సంప్రదాయ సిరి

Beautiful Geetanjali has been recognized as a serial actress - Sakshi

బాలనటిగా వెండితెరపై మెరిసి, సీరియల్‌ నటిగా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుంటుంది బ్యూటిఫుల్‌ గీతాంజలి. జీ తెలుగులో వస్తున్న ‘సూర్యవంశం’ సీరియల్‌లో ‘సిరి’గా టీవీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. కూచిపూడి నృత్యం అన్నా, చక్కని కథలన్నా, సంప్రదాయ దుస్తులన్నా ప్రాణం అంటూ గీతాంజలి పంచుకున్న కబుర్లు ఇవి.

‘చిన్నప్పుడు సినిమా చూసిన ప్రతీసారి నేనూ సినిమాలో కనిపిస్తా’ అని అమ్మనాన్నలతో చెప్పేదాన్ని. నా ఆసక్తి గమనించిన అమ్మ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమకు పరిచయం చేసింది. అమ్మనాన్నల సపోర్ట్‌తో ‘మహాత్మ, మొగుడు, ఉయ్యాలా జంపాలా..’ వంటి సినిమాల్లో బాలనటిగా చేశాను. అలాగే టీవీ సీరియల్స్‌లోనూ బాలనటిగా చేశాను. ఇప్పుడు టీవీ ఆర్టిస్ట్‌గా మీ అందరికీ పరిచయం అయ్యాను.

సింగిల్‌ రోల్‌
మొదట ‘అగ్నిపూలు’ సీరియల్‌లో లీడ్‌ రోల్‌ చేశాను. చాలా మంచి పేరొచ్చింది. ఇప్పుడు ‘సూర్యవంశం’లో సిరి పాత్రలో నటిస్తున్నాను. లంగా ఓణీ పాత్రల్లో పల్లెటూరి అమ్మాయిలా ఉండటం అంటే చాలా ఇష్టం. అలాంటి పాత్రలు వస్తే మాత్రం వదులుకోలేను. సంప్రదాయ బద్ధంగా ఉండే ఆ కాస్ట్యూమ్స్‌ని బాగా ఇష్టపడతా. అలాగే, అల్లరిగా గడుసుగా ఉండే అమ్మాయిలా నటించాలని ఉంది. ఇప్పుడు సీరియల్స్‌లోనూ ఇద్దరు–మగ్గురు హీరోయిన్లు ఉంటున్నారు. సింగిల్‌ హీరోయిన్‌ కథ వస్తే చేయాలనుంది. అలాగే అవకాశాలు వస్తే సినిమాల్లోనూ మంచి పాత్రల్లో నటించి పేరు తెచ్చుకుంటాను.

చదువును వదల్లేదు
‘డ్యాన్స్‌ అంటే ఉన్న ఇష్టంతో కూచిపూడి నేర్చుకున్నాను. బాలనటిగా చేస్తూనే స్కూల్‌ చదువు పూర్తి చేశాను. ఆ తర్వాత వరుస షూటింగ్స్‌తో చదువు కుదరలేదు. అయినా, నేను చదువుకు దూరం కాలేదు. దూరవిద్య ద్వారా డిగ్రీ సెకండియర్‌ చదువుతున్నాను. పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాన్న లోకేశ్వర్‌ బ్యాంక్‌ ఉద్యోగి. నాన్నది వైజాగ్‌ కానీ, హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. అమ్మ అరుణ గృహిణి. తమ్ముడు చదువుకుంటున్నాడు. నేనీ రోజు ఇంత సంతోషంగా ఉన్నానంటే మా అమ్మనాన్నల సపోర్టే కారణం. సీరియల్స్‌ అంటే మొదట్లో అమ్మనాన్న అంతగా చూసేవారు కాదు. ఇప్పుడు నా ప్రతీ ఎపిసోడ్‌ని మిస్‌ కాకుండా చూస్తూ ఎంకరేజ్‌ ఏస్తారు. మార్పులు ఉంటే చెప్పేస్తారు.

చిన్నమ్మాయి అన్నారు
చైల్డ్‌ ఆరిస్ట్‌గా ఈ పరిశ్రమలోకి వచ్చాను కాబట్టి బయట యాక్టింగ్‌కి ఎలాంటి క్లాసులు తీసుకోలేదు. బాలనటిగా ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ ఇప్పటికీ ఉపయోగపడుతుంది. అలాగని నా సొంత నటనే మీదనే పూర్తి నమ్మకం పెట్టుకోను. సీనియర్‌ ఆర్టిస్టుల నటన గమనిస్తూ ఉంటాను. వారిని చూసి నా నటనలో మార్పులు చేసుకుంటూ ఉంటాను. ‘సూర్యవంశం’ సీరియల్‌కి తీసుకున్నప్పుడు చిన్నమ్మాయిలా ఉన్నానని అన్నారు. కానీ, ఇప్పుడు నా నటన చూసి బెస్ట్‌ అంటున్నారు. ఈ సీరియల్స్‌లో ముగ్గురు అక్కచెల్లెళ్ల మధ్య స్టోరీ నడుస్తుంది.

ఈ ముగ్గురిలో అక్క మీన కి నేను చెల్లెల్లిని. పేరు సిరి. చదువంటే చాలా ఇష్టం. బాగా చదివి కలెక్టర్‌ని అవ్వాలని సిరి కోరిక. అందుకు అక్క బాగా సాయం చేస్తుంటుంది. కానీ, అనుకోని పరిస్థితుల్లో సిరికి ఓ వ్యక్తితో పెళ్లవుతుంది. దీంతో సిరి అక్క, చెల్లితో విడిపోతుంది. అక్కకు దగ్గరవడం కోసం సిరి చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది. సెట్స్‌లోనే కాదు బయట కూడా మేం ముగ్గురం కలిశామంటే ఫ్యామిలీ మెంబర్స్‌లా హడావిడి చేస్తాం. బెస్ట్‌ ఫ్రెండ్స్‌లా ఉంటాం. అక్కచెల్లెళ్లు లేని లోటు ఈ సీరియల్‌ ద్వారా తీరింది.
– నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top