అభివృద్ధి సూచి సంక్షేమానికి పూచీ

అభివృద్ధి సూచి సంక్షేమానికి పూచీ - Sakshi


 రాష్ర్ట సమగ్రాభివృద్ధికి, వివిధ వర్గాల సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

 ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించడం హర్షణీయమని జనం స్వాగతిస్తున్నారు. మహానేత వైఎస్సార్ ఆశయాలను పుణికిపుచ్చుకున్న జగన్‌మోహన్‌రెడ్డి ఓ చక్కటి ప్రజామేనిఫెస్టోను రూపొందించారని, ఇది ఆయన దార్శనికతకు అద్దం పడుతోందని పలువురు అభిప్రాయపడ్డారు.

 

 రైతులపై ఉన్న ప్రత్యేక అభిమానాన్ని చాటుతోంది

 రైతుల విషయంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనా విధానం ఎంతైనా అభినందనీయం. రైతులకు మేలు చేసే విధంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు రూ.మూడు వేల కోట్లు కేటాయించడం అభినందనీయం. ఎప్పుడైనా వ్యవసాయానికి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర రాకపోతే ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం రైతుల పట్ల జగన్‌కు ఉన్న ప్రత్యేక అభిమానాన్ని చాటుతోంది. రైతులను ప్రోత్సహించి ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఆయన దృక్పథం మంచిది.

 - వేగేశ్న సూర్యనారాయణరాజు, రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి, ఆత్రేయపురం

 

 అభినందనీయం

 పంటలు చేతికి వచ్చిన సమయంలో రైతులకు లాభసాటి ధర అటుంచి కనీసం గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు. ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర సైతం దొరకకపోవడం వల్లే రైతులు  నష్టాల పాలవుతున్నారు. రికార్డుస్థాయిలో పంట దిగుబడి వచ్చినా ధాన్యానికి కనీస మద్దతు ధర దక్కనందునే 2011లో కోనసీమ రైతులు 90 వేల ఎకరాల్లో పంటలు పండించకుండా ఆసాధారణంగా సాగుసమ్మె చేశారు. మద్దతు ధరకు భరోసా కల్పించే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధరల స్థిరీకరణకు రూ.మూడు వేల కోట్లు కేటాయించడం అభినందనీయం. భారతీయ కిసాన్ సంఘ్ వివిధ పార్టీలకు ఇచ్చిన రైతు ఎజెండాలో ఈ డిమాండ్ కూడా ఉంది. దీనిని ధరల స్థిరీకరణ అనేదాని కన్నా రైతు సంక్షేమ నిధిగా పేరుమార్చితే మరింత బాగుంటుంది.

 - ముత్యాల జమ్మీ, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు, అంబాజీపేట.

 అప్పుల ఊబిలో కూరుకొని పోయినవారికి ఊరట

 మహిళా సాధికారిత కోసం నిరుపేద మహిళలకు ఇందిరాక్రాంతి పథం ద్వారా అందజేసిన రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకొనిపోయాయి. నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటడంతో తమకు వస్తున్న ఆదాయం ఇటు వెచ్చాలకు సరిపోక, అటు రుణ బకాయిలు చెల్లించేందుకు వీలులేక రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాల వారు సతమతమవుతున్నారు. జగన్‌మోహనరెడ్డి అధికారంలోకి వస్తే మహిళాశక్తి సంఘాల ద్వారా సభ్యులు పొందిన రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇవ్వడం హర్షణీయం. వైఎస్సార్ సీపీ ప్రకటించిన ఈ మేనిఫెస్టో అనేక కుటుంబాలకు మేలుచేసేదిగా ఉంది.

 - హనుమంతు రాజామణి , అప్పలరాజుపేట గ్రామసమాఖ్య అధ్యక్షురాలు, రాజవొమ్మంగి మండలం

 డ్వాక్రా రుణాలు మాఫీ అయితే అంతకన్నానా

 

 పదేళ్లుగా తీసుకున్న రుణాలు కట్టలేక, కొత్తగా ఆర్థిక సహకారం అందక ఇబ్బందులు పడుతున్నాం. అప్పు కట్టాక తినేందుకు నూకలు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో డ్వాక్రా రుణాలు నిజంగా మాఫీ చేస్తే మా బోటి వాళ్లకు అంతకన్నా జరిగే  మేలు మరొకటి ఉండదు. తండ్రిలా ఇచ్చిన మాట నిలబెట్టుకొనే మనసు జగన్‌కు ఉంది. హామీలన్నీ నెరవేరుస్తారనే నమ్మకముంది.

 - మడకం పద్మ,  డ్వాక్రా సంఘం సభ్యురాలు, ఏజెన్సీ గంగవరం

 

 పేదవారికి ఎంతో ఉపయోగపడుతుంది

 నాపేరు యనమల మణబ్బాయి. మాది గొరసపాలెం. వ్యవసాయకూలీగా పనిచేస్తున్నాను, నాకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె వీరనాగమణి, చిన్న కుమార్తె లోవతల్లి. వీరు గడ్డిపేట హైస్కూల్లో 6, 7 తరగతులు చదువుతున్నారు. పేదకుటుంబం కావడంతో పిల్లల్ని పెద్ద చదువులు చదివించే స్థోమత లేదు. జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకం ద్వారా ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.500ల చొప్పున రూ.1000ల ఆర్థిక సహాయం అందిస్తానని అంటున్నారు. ఇలాంటి పథకం మాలాంటి పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుంది. నా కుమార్తెలను ఈ ఆర్థిక సహాయంతో ఉన్నత చదువులు చదివిస్తాను.

 - యనమల మణబ్బాయి, వ్యవసాయకూలీ, గొరసపాలెం, తొండంగి మండలం

 

 పింఛను పెంపు ఎంతో మేలు

 వృద్ధులకు రూ.700 పింఛను అందిస్తామని వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో పేర్కొనడం హర్షణీయం. ఏ ఆదరణాలేని వృద్ధులు, వికలాంగులు ఎంతోమంది పింఛనుకోసం ఎదురుచూస్తున్నారు. అటువంటి వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్‌మోహన్‌రెడ్డి పింఛను పెంపు నిర్ణయం తీసుకోవడం మంచి నిర్ణయం. చంద్రబాబుతో పోలిస్తే రాజశేఖరరెడ్డి వృద్ధులు, వికలాంగులకు పింఛను పెంపుతో ఎంతో మేలు చేకూర్చారు. ఇప్పుడు జగన్ కూడా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వృద్ధులు, వికలాంగులకు పింఛను పెంపు హామీని తన మేనిఫెస్టోలో పొందుపరిచారు. అర్హులైన ఎంతోమందికి ఇంకా పింఛను అందడం లేదు. వారికందే ఏర్పాట్లు చేయాలి.

 - తూమ్మూరి శేషగిరిరావు, వేమగిరి.

 

     మాబోటి నిరుపేదలకు భరోసా

 

 వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నా భర్తకు వృద్ధాప్య పింఛను మంజూరైంది. ఏడాది క్రితమే ఆయన చనిపోయారు. నా భర్త చనిపోయినందున నాకు వితంతు పింఛను మంజూరు చేయాలని గత ఏడాదిగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. ఎక్కడ ఏ సభ జరిగినా అధికారులకు వినతిపత్రాలు ఇస్తూనే ఉన్నాను. కానీ అధికారులు తిప్పించుకుంటున్నారే తప్ప మంజూరు మాత్రం చేయడం లేదు. మహానేత తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే మీ ప్రాంతంలోనే ఒక ఆఫీస్ తెరుస్తానని, దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో ఏదైనా మంజూరు చేస్తానని చెప్పడం నిజంగా నాబోటి నిరుపేదలకు గొప్ప భరోసా.. జగన్‌బాబు అధికారంలోకి రావాలి..నాబోటి వాళ్లకు కొండంత అండ దొరుకుతుంది.

 - దొడ్డి రాఘవమ్మ, రేచర్లపేట, కాకినాడ

    గిరిజనులకు నిజంగా ఒక వరం

 

 రెవెన్యూ అధికారులు ఇచ్చిన రేషన్‌కార్డులో పేర్లు తప్పుగా నమోదు చేశారు. వాటి మార్పు కోసం ఆరు నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నా నేటికీ పేర్లలో తప్పులు సరిదిద్దలేదు. పంచాయతీ స్థాయిలో రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు వంటి సేవలు అందుబాటులోకి వస్తే గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుంది. సాధారణంగా దూర ప్రాంతాల నుంచి మండల  కేంద్రాలకు రావడం చాలా ఇబ్బంది. వచ్చినా అక్కడ పట్టించుకునే వారు ఉండరు. ఈ సేవల కోసం అనేకమార్లు తిరగాల్సి వస్తుంది. జగన్ సీఎం అయితే పంచాయతీలో అన్ని సేవలు పొందేలా చేస్తామనడం ఆనందదాయకం.

 - పండా వీరబ్బాయిదొర, పందిరిమామిడి, రంపచోడవరం

     వైఎస్‌ను మరువలేం

 వైఎస్ రాజశేఖరరెడ్డి మేలును ఎప్పటికీ మరువలేను. చిన్నతనం నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడ్డ నేను మహానేత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్ల సుమారు అయిదేళ్ల ఏళ్ల క్రితం వైజాగ్‌లోని సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొని పునరుజ్జీవం పొందాను. ఐదు నెలల క్రితం వివాహం కూడా చేసుకుని సంతోషంగా జీవిస్తున్నాను. వందలాది వ్యాధులకు రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తే ఆయన మరణానంతరం వందకు పైగా వ్యాధులను ఆరోగ్యశ్రీ నుంచి కాంగ్రెస్ సర్కారు తొలగించడం అన్యాయం. పేద ప్రజలకు మేలు జరిగే విధంగా జగన్ ఆలోచించడం ఆనందదాయకం.

 - సిరికి సుశీల, ఊలపల్లి, బిక్కవోలు మండలం.

     రొటేషన్ విధానం ఎంతో మేలు

 ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఆలోచనలు ఎంతో బాగున్నాయి. రొటేషన్ విధానంలో ఆయా విభాగాల్లో వైద్య నిపుణులను రాష్ట్రం నలుమూలల సేవలందించేలా చేయాలన్న ఆలోచన ఎంతో ఉత్తమమైనది. హైదరాబాద్ వంటి నగరం వెళ్లి పరీక్షలు చేయించుకోలేని రోగులకు జిల్లా ప్రధాన నగరాల్లోనే వైద్య సేవలు పొందే వీలుంది. - మూర మణిరాజు, పెదపళ్ల, ఆలమూరు మండలం

 

 

 నిరంతర విద్యుత్‌తో మేలు

 మోటార్లకు విడతల వారీగా విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాము. ఎప్పుడు విద్యుత్ వస్తుందో, పోతుందో తెలియని పరిస్థితితో అవస్థలు పడుతున్నాము. ప్రస్తుతం విడతల వారీగా సరఫరా చేయడం వల్ల చేలు తడవడం లేదు. రాత్రుళ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పగటిపూట ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని ఇచ్చిన హామీ ఎంతో ఊరటనిచ్చింది. విద్యుత్ బోరుబావులు ఉన్న రైతులకు మేలు జరుగుతుంది. రైతులకు మేలు చేసే నాయకులు, ప్రభుత్వం రావాలి.                - రాచపోతుల గంగాధర్,

             కొలిమేరు, తుని మండలం

 

 పగటిపూట కరెంటుతో నర్శరీ రైతులకు మేలు

 పగటిపూట వ్యవసాయ విద్యుత్ ఇవ్వడం రైతులకు ఎంతోమేలు చేకూరుస్తుంది. కూలీలు దొరికే పగటి సమయంలో కరెంటు లేకపోవడంతో నర్సరీ రైతులమైన మేము ఇబ్బందులు పడుతున్నాం. రాత్రివేళల్లో కూలీలు పనుల్లోకి రాక మొక్కలకు నీరందడం కష్టంగా మారింది. ప్రకృతితో పోటీపడుతున్న రైతులకు రాత్రి సమయంలో వస్తున్న విద్యుత్ ప్రమాదాలను కూడా కలుగజేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అవసరాలకు సరిపడే విద్యుత్‌ను పగటిపూట ఏడుగంటల పాటు నిరంతరంగా సరఫరా చేస్తామని వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో చేర్చడం అభినందనీయం.               

 - పుల్లా ఆంజనేయులు,

 నర్సరీ రైతుల సంఘం అధ్యక్షులు, కడియపులంక.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top