సేంద్రియ ఆపిల్‌ సాగుకు పచ్చజెండా!

Organic apple grown green!

సీసీఎంబీ పర్యవేక్షణలో ఫలప్రదమవుతున్న ఆపిల్‌ ప్రయోగాత్మక సాగు

తెలంగాణలోని కెరిమెరిలో సేంద్రియ ఆపిల్‌ సాగుకు శ్రీకారం

అరకు సహా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు అనుకూలం..

మరో రెండేళ్లలో సాగు పద్ధతిని ప్రమాణీకరిస్తామంటున్న సీసీఎంబీ శాస్త్రవేత్తలు

సేంద్రియ ఆపిల్‌ సాగు ఆనందకరం..
సీసీఎంబీ శాస్త్రవేత్తలతో పాటు ఉద్యాన శాఖాధికారుల, వ్యవసాయాధికారుల సహాయంతోనే ఆపిల్‌ను సాగు చేస్తున్నా. రసాయనిక ఎరువులు, పురుగుమందులతో సాగు చేసిన పత్తిలో ఏటా నష్టాలు రావటంతో గడచిన ఏడేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నాను. సీసీఎంబీ శాస్త్రవేత్తల తోడ్పాటుతో సేంద్రియ ఆపిల్‌ సాగుకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది. ఈ విధానంలో ఎటువంటి ఇతర ఇబ్బందులు లేవు.

కాండం కుళ్లు, రసం పీల్చే పురుగులు, తెగుళ్ల బెడద లేదు. ఎరువులు, పురుగు మందులు కొనే పనిలేకపోవటంతో ఖర్చు తగ్గింది. కష్టపడితే చాలు. ఒక వారం కషాయాలు పిచికారీ ఆలస్యమయినా మొక్కలకు చీడపీడలను తట్టుకునే శక్తి వచ్చింది. అయితే, మాది మారుమూల ప్రాంతం కావడంతో ప్రకృతి సేద్యంలో పండించిన పంటలను మార్కెట్లో అధిక ధరకు అమ్ముకోవటం ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం సహకరించాలి.

కశ్మీర్‌ లోయలోనే కాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ ప్రకృతి సేద్య విధానంలో ఆపిల్‌ పండ్లను సాగు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చని నిరూపిస్తున్నారు సేంద్రియ రైతు కేంద్రే బాలాజీ.  కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరిమెరి మండలం ధనోరా ఆయన స్వగ్రామం. ఐదెకరాల పొలంలో ఆపిల్‌తో పాటు అనేక ఏళ్లుగా మామిడి, బత్తాయి, దానిమ్మ, అరటి, బత్తాయి తోటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. పండ్ల తోటల్లో బంతి, పసుపు, కొత్తమీరలను అంతర పంటలుగా సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ అనుభవంతో బాలాజీ సేంద్రియ ఆపిల్‌ సాగుకు శ్రీకారం చుట్టారు.

ఆపిల్‌ మొక్కలకు పూత, కాత వచ్చింది..
ఆపిల్‌ నేషనల్‌ జీనోమ్‌ ప్రాజెక్టుకు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) చీఫ్‌ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తోంది. ప్రధాన శాస్త్రవేత్తలు డా. రమేశ్‌ కె.అగర్వాల్, డా. ఎ. వీరభద్రరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతంలో డా. జోగినాయుడు ఆధ్వర్యంలో ఆపిల్‌ సాగుపై అధ్యయనం జరుగుతోంది.

అదేవిధంగా, మినీ కశ్మీరంగా పేరుపొందిన కెరెమెరి పరిసరాల్లో ఆపిల్‌ ప్రయోగాత్మక సాగుకు 2015 మేలో సీసీఎంబీ శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. స్థానిక వాతావరణం, ఉష్ణోగ్రతలను పరిశీలించారు. చుట్టూ కొండలు, నడి వేసవిలోనూ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించకపోవటం వంటి కారణాలతో ధనోరా గ్రామం ఆపిల్‌ సాగుకు అనువైన ప్రాంతం అని సీసీఎంబీ నిర్ధారించింది.

శాస్త్రవేత్తలు బాలాజీ పొలానికి వచ్చి మట్టి పరీక్షలు జరిపారు. తొలుత కొన్ని ఆపిల్‌ మొక్కలను సాగు చేసి వాటి ఎదుగుదల బావుండటంతో బాలాజీని ప్రోత్సహించారు. 8–10 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ సాగుకు అనువైన  ఆపిల్‌ రకాలుగా గుర్తించిన హెచ్‌.ఆర్‌.ఎం.ఎన్‌.–99, బిలాస్‌పూర్, నివోలిజన్, అన్న, రాయల్‌ బెలిషియస్‌ తదితర ఆపిల్‌ రకాలను సాగు చేస్తున్నారు. హెచ్‌.ఆర్‌.ఎం.ఎన్‌.–49 రకాన్ని హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన రైతు శాస్త్రవేత్త హరిమాన్‌ శర్మ ఈ వంగడాన్ని అభివృద్ధి చేశారు.

సీసీఎంబీ సరఫరా చేసిన ఆపిల్‌ మొక్కలను 2015 ఆగస్టులో బాలాజీ నాటారు. తొలుత 2 అడుగులు లోతు, వెడల్పు ఉండేలా గుంతలు తవ్వుకున్నారు. గుంతకు 10 కిలోలు పశువుల ఎరువు వేశారు. సాళ్లు, మొక్కల మధ్య ఆరు మీటర్ల దూరం ఉండేలా నాటుకున్నారు. ఆపిల్‌ మొక్కలకు నష్టం కలిగించే రసంపీల్చే పురుగుల నివారణకు వారానికోసారి కలుపు తీయిస్తున్నారు.

ప్రతి 20 రోజలకోసారి మొక్కకు లీటరు జీవామృతం ఇస్తున్నారు. చీడపీడల నివారణకు వారానికోసారి 20 లీటర్ల నీటికి లీటరు దశపత్ర కషాయం కలిపి పిచికారీ చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో పూత వచ్చింది. నెల రోజుల్లో కాయలు ఒక మోస్తరుగా పెరిగాయి. వేసవిలో నాలుగు రోజులకోసారి బోరుతో నీటి తడి ఇచ్చారు. అయితే ఆపిల్‌ చెట్లకు మూడేళ్ల వయసు వచ్చే వరకు కాపు తీయవద్దని సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెప్పటంతో బాలాజీ పూతను తీసేస్తున్నారు. పరిశోధన కోసం రెండు చెట్లకు మాత్రమే కాయలు పెంచుతున్నారు. గుంతలు తవ్వేందుకు, మొక్కలు నాటేందుకు, కలుపు నివారణకు, ఇనుప కంచె, కూలీలకు, రూ. 3 లక్షల వరకు ఖర్చయిందని బాలాజీ తెలిపారు.  

సేంద్రియ పండ్ల సాగులో పదేళ్ల అనుభవం
బాలాజీ అనేక ఏళ్లుగా ఎకరంలో బత్తాయిని సాగు చేస్తున్నారు. చెట్టుకు క్వింటా నుంచి క్వింటాన్నర వరకు బత్తాయిల దిగుబడి వస్తోంది. రూ. 60 వేల వరకు ఖర్చవుతుండగా, ఏడాదికి రూ. లక్ష నికరాదాయం వస్తోంది. జీవామృతం, దశపత్ర కషాయాలను వీటి సాగులో వాడతారు. బత్తాయిలో అల్చింతను అంతరపంటగా మడుల్లో సాగు చేస్తున్నారు. రబీలో గోధుమను సాగు చేస్తున్నారు. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది.

గతేడాది ఆగస్టు నెలలో ఎకరంలో దానిమ్మ, మరో ఎకరంలో టిష్యూకల్చర్‌ అరటì  మొక్కలను నాటుకున్నారు. ఇందులో బంతిని అంతరపంటగా సాగు చేశారు. 40 క్వింటాళ్ల పూల దిగుబడి వచ్చింది. రూ. 30 వేల నికరాదాయం లభించింది. రెండేళ్ల క్రితం దశేరి, బంగినపల్లి మామిడి మొక్కలను రెండెకరాల్లో నాటారు. ఎకరాలో అంతరపంటగా దానిమ్మను సాగు చేశారు.

అర ఎకరాలో పసుపును సాగు చేస్తున్నారు. చిన్న మడులను ఏర్పాటు చేసి వేసవిలో కొత్తిమీర సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రైతుగా ఎంపికైన బాలాజీ జూన్‌ 2న ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా రూ. లక్ష నగదు పుర స్కారాన్ని అందుకున్నారు.
– సర్పం ఆనంద్, సాక్షి, కెరెమెరి, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా

రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యాన వర్సిటీలు ఆపిల్‌ సాగుకు తోడ్పాటునందించాలి!
ఆపిల్‌ సాగుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కొన్ని ప్రాంతాలు అనుకూలంగా ఉన్నట్లు రెండేళ్లుగా సాగుతున్న మా అధ్యయనంలో రుజువైంది. హెచ్‌.ఆర్‌.ఎం.ఎన్‌. తదితర రకాలు మైదాన ప్రాంతాల్లో సైతం బాగా పెరుగుతున్నాయి. కోరాపుట్‌ (ఒడిశా)లో, అరకులో, రిషివ్యాలీలో, విజయనగరం జిల్లా సాలూరులో, నాందేడ్‌లో, వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హిల్స్‌లో, ఆదిలాబాద్‌ జిల్లా కెరిమెరిలో ఆపిల్‌ పండ్ల సాగు సాధ్యమేనని తేలింది. ఆపిల్‌.. గులాబీ కుటుంబానికి చెందిన మొక్క.

గులాబీ మాదిరిగానే మన దగ్గర కూడా సాగు చేయొచ్చు. శీతాకాలంలో కనీసం 100–150 గంటల పాటు 10–12 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైతే ఫలితాలు బాగుంటాయి. మెదక్‌లో కూడా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సందర్భాలున్నాయి. కాబట్టి, ఆపిల్‌ మొక్కలు పెరుగుదల, పూత, కాత నిలబడటం వరకు సమస్య లేదు. అయితే, సమగ్ర సాగు పద్ధతిని ప్రమాణీకరించాల్సి ఉంది. ఇందుకు మరో రెండేళ్లు సమయం పడుతుంది.

ఒకేసారి విస్తారంగా పొలాల్లో కాకుండా పెరటి తోటల్లో సాగు చేయించాలి. ఈ విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు, ఉద్యాన వర్సిటీలు, ఉద్యాన శాఖలు శ్రద్ధాసక్తులు కనబరిస్తే పని సులువు అవుతుంది. వీరు ఆసక్తి చూపితే రానున్న డిసెంబర్‌ – జనవరి నెలల్లో మొత్తం 20 వేల ఆపిల్‌ మొక్కలను ఈ రెండు రాష్ట్రాల్లో ప్రయోగాత్మక సాగుకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, చిత్తూరు రైతులు ఆపిల్‌ సాగుపై ఆసక్తి చూపారు.
– డా. ఎ. వీరభద్రరావు(098859 21603), చీఫ్‌ సైంటిస్ట్, సీసీఎంబీ, హబ్సిగూడ, హైదరాబాద్‌ avrao@ccmb.res.in,
– కేంద్రే బాలాజీ(94411 03877), ప్రకృతి వ్యవసాయదారు, ధనోర, కెరిమెరి మండలం, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా, తెలంగాణ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top