా పెరిగిపోవడమే లుకేమియా. ఇలా అధికంగా పెరిగిన తెల్లరక్తకణాలు ఎర్రరక్తకణాలను అడ్డుకుని రక్తాన్ని సరిగా సరఫరా కానివ్వవు. దీన్ని చాలావరకు నయం చేయగలం. ఈ చికిత్సలో కీమో, రేడియో ధెరపీలు ఉంటాయి. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, స్టెమ్‌సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ప్రక్రియలు ఈ క్యాన్సర్‌కు బాగా పనిచేస్తాయి. మొదటి బిడ్డకు రక్తసంబంధిత క్యాన్సర్‌ ఉంటే రెండో బిడ్డ విషయంలో కూడా జాగ్రత్త పడాలి.  పిల్లలు పాలిపోయినట్లుగా ఉండటం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, నీరసం, అలసట ఎక్కువగా ఉండటం, త్వరగా చర్మం కమిలిపోవడం, మచ్చలుమచ్చలుగా ఉండటం, తీవ్రమైన రక్తస్రావం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే లుకేమియాను అనుమానించాల్సి ఉంటుంది. రక్తపరీక్షలు, తుంటి లేదా ఎముకల నుంచి తీసిన మూలగ (బోన్‌మ్యారో)ను పరీక్షించడం ద్వారా దీన్ని కనుక్కోవచ్చు.  పెద్దవాళ్లలో కంటే పిల్లల్లో బ్రెయిన్‌ ట్యూమర్స్‌ ఎక్కువని చెప్పవచ్చు. పొద్దున్నే లేవగానే తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, ప్రవర్తించే తీరుమారడం, ఆందోళన, ఫిట్స్, చూపు/మాట మందగించడం వంటి లక్షణాలతో మెదడు కణితిని అనుమానిస్తారు. అది క్యాన్సర్‌ కణితి అయినా, కాకపోయినా ప్రమాదకరమే. మెదడులో కణితి వచ్చిన ప్రదేశాన్ని బట్టి సర్జరీతో దాన్ని తొలగించడమా లేక ఇతర చికిత్స ప్రక్రియలు అనుసరించడం మంచిదా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్సను నిర్ణయిస్తారు. ఒక్కోసారి మెదడు కణితిని రేడియో సర్జరీతో  తొలగిస్తారు. 

రోగనిరోధక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించే లింఫ్‌నాళాలకు సంబంధించిన క్యాన్సర్‌లో హాడ్జ్‌కిన్స్, నాన్‌హాడ్జ్‌కిన్స్‌ అనే రకాలుంటాయి. మెడ, చంకల్లో, గజ్జల్లో లింఫ్‌నాళాలు వాయడం, జ్వరం, చలి, ఆకలి తగ్గడం, రాత్రిళ్లు చెమటలు, దగ్గు, ఊపిరితీసుకోవడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలతో లింఫోమాలు బయటపడుతుంటాయి.      రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో అడ్రినల్‌గ్రంథిలో, మెడ, ఛాతీ, పొట్ట, పెల్విస్‌లలో వచ్చే కణితులు (న్యూరో)బ్లాస్టోమాలు, ఎముకలు, టిష్యూలలో వచ్చే ఈవింగ్‌ సర్కోమా, మూత్రపిండాల్లో వచ్చే నెఫ్రోబ్లాస్టోమా వంటివి పిల్లల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లు. పిల్లల్లో పూర్తిగా నయం చేయగలిగిన ఈ క్యాన్సర్స్‌ పెద్దవాళ్లలో కనిపిస్తే మాత్రం అంతే తేలిగ్గా నయం కాకపోవచ్చు. పుట్టుకతో వచ్చే లోపాలు, జన్యు కారణాలు పిల్లల్లో క్యాన్సర్‌కు దారితీయవచ్చు. కాబట్టి ముందు పుట్టిన బిడ్డకు క్యాన్సర్‌ ఉంటే రెండోబిడ్డ విషయంలో జాగ్రత్తగా ఉండటం, లక్షణాలు గుర్తించి సరైన చికిత్స అందించడం, పోషకాహార లోపాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవడం, చికిత్స తర్వాత కూడా డాక్టర్‌ సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.
Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421, Kurnool 08518273001

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top