పార్లమెంట్, అసెంబ్లీ కౌంటింగ్‌కు పటిష్ట చర్యలు


ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ నెల 16న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిద్ధార్థ జైన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో సోమవారం రాత్రి ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, కౌంటింగ్‌లో కూడా అంతే జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గపరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లు, లోక్‌సభ ఓట్లు లెక్కించడానికి ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కలెక్టర్ చెప్పారు.

 

 పోలవరం, చింతలపూడి, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లతోపాటు లోక్‌సభ ఓట్లను కూడా ఈ నెల 16వ తేదీ ఉదయం 8 గంటలకల్లా ప్రారంభించాలని సిద్ధార్థజైన్ ఆదేశించారు. కౌంటింగ్ ప్రారంభానికి ముందే అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ సిబ్బందిని రాండమైజేషన్ ద్వారా నియమించాలని దీనివల్ల ఎటువంటి అపోహలకు తావుండదని కలెక్టర్ చెప్పారు. అభ్యర్థులు వారి ఏజెంట్లు కౌంటింగ్‌కు గంట ముందుగానే నిర్దేశించిన కేంద్రాలకు చేరుకోవాలని, మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసిన దృష్ట్యా ప్రతి ఒక్కరూ విధిగా పాస్‌లను ధరించి లోనికి రావాలన్నారు.

 

 రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ, లోక్‌సభ ఓట్లను వట్లూరు సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కించడం జరుగుతుందన్నారు. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును భీమవరం విష్ణు కళాశాల కాంపౌండ్‌లో లెక్కించడం జరుగుతుందని సిద్ధార్థజైన్ చెప్పారు. సమావేశంలో జిల్లా అదనపు జేసీ సీహెచ్ నరసింగరావు, డీఆర్వో కె.ప్రభాకరరావు, రిటర్నింగ్ అధికారులు డి.వెంకటరెడ్డి, ఉదయభాస్కర్, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top