బాహుబలి ‘రూపు’దిద్దుకున్నాడిలా...

బాహుబలి ‘రూపు’దిద్దుకున్నాడిలా...


లవర్‌బాయ్‌ కాస్తా... ఒంటిచేత్తో వందలాది మందిని ఊచకోత కోసే యోధుడిగా రూపాంతరం చెందాడు. తెరపై ఆ విశ్వ‘రూపం’ చూసినవారికి వంద గ్రీకు శిల్పాలు కూడా దిగదుడుపే అనిపించాడు. డార్లింగ్, మిస్టర్‌ పర్ఫెక్ట్‌... సినిమాల్లో సాఫ్ట్, క్యూట్‌ హ్యాండ్సమ్‌ గై నుంచి ఒక్కసారిగా జరిగిన ఈ ఫిజికల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ వెనుక ప్రభాస్‌ పడిన కష్టం మామూలుది కాదు అంటున్నారు ఆయన ట్రైనర్‌ లక్ష్మణ్‌రెడ్డి.




బాహుబలిలో తన పాత్రలకు తగ్గట్టుగా ప్రభాస్‌ ఆహార విహారాలు, వ్యాయామాలు మార్చుకున్నాడు.తన రెగ్యులర్‌ వెయిట్‌ 82 కిలోల నుంచి శివుడు పాత్రలో 88 కిలోలకు అటూ ఇటూగా బరువు పెంచాల్సి వచ్చింది. అదే బాహుబలి పాత్ర దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్యాట్‌ శాతం 9 నుంచి 10తో ఏకంగా 105 కిలోలకు చేరుకుందట.



తిండీ...తిప్పలూ అన్నింటా మార్పులే...

శివుడి పాత్ర కోసం సున్నా కార్బొహైడ్రేట్స్, హై ప్రొటీన్స్‌ ఫుడ్‌ని రోజుకు 6 సార్లు తీసుకున్నారు. ఇక పొద్దున్న, సాయంత్రం అధికంగా కార్డియో వర్కవుట్స్, మితంగా వెయిట్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలు... అదే బాహుబలి పాత్ర కోసం రోజుకు 8 నుంచి 9 సార్లు అత్యధిక కేలరీలున్న ఆహారాన్ని తీసుకుంటూ, తక్కువగా కార్డియో వ్యాయామాలు, హెవీ వెయిట్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలు... ఇదీ రొటీన్‌. పదుల సంఖ్యలో ఎగ్‌వైట్స్‌ (షుమారు 40 దాకా), సహజమైన పద్ధతుల్లో తయారైన ప్రొటీన్‌ పౌడర్‌లు వంటివి రొజువారీ డైట్‌కి అదనంగా జత అయ్యాయి.



ఓన్‌ జిమ్‌... ఓ బూమ్‌

అమెరికా వెళ్లిన సమయంలో అక్కడి ఫిట్‌నెస్‌ సెంటర్లను సందర్శించిన ప్రభాస్‌ డబ్లు్య డబ్లు్య ఎఫ్‌ ఫైటర్స్‌ను కూడా కలిశారు. శిక్షణ తీరుతెన్నులను, వ్యాయామ పద్ధతులను నిశితంగా పరిశీలించి, అత్యాధునిక ఎక్విప్‌మెంట్‌తో రూ.1.5 కోట్ల రూపాయలు వెచ్చించి తన ఇంట్లోనే అద్భుతమైన జిమ్‌ ఏర్పాటు చేసుకున్నాడు. దాదాపు 1500 చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటైన ఈ జిమ్‌ దేశంలోనే మరే నటుడికీ లేనంత భారీ, అత్యాధునిక వర్కవుట్‌ స్టూడియో అట.



కొందరు తెలుగు, హిందీ సినీ రంగాలకు చెందిన టాప్‌ హీరోల్లా ఫారిన్‌ ట్రైనర్స్‌ కోసం ఆరాటపడకుండా... స్థానిక బాడీబిల్డర్‌ లక్ష్మణ్‌రెడ్డిని శిక్షకుడిగా నియమించుకున్నాడు. రోజుకు 4 నుంచి 6 గంటల వరకూ శరీరంలోని అన్ని మజిల్స్‌కు వర్కవుట్‌ని అందిస్తూ ప్రత్యేకమైన టెక్నిక్స్‌తో వర్కవుట్స్‌ చేశాడు.



డెడికేషన్‌కి కేరాఫ్‌ ప్రభాస్‌

షూటింగ్‌తో ఎంత అలసిపోయినా వర్కవుట్‌ మాత్రం మిస్‌ కానివ్వలేదు. తన శరీరం మీద, దాని పనితీరు మీద అవగాహన ఉంది. మంచి మోడ్రన్‌ జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఫిజిక్‌ని తీర్చిదిద్దుకుంటూనే ఆ అలసటను అధిగమించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్లే బాహుబలిలో ఆయన ఫిజిక్‌కు ధీటుగా గ్లామర్‌ కూడా ఉంది.

– లక్ష్మణ్‌రెడ్డి, బాడీబిల్డర్, వ్యాయామ శిక్షకుడు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top