అది ఇది ఏమని? ఆమెదే అవని!

Inspired the new year Womens consciousness - Sakshi

తనుశ్రీ మీటూ.. మిథాలీ ఫైటు..  చతుర్వేది ఫ్లైటు.. నీతా కైండ్‌ హార్టు.. సింధు బంగారం.. అను శింగారం.. సుధ అందలం.. సుమిత్ర నేతృత్వం.. ఇలా.. ఈ ఏడాది ప్రతి రంగంలోనూ.. మహిళా చైతన్యం ప్రభవించింది.. నలు దిక్కులా పల్లవించింది.  కొత్త ఏడాదికి స్ఫూర్తినిచ్చింది.

‘మీటూ’ కలవరం
తనుశ్రీ దత్తా... బాలీవుడ్‌ నటి. మోడల్, 2004లో మిస్‌ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న అందగత్తె. మిస్‌ యూనివర్స్‌ పీజెంట్‌ టాప్‌ టెన్‌ వరకు వెళ్లారు. ఆ లిస్ట్‌లో ఆమెది ఎనిమిదవస్థానం. ఆ తర్వాత ఏడాది ‘చాకొలెట్‌’ సినిమాతో బాలీవుడ్‌లో రంగ ప్రవేశం చేశారు. హిందీతోపాటు తమిళ్, తెలుగు సినిమాల్లోనూ నటించారామె. తెలుగులో వీరభద్ర సినిమాలో మాలతి పాత్రలో కనిపించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆమె జూమ్‌ టీవీకిచ్చిన ఇంటర్వ్యూ దేశాన్ని కుదిపేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె 2009లో ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడని చెప్పారు. ఆ మాటలో బాలీవుడ్‌తోపాటు దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలు కలవర పడ్డాయి. లైంగిక వేధింపులకు గురైన మహిళ లంతా ‘మీ టూ’ అంటూ గళం విప్పడానికి ధైర్యాన్నిచ్చింది తనుశ్రీ దత్తా ఇంటర్వ్యూనే (అంతకంటే ముందు శ్రీరెడ్డి తనకెదురైన లైంగిక వేధింపును బయటపెట్టినప్పటికీ అది తెలుగు సినిమా పరిశ్రమకే పరిమితమైంది). 34 ఏళ్ల తనుశ్రీ పుట్టింది జార్ఖండ్‌లోని జమ్‌షెడ్‌పూర్‌లో.                                                                                                                             

రావమ్మా క్రీడాలక్ష్మీ!
మిథాలీ రాజ్‌... మహిళల క్రికెట్‌కు ఐకాన్‌. రెండు దశాబ్దాల కిందట మహిళల క్రికెట్‌ గురించి తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేని రోజుల్నుంచి ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. టీమ్‌కు కెప్టెన్‌గా రాణించారు. ఉమెన్స్‌ వన్డే ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఆరు వేల పరుగుల మైలురాయిని చేరిన ఏకైక క్రీడాకారిణి. వరుసగా ఏడు వన్‌ డేలలో కనీసం హాఫ్‌ సెంచరీ చేసిన రికార్డు కూడా ఆమెదే. వన్డేలలో ఎక్కువ హాఫ్‌ సెంచరీలు చేసిన క్రీడాకారిణి రికార్డు కూడా ఉంది. 2018 ఉమెన్స్‌ ట్వంటీ ట్వంటీ ఆసియా కప్‌ సమయంలో మిథాలి స్కోరు రెండు వేల పరుగులు దాటింది. ఈ పాటర్న్‌లో కోహ్లీ, రోహిత్‌ శర్మకంటే ఎక్కువ పరుగుల రికార్డు మిథాలిది. క్రీడా విమర్శకులు మిథాలిని మహిళా టెండూల్కర్‌ అని ప్రశంసించే వారు. అర్జున, పద్మశ్రీ పురస్కారాలను అందుకున్న ముప్పై ఆరేళ్ల మిథాలీరాజ్‌... కోచ్‌ రమేశ్‌ పవార్‌పై చేసిన ఆరోపణతో వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమె రిటైర్‌ అవ్వడమో లేదా దిగువ స్థానాల్లో ఆడడమో నిర్ణయించుకోవాలన్నాడు రమేశ్‌. ఆ టోర్నమెంట్‌ 2018 టీ ట్వంటీలో ఇండియా సెమీ ఫైనల్స్‌లో ఓడిపోవడంతో బీసీసీఐ పునరాలోచనలో పడింది. అయితే కొత్త కోచ్‌ డబ్లు్యవీ రామన్‌ నేతృత్వంలో రాబోయే ఏడాది న్యూజిలాండ్‌ పర్యటనకు వన్‌డే జట్టుకు మిథాలినే కెప్టెన్‌గా కొనసాగించారు. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ఎప్పటిలాగా టీ ట్వంటీకి కెప్టెన్‌గా కొనసాగనుంది.

యుద్ధనారి
అవనీ చతుర్వేది... మహిళల్లో యుద్ధవిమానం నడిపిన తొలి భారతీయ యువకెరటం. ఈ పాతికేళ్ల అమ్మాయి  మధ్యప్రదేశ్‌ రాష్ట్రం రేవా జిల్లా వాసి. రాజస్తాన్‌లోని బాణాస్థలి యూనివర్సిటీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ చేసి, హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో వైమానిక శిక్షణ పొందింది. సుఖోయ్, తేజాస్‌ యుద్ధ విమానాలను నడపగలిగిన సామర్థ్యాన్ని సాధించింది. మిగ్‌ 21 ఫైటర్‌ ఫ్లైట్‌ని సోలోగా నడిపింది. ఫ్లయిట్‌ లెఫ్టినెంట్‌ గా పదోన్నతి సాధించింది. ఈ ఏడాది అక్టోబర్‌ ఏడవ తేదీన (అప్పటి  రక్షణ మంత్రి) కేంద్ర మంత్రి మనోహర్‌ పరిక్కర్‌ చేతుల మీదుగా అధికారికంగా పురస్కారాన్ని అందుకుంది. అవని కంటే ముందు కూడా పైలట్‌ అయిన మహిళలున్నారు. కానీ యుద్ధ విమానాలు నడపడం అవనితోనే మొదలు. నిజానికి ఆ సందర్భంలో మోహనా సింగ్, భావనా కాంత్‌లు కూడా అవనితోపాటే సెలెక్టయ్యారు. ఈ ముగ్గురిలో తొలుత యుద్ధ విమానాన్ని నడిపిన యువతి అవని.

ఆరోగ్యమాత
సౌమ్యా స్వామినాథన్‌... హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ గారమ్మాయి. తండ్రి మానవాళికి అన్నం పెట్టడానికి పరిశోధనలు చేశారు, తల్లి మీనా స్వామినాథన్‌ పిల్లల బుద్ధి వికాసం మీద అధ్యయనం చేశారు. ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌కి సిలబస్‌తోపాటు విద్యావిధానానికి కొత్త దారి చూపించారు. ఆ పరిశోధనతోటలో విరిసిన సౌమ్య కూడా సైంటిస్టే అయ్యారు. వైద్యం అంటే అనారోగ్యం పాలైన వాళ్లకు మందులివ్వడం కాదు, అసలు అనారోగ్యాలు రాకుండా కాపాడాలి. అనారోగ్యాలను పారదోలాలి అని నమ్ముతారు. టీబీకి వ్యాక్సిన్, రోటా వైరస్‌ వ్యాక్సిన్‌లను కనుక్కున్నారు. చెన్నైలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన సౌమ్య, పుణెలో ఎంబీబీఎస్, ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి íపీహెచ్‌డీకి విదేశాలకు వెళ్లారు. యూకే, అమెరికాల్లోని ప్రతిష్టాత్మక వైద్య సంస్థల్లో పని చేశారు. ఈ ఏడాది ఆమె ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌ వో) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. హెచ్‌ఐవీ, టీబీ, మలేరియాలను ప్రపంచంలో లేకుండా తరిమి కొట్టడానికి వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌తో కలిసి పని చేస్తున్నారిప్పుడు. 

దేశ (భారత)లక్ష్మి
సుధా బాలకృష్ణన్‌... చార్టెడ్‌ అకౌంటెంట్‌గా కెరీర్‌ మొదలు పెట్టారు. ఆర్‌బిఐకి ఆమె పన్నెండవ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌. ఆర్‌బిఐ సీఎఫ్‌వోగా నియామకానికి ముందు ఆమె నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం సుధా బాలకృష్ణన్‌ వేతనం నెలకు రెండు లక్షల రూపాయలతోపాటు ప్రభుత్వ అ«ధికారిక నివాసం. ఒకవేళ ఆమె ప్రభుత్వ నివాస సౌకర్యాన్ని వినియోగించుకోని పక్షంలో ఆమె నెలకు నాలుగు లక్షల రూపాయల వేతనాన్ని పొందే అవకాశం ఉంది. ఇంత భారీ వేతనానికి తగినట్లే ఉంటాయి బాధ్యతలు కూడా. ప్రభుత్వ బ్యాంకు అకౌంట్ల నిర్వహణ, రెవెన్యూ కలెక్షన్, పన్నుల రాబడి, దేశంలో విదేశాల్లో ఆర్‌బిఐ పెట్టుబడుల వంటి కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వహించాల్సి ఉంటుంది. 

నవనీత
నీతా అంబానీ... ఈ పేరు వినగానే ముఖేశ్‌ అంబానీ గుర్తొస్తాడు. ముఖేశ్‌ భార్యగానే గుర్తిస్తుంది నీతాని సమాజం. కానీ ఆమె అంతకంటే ముందు తనకంటూ ప్రత్యేకతలున్న మహిళ. 
నీత చక్కగా భరతనాట్యం చేస్తారు. స్కూల్‌ టీచర్‌గా ఆమెకి మంచి పేరుంది. ముఖేశ్‌ అంబానీతో పెళ్లయిన తర్వాత కూడా ఆమె కొన్నేళ్లపాటు టీచరుగా కొనసాగారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆమె రిలయన్స్‌ చారిటీ బాధ్యతలు చూసుకోవడం మొదలుపెట్టారు. భారతీయ క్రీడారంగానికి ఆమె మంచి కార్పొరేట్‌ సపోర్టరు. ఆమెకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ముగ్గురినీ ఉన్నత చదువులు చదివించారు. ఇటీవల కూతురు ఈషా పెళ్లిలో ఆమె దివ్యాంగులకు  కొసరి కొసరి వడ్డించారు.

బంగారు సింధు
పి.వి సింధు... భారతీయ క్రీడాకారిణుల్లో ఒలింపిక్స్‌లో రజత పతకం అందుకున్న తొలి అమ్మాయి. 2016లో బ్రెజిల్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో పీవీ సింధు ఫైనల్‌లో కరోలినా మారిన్‌తో పోటీ పడి ఓడిపోయింది. దాంతో సిల్వర్‌ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏడాది స్కాట్లాండ్‌లో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌లోనూ ఆమె సిల్వర్‌తోనే సరిపెట్టుకుంది. ఈ ఏడాది కూడా చైనాలో మళ్లీ కరోలినా మారిన్‌తో ఆడి సిల్వర్‌ మెడల్‌ దగ్గరే ఆగిపోయింది. ఏషియన్‌ గేమ్స్‌ ఫైనల్‌లో ఓడింది. కామన్వెల్త్‌లోనూ సేమ్‌సీన్‌ రిపీట్‌ అయింది. దాంతో సింధు ఇప్పటి వరకు సాధించిన విజయాలను మర్చిపోయిన క్రీడాభిమానులు ఆమెకు ఫైనల్‌ ఫోబియా ఉన్నట్లుందని విమర్శలు చేశారు. ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో ఆమె ఆ బ్లాక్‌ను ఛేదించింది. బంగారు పతకంతో విమర్శకులకు సమాధానం చెప్పింది. రాజీవ్‌ ఖేల్‌ రత్న, అర్జున అవార్డు, పద్మశ్రీ పురస్కారాలను అందుకున్న క్రీడాకారిణి సింధు.

జస్ట్‌ ఇండియన్‌ బ్యూటీఅనుకీర్తి వ్యాస్‌... మిస్‌ ఇండియా 2018. తమిళనాడులోని తిరుచ్చిలో పుట్టి పెరిగిన ఈ ఇరవై ఏళ్ల  అమ్మాయి మాతృభాష మలయాళం. కేరళ నుంచి తమిళనాడుకు వచ్చిన కుటుంబం వారిది. ఫ్రెంచ్‌ లిటరేచర్‌లో గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న అనుకీర్తికి అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌లో బైక్‌ రైడింగ్‌ అంటే ఇష్టం. అనుకీర్తికి గత ఏడాది భారతీయ అందగత్తె మానుషి ఛిల్లర్‌ కిరీటధారణ చేసింది. ఈ డిసెంబర్‌లో చైనాలో జరిగిన మిస్‌ వరల్డ్‌ 2018 పీజెంట్‌లో పాల్గొన్న అనుకీర్తి టాప్‌ 30 టాలెంట్‌ రౌండ్‌లో పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది.

పని చూపించిన చేతులు
సుమితాఘోష్‌... రంగసూత్ర ఆవిష్కర్త. ఇది ఆమె సొంత వ్యాపార సామ్రాజ్యం కాదు. ఆమె మహిళల కోసం రూపొందించిన వేదిక. అస్సాంలో గ్రామీణ మహిళల చేతిలో ఉన్న ఎంబ్రాయిడరీ, కార్పెంటరీ నైపుణ్యానికి మెరుగులు దిద్ది, వారిని ఫ్యాబ్‌ ఇండియా, ఐకియా వంటి సంస్థలతో అనుసంధానం చేశారు సుమిత. అలా ఇరవై వేల మంది మహిళలు రంగసూత్ర వేదిక ద్వారా నెలకు పది నుంచి పదిహేను వేల రూపాయలు సంపాదించు కోగలుగుతున్నారు. సుమితది కోల్‌కతా. ముంబై యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, అమెరికాలోని ఈస్టర్న్‌ మెనోనిట్‌ యూనివర్సిటీ నుంచి కాన్‌ఫ్లిక్ట్‌ రిసొల్యూషన్‌ పట్టాలను పక్కన పెట్టి సామాజిక సేవ వైపు మొగ్గు చూపారామె. సుమితతోపాటు అస్సాం గ్రామాల్లో తిరుగుతూ, మహిళలను చైతన్యవంతం చేస్తున్న ఆమె భర్త సంజయ్‌ ఘోష్‌ను ఉల్ఫా తీవ్రవాదులు అపహరించుకువెళ్లారు. ఆ షాక్‌ నుంచి కొద్దికాలంలోనే తేరుకుని రంగసూత్ర స్థాపన కోసం శ్రమించి, కలను నెరవేర్చుకున్నారు సుమిత. 

వీర నాయిక
ఆనందీబెన్‌ పటేల్‌... మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు గవర్నర్‌. ఈ ఏడాది జనవరిలో గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్న ఆనందీబెన్‌ డిసెంబర్‌లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. స్కూల్లో మంచి క్రీడాకారిణిగా ‘వీరబాల’ అవార్డును అందుకున్న ఆనందీబెన్‌ టీచర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఆమె రాజకీయ ప్రవేశం విచిత్రంగా జరిగింది. టీచరుగా ఉన్నప్పుడు స్కూలు పిల్లల్ని సర్దార్‌ సరోవర్‌ రిజర్వాయర్‌ దగ్గరకు పిక్‌నిక్‌కి తీసుకెళ్లారు. ఇద్దరమ్మాయిలు ప్రమాదవశాత్తూ రిజర్వాయర్‌లో పడిపోయారు. ఆనందీబెన్‌ వెంటనే నీటిలో దూకి ఆ అమ్మాయిలను కాపాడారు. ఆ సాహసానికి ప్రెసిడెంట్‌ అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంటున్న సమయంలో ఆనందీబెన్‌ సాహసోపేతమైన కథనాన్ని తెలుసుకున్న బీజెíపీ నాయకులు ఆమెను రాజకీయాల్లోకి ఆహ్వానించారు. అలా రాజకీయప్రవేశం చేసిన ఆనందీబెన్‌ కేంద్ర మంత్రి, గుజరాత్‌ రాష్ట్రానికి మంత్రి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

సభలో పెద్దక్క
సుమిత్రా మహాజన్‌... లోక్‌ సభ స్పీకర్‌. అంతకుముందు కేంద్ర మంత్రి. 75 ఏళ్ల మహాజన్‌ లోక్‌సభకు ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి. ప్రస్తుత మహిళా సభ్యులందరిలో మహాజన్‌ వయసులో పెద్దవారు మాత్రమే కాదు, సీనియర్‌ మెంబరు కూడా. అందుకేనేమో ఆమె తల్లిలా ప్రేమను పంచుతూనే పెద్దమ్మలా గద్దిస్తున్నట్లు కూడా కనిపిస్తారు. సుమిత్ర పుట్టిల్లు మహారాష్ట్ర. అత్తిల్లు మధ్యప్రదేశ్‌. ఇండోర్‌లో ఎం.ఎ, ఎల్‌.ఎల్‌.బి చదివిన సుమిత్ర... ఇండోర్‌కే చెందిన జయంత్‌ మహాజన్‌ను పెళ్లి చేసుకున్నారు. సుదీర్ఘకాలం రాజకీయరంగంలో ఉండి కూడా వివాదాలు, అవినీతి ఆరోపణలు లేని నాయకురాలామె. వ్యక్తిగత క్రమశిక్షణ మాత్రమే కాదు, సభను క్రమశిక్షణలో పెట్టడంలోనూ అంతే కచ్చితంగా ఉంటారు. 2015లో ఒకసారి సభ్యులు మితిమీరిన క్రమశిక్షణ రాహిత్యంతో వ్యవహరించిన సందర్భంలో ఆమె ఏకంగా పాతిక మంది కాంగ్రెస్‌ సభ్యులను ఐదు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో కూడా సభ్యుల అల్లరి శ్రుతి మించడంతో, సభను అదుపులో పెట్టడానికి ‘స్కూలు పిల్లల్లా ఏంటిది’ అని సభ్యులను గద్దించారామె. ఆ స్థానంలో స్పీకర్‌గా మగవాళ్లు ఉంటే అధికారంతో సభను అదుపులో ఉంచడానికి ప్రయత్నించేవారేమో, సుమిత్ర మహాజన్‌ సభ్యుల్లో పరివర్తన తీసుకువచ్చే బాధ్యతను కూడా తీసుకున్నారు. ఆమెను ఇండోర్‌ ప్రజలు ‘తాయి’ అని పిలుచుకుంటారు. తాయి అంటే అక్క.

చట్టసభలో సగం
డాక్టర్‌ శ్వేతా షెట్టి... గత నవంబరు వరకు సామాజిక కార్యకర్త. ఈ నెలలో ఒక్కసారిగా జాతీయ రాజకీయ ముఖచిత్రంలో స్థానం సంపాదించారు. ఈ నెల 18వ తేదీన ఆమె ఢిల్లీలో ‘నేషనల్‌ ఉమెన్స్‌ పార్టీ’ పేరుతో రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. మహిళలకు రాజకీయ రిజర్వేషన్‌ కల్పించడంలోనూ, మహిళల కోసం చట్టాల ఉమెన్‌ ఫ్రెండ్లీగా రూపొందించడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని, చట్టసభల్లో యాభై శాతం స్థానాలకు మహిళలు ఎన్నికైనప్పుడే చట్టాలు మహిళలకు న్యాయం జరిగేవిధంగా రూపొందుతాయని ఆమె అభిప్రాయం. ప్రస్తుతం పార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం పదకొండు శాతానికి మించడం లేదు. ‘తెలంగాణ మహిళా సమితి స్వచ్ఛంద సంస్థ నిర్వహణ సమయంలో సమాజంలో మహిళల పరిస్థితిని అధ్యయనం చేశాను, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం తప్పనిసరి, ఇప్పుడున్న రాజకీయ పార్టీలేవీ మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదు. అందుకే మహిళల కోసం ఒక రాజకీయ పార్టీని స్థాపించాలనే నిర్ణయం తీసుకున్నాను’ అన్నారామె.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top