పాదాలు పదిలంగా

Beauty Tips For Legs in Rainy Season - Sakshi

బ్యూటిప్స్‌

సీజన్‌ మారే ప్రతిసారీ అతివ పాదాల చర్మం పొడిబారి పగుళ్లు రావడం సహజమే. వాతావరణంలో మార్పులు, దుమ్ము, ధూళి, కాలుష్యం ప్రభావం లాంటివి పాదాల మీద ఎక్కువగా చూపిస్తాయి. కాబట్టి, సీజనల్‌గా జరిగే మార్పుల సమయంలో కూడా మీ పాదాలను కోమలంగా ఉంచుకోవాలంటే... ఇలా చేయండి.

పాదాలకు కొబ్బరినూనెతో మర్దనా చేసిన తరువాత, గోరువెచ్చని నీటిలో పది నిమిషాలపాటు ఉంచాలి. తరువాత పాదాలను నీళ్లలో నుండి తీసివేసి, శుభ్రమైన పొడి బట్టతో బాగా తుడిచి... గోరింట, మందార పువ్వుల రసం, నిమ్మరరాలను సమపాళ్లలో తీసుకుని కలిపి పాదాలకు పట్టించాలి. ఆరిన తరువాత తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు డ్రైవాష్‌ అయి శుభ్రమై అందాన్ని సంతరించుకుంటాయి.

పగుళ్ల నుండి రక్షణ
రాత్రిపూట పడుకోబోయే ముందు పాదాలను శుభ్రంగా కడిగి, ఆరిన తరువాత మసాజ్‌ క్రీమ్‌ లేదా నూనెతో ఐదు నిమిషాలపాటు మర్దనా చేస్తే పాదాలకు రక్తప్రసరణ బాగా జరిగి, పాదాలు మృదువుగా ఉంటాయి.      
అలాగే పాదాలు, మోచేతుల వద్ద చర్మం గట్టిపడి, గరుకుగా మారినప్పుడు... ఆరు టీస్పూన్ల పెట్రోలియం జెల్లీ, రెండు టీస్పూన్ల గ్లిజరిన్, రెండు టీస్పూన్ల నిమ్మరసంను సమపాళ్లలో కలిపి మర్ధనా చేయాలి.  వారానికి రెండుసార్లు ఇలా చేస్తుంటే పాదాలు, మోచేతులు మృదువుగా మారుతాయి.
మీ వేళ్ళ మధ్యలో ఉన్న పగుళ్లలో గోరింట ఆకుల పేస్ట్‌ లేదా హెన్నా పొడిని నీటిలో కలుపుకుని పేస్టులా చేసుకుని పాదాలకు, వేళ్ల పగుళ్లలోనూ అప్లై చేయాలి. పూర్తిగా పొడిగా మారేంత వరకు ఉంచి, చల్లటి నీటితో శుభ్రం చేసి, టవల్‌తో తుడుచుకుంటే బాగుంటుంది.
యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటివైరల్‌ లక్షణాల పరంగా పసుపు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకే అతివలు కాళ్లకు పసుపు పూసుకోవడం మంచిది. పాదమంతటికీ రాసుకోవడం ఇష్టం లేకపోతే కనీసం వేళ్లమధ్యలో రాసుకున్నా మంచిదే.  
పసుపు రాసుకోవడం కుదరని వారు ఉల్లిపాయ రసం తీసుకుని కాలి వేళ్ళ మధ్య మసాజ్‌ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఎక్కువగా షూస్‌ ధరించే వాళ్ళకు ఉల్లిపాయ రసం ప్రభావవంతంగా పనిచేస్తుంది..
పుదీనా ఒక సహజ సిద్దమైన డియోడరెంట్‌ వలె ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, మంచి క్రిమినాశక తత్వాలు కూడా పుదీనాకు ఉన్నాయి. పుదీనా రసాన్ని పాదాలకు, కాలి వేళ్లకు పూసుకుని ఆరిన తర్వాత సాక్స్‌ ధరించడం వల్ల పాదాలు పదిలంగా ఉంటాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top