గుడ్‌మింటన్‌

Biography of saina nehwal - Sakshi

బ్యాడ్మింటన్‌ ఇంత గుడ్‌గా ఉంటుందని తెలుసుకుంది. అమ్మానాన్నల్ని ప్రేమించడం... చేసే పనిని సంపూర్ణంగా చేయడం ఓటమిలో నిరాశపడకుండా ఉండగలగడం... విజయానికి తలెగరేయకపోవడం పడినప్పుడల్లా తిరిగి లేవగలగడం... లేచేటట్లు తనను తాను మలుచుకోవడం సంస్కారం అవసరమని... సంప్రదాయం గొప్పదని తెలుసుకోవడం సైనా నెహ్వాల్‌ బ్యాడ్మింటన్‌లో నేర్చుకున్న గుడ్‌ థింగ్స్‌.

కామన్వెల్త్‌ గేమ్స్‌లో రెండవ వ్యక్తిగత గోల్డ్‌ మెడల్‌ సాధించిన క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌. ఈ రికార్డు సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ ఆమె. అంతకంటే ముందు ఒక అర్జున అవార్డు, రాజీవ్‌ ఖేల్‌ రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్‌లు ఆమెకి భూషణాలుగా వచ్చి చేరాయి. ఎన్ని అలంకారాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చినా, ఆమె మాత్రం ఎప్పుడూ వదలని హస్తభూషణం బ్యాడ్మింటన్‌ రాకెట్‌ ఒక్కటే. ఎక్స్‌టెన్షన్‌ హ్యాండ్‌ (బ్యాడ్మింటన్‌ రాకెట్‌) తన జీవితంలో ఒక భాగం అంటోంది సైనా నెహ్వాల్‌.

2006లో ఫిలిప్పీన్స్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌తో మొదలుపెట్టి లెక్కకు మించిన టోర్నమెంట్‌లలో గెలిచారామె. బీడబ్లు్యఎఫ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో విజయం చేజారింది. అదే జూనియర్‌ చాంపియన్‌షిప్‌ని రెండేళ్ల తర్వాత గెలిచే వరకు ఆ దాహం తీరలేదామెకు. ఒలింపిక్స్, ఇండోనేసియా ఓపెన్, సింగపూర్‌ ఓపెన్, చైనీస్‌ తైపీ ఓపెన్‌లు గెలుచుకున్నారు. ఉమెన్స్‌ సింగిల్స్‌లో ఆమె గెలుచుకున్న స్వర్ణాలు ఆమె కీర్తిని పతాక స్థాయిలోకి తీసుకెళ్లాయి.

స్విస్‌ ఓపెన్, థాయిలాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రి, ఇండోనేసియా సూపర్‌ సిరీస్, డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌  సిరీస్‌లో విజయం దూరంగా ఉండిపోయింది. తిరిగి 2012లో లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు సైనా. మూడేళ్ల కిందట 2015 ఇండియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రిలో స్పానిష్‌ ప్లేయర్‌ కరోలినా మారిన్‌ మీద గెలిచి స్వర్ణంతో విజయ పరంపరకు మళ్లీ తెరలేపారు. అదే ఏడాది బీడబ్లు్యఎఫ్‌ సూపర్‌ సిరీస్‌లో గెలిచి బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ ర్యాంకింగ్‌లో నంబర్‌ వన్‌ కి చేరారు.

అదే స్థితప్రజ్ఞత
సైనా నెహ్వాల్‌ విజయాలను చూశారు, చేజారిన విజయాలనూ చూశారు. ఫలితం ఏదైనా అదే స్థితప్రజ్ఞత కనిపిస్తుంటుంది ఆమె ముఖంలో. అందుకు కారణం పేరెంట్స్‌ తనను మలిచిన తీరేనంటారామె. ఇంట్లో చిన్నమ్మాయి తనే. సైనా పుట్టినప్పుడు వాళ్ల కుటుంబం హర్యానాలోని హిస్సార్‌లో ఉండేది. సైనా తండ్రి హర్‌వీర్‌ సింగ్‌ నెహ్వాల్‌ హిస్సార్‌లోని చరణ్‌సింగ్‌ హర్యానా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌.

ఆ యూనివర్సిటీలోని క్యాంపస్‌ స్కూల్‌ సైనాలోని క్రీడాకారిణిని బయటకు తీసింది. అయితే ఆమె బ్యాడ్మింటన్‌నే కెరీర్‌గా ఎంచుకునేలా చేసింది మాత్రం హైదరాబాద్‌ నగరమే. సైనా తండ్రి ప్రొఫెసర్‌గా హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్‌జి రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీకి వచ్చారు. అప్పటికి సైనాకి తొమ్మిదేళ్లు. హైదరాబాద్‌కి రావడమే తనకు టర్నింగ్‌ పాయింట్‌ అంటారు సైనా. బ్యాడ్మింటన్‌ ప్రాక్టీస్‌కి అనువైన వాతావరణం ఉందిక్కడ. దాదాపుగా ఈ ఇరవై ఏళ్లలో ఆమెకు హైదరాబాద్‌తోనూ, బ్యాడ్మింటన్‌తోనూ అనుబంధం పెరిగిపోతూనే ఉంది.

గారాల పాపాయి
ఏ ఇంట్లో అయినా చిన్నవాళ్లకు కొన్ని ప్రత్యేక హక్కులు సంక్రమిస్తాయి. పెద్ద పిల్లలకు చిన్నప్పుడే బాధ్యత అలవరుస్తారు. చిన్న పిల్లలను పెద్దయినా గారాలు చేస్తుంటారు. సైనాకు కూడా అలాంటి ప్రత్యేకాధికారాలు ఉండేవి. ‘‘ఇంట్లో చిన్నమ్మాయిని కావడంతో అమ్మానాన్నలతోపాటు అక్క కూడా నన్ను సంతోషంగా ఉంచడానికే ప్రయత్నించేది. ఎంత గారం చేసినా నాకు బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం అలవడనీయలేదు మా పేరెంట్స్‌’’ అంటారు సైనా.

ఒకానొక సందర్భంలో ఆమెను విమర్శల వలయం చుట్టేసింది. ఊపిరాడనివ్వనంతగా ఉక్కిరిబిక్కిరి చేసింది. ‘సైనా ఓడిపోయింది. సైనాకు వయసైపోయింది. ఇక ఆమె రిటైర్‌ కావడమే మంచిది’ వంటి మాటలన్నీ వినిపించాయి. అప్పటికామెకు ఇరవై ఆరేళ్లు. నిజానికి ఇరవై ఆరేళ్లలో సైనా సాధించిన విజయాలు, స్ఫూర్తిదాయకమైన విషయాలు వందకు పైగానే ఉంటాయి. వాటన్నింటినీ పాతర పెట్టి విమర్శల కొరడా ఝళిపించారు. అదే చైనా వంటి క్రీడాస్ఫూర్తి మెండుగా ఉండే దేశాల్లో ఇలాంటి వాతావరణం ఉండదు. క్రీడాకారులకు గెలుపుఓటములు రెండూ ఉంటాయనే విచక్షణ ఉంటుంది.

ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన ప్రతి ఆటలో ఒకరే గెలుస్తారనే స్పృహ ఉంటుందక్కడ. ఓటమికి గురైన వాళ్లు ఆట పట్ల బాధ్యతారహితంగా, ప్రేమ లేకుండా ఆడారా? ఆటలో పోరాట పటిమ లోపించిందా అని చూస్తారు. బాధ్యతగా ఆడినప్పటికీ ప్రత్యర్థి అంతకంటే మెరుగైన ఆటతీరు కనబరిచిందా... అనే చర్చ మాత్రమే నడుస్తుందక్కడ. మనదేశంలో మాత్రం ‘గెలిచావా లేదా? నీ గెలుపు మీద మేమెన్నో ఆశలు పెట్టుకున్నాం. వాటిని నిలబెట్టాల్సిన బాధ్యత నీదే. నీ గెలుపు మీద మా పరువు ఆధారపడి ఉంటుంద’న్నంత విచక్షణారహితమైన ధోరణి కనిపిస్తుంది.

ఇలాంటి ఇంగితం లేని విమర్శలన్నింటినీ తన విజయాలతోనే పాతి పెట్టారు సైనా. ‘విమర్శల సమయంలోనూ, కాలికి గాయమై ఏడాదిన్నరపాటు ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నప్పుడు తనను తాను మళ్లీ మలుచుకోవడానికి సంపూర్ణమైన శక్తినిచ్చింది అమ్మానాన్నలు, ఫిజికల్‌ ట్రైనర్, కోచ్‌లే. వాళ్లు పడుతున్న తపన చూస్తే త్వరగా కోలుకోవాలని, తనను తాను ఇంకా మెరుగుపరుచుకోవాలనే కోరిక బలంగా కలిగేద’న్నారామె.

క్రీడారంగంలో మహిళలు తక్కువగా ఉన్న రోజుల్లో విజయవంతమైన క్రీడాకారిణిగా రాణించారామె. ఆ అడుగులలో నడవడానికి మరో తరం సిద్ధమైంది. ఇండియా ఇప్పుడు క్రీడలకు, క్రీడాకారులకు చక్కటి వాతావరణాన్ని కల్పిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు, కార్పొరేట్‌ సెక్టార్‌లలోనూ క్రీడాకారులకు మంచి అవకాశాలున్నాయి, స్పోర్ట్స్‌ను హాబీగా ఎంచుకోవడం మాత్రమే కాదు కెరీర్‌గా ఎంచుకోవడం కూడా మంచిదేనంటారు సైనా.

ఖాళీ టైమ్‌ దొరికితే సినిమాలు, టీవీ సీరియళ్లు చూస్తారు సైనా నెహ్వాల్‌. హిందీ సీరియల్‌ ‘భాబీ జీ ఘర్‌ పర్‌ హై’ ఆమెకిష్టమైన సీరియల్‌. మన వివాహ వ్యవస్థను అమితంగా గౌరవించే సైనాకు జీవితాశయాలు రెండే రెండు. ఒకటి బ్యాడ్మింటన్‌ ఆటలో బెస్ట్‌గా నిలవాలని. రెండోది జీవితంలో బెటర్‌ ఉమన్‌గా స్థిరపడాలని. ‘ఒక డాక్టర్, ఇంజనీర్, బిజినెస్‌ పీపుల్‌ ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగంలో ఇవ్వగలిగినంత బెస్ట్‌ సర్వీస్‌ ఇవ్వాలి, ఆ వ్యక్తికి గౌరవాన్నిచ్చేది ఆ నిబద్ధతే. సమాజానికి ఉపయోగపడేదీ, అవసరమైనదీ కూడా ఆ నిబద్ధతే’ అనేది సైనా నెహ్వాల్‌ ఫిలాసఫీ.

దేశం కోసం ఆడడమే వరం
విజయాలకు దూరమైనప్పుడు ఎన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, ఓటమిలో నేనెప్పుడూ గెలుపు పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆటలో పోరాటాన్ని, పోరాట స్ఫూర్తిని కొనసాగించాను. మళ్లీ టోర్నమెంట్‌ గెలిచి నన్ను నేను పాజిటివ్‌ పర్సన్‌గా నిలబెట్టుకోవాలనే ఆకాంక్షతోనే శ్రమించాను. విమర్శలన్నీ కూడా... నాలో తిరిగి ఈ విజయం సాధించడానికి కావలసినంత పట్టుదలను పెంచాయి. మనదేశానికి ప్రాతినిధ్యం వహించడమే గొప్ప వరం. దేశం కోసం సాధించిన విజయానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను.

– సైనా నెహ్వాల్‌  బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి (గోల్డ్‌కోస్ట్‌లో స్వర్ణం గెలిచిన సందర్భంగా)

అమ్మ...నాన్న... ఆట
సైనా జీవితంలో ముఖ్యమైన పాత్రలు మూడే మూడు. ఒకటి అమ్మ ఉషారాణి, రెండు నాన్న హర్‌వీర్, మూడు ఆట బ్యాడ్మింటన్‌. ‘ఆట నాకు జీవితం, అమ్మానాన్న దైవంతో సమానం’ అంటారు సైనా. తల్లిదండ్రులను దైవసమానంగా చూసే కూతురు ఉండడం హర్వీందర్‌ దంపతుల అదృష్టమేమో అనిపిస్తుంది. అందుకు ఈ కామన్వెల్త్‌లో జరిగిన సంఘటనే పెద్ద ఉదాహరణ. క్రీడాకారులకు ఏర్పాట్లు చేయడంలో ఎక్కడో పొరపాటు జరిగింది.

అప్పుడామె తండ్రికి గౌరవప్రదమైన స్థానం కల్పించడం కోసం నిర్వాహకులతో పోట్లాడడానికి కూడా వెనుకాడలేదు. ‘‘మా నాన్న రెండు రోజుల పాటు గేమ్స్‌ విలేజ్‌ బయటే ఉండిపోయారు. ఆయన్ని డైనింగ్‌ హాల్‌లోకి కూడా రానివ్వలేదు. ఇది ఎంతటి స్ట్రెస్‌ఫుల్‌ సిచ్యుయేషనో అర్థం చేసుకోండి. ఆర్గనైజర్ల నిర్లక్ష్యం మీద పోరాడవద్దా? నాకు టోర్నమెంట్‌ ఉంది, సరిగ్గా నిద్రపోవాలి. కానీ ఎలా నిద్రపడుతుంది, మా నాన్న అలా ఉంటే. నిద్రలేకనే ఆడాను.

ఇక్కడ అందరికీ సమస్యగా కనిపించింది నేను ఆ విషయంలో పోరాడడం గురించే. నేను పోరాడడం ఎవరికీ నచ్చలేదు. నా తల్లిదండ్రుల కోసం నేను పోరాడకుండా ఎలా ఉంటాను. నేను కాకపోతే మరెవరు పోరాడుతారు?’’ అని సూటిగా అడిగారు సైనా. తండ్రి కోసం బహుశా కూతుళ్లే ఇలాంటి పోరాటాలు చేస్తారేమో! ఆ సంఘటన చూసిన వాళ్లు కంటే కూతుర్నే కనాలనుకుంటారు. కూతురు లేని తల్లితండ్రులు తమకు కూతురు లేనందుకు ఆవేదన చెంది ఉంటారు.

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top