‘పుర’ జాతకాలు 12న


మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మార్చి 30న జిల్లాలోని ఎనిమిది మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు మరో తొమ్మిది రోజుల్లో వెలువడ నున్నాయి.  ఈనెల 12న లెక్కింపు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్  ఆదేశాల మేరకు ఉదయం 8గంటలకు చేపట్టే కౌంటింగ్ పక్రియను కేవలం రెండు గంటల్లో పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొనే పనిలో అధికారులు బిజీగా నిమగ్నమయ్యారు. ఇక 8 మున్సిపాలిటీల పరిధిలోని 206వార్డులకు గాను 1,166మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరంతా గత నెల రోజులుగా ఫలితాల కోసం ఉత్కంఠగా రోజు రోజు ఎదురు చూస్తున్నారు. మరో 9రోజులు ఆగితే కానీ ఎవ్వరు విజయం సాధిస్తారో తెలనుంది.

 

 14టేబుళ్లు....14రౌండ్స్.....పురఫలితాలకు సంబంధించి 14టేబుళ్లను ఏర్పాటు చెయ్యనున్నారు. ప్రతి టేబుల్‌పై మూడు వార్డుల ఫలితాలను వెల్లడించాలన్నది అధికారులు ఉద్దేశ్యం. అయితే ఒక్క వార్డును మూడు రౌండ్లుగా లెక్కించనున్నారు, ప్రతి రౌండ్‌ను పది నిముషాల్లో పూర్తి చేసి ఫలితాలను వెల్లడించనున్నారు. ఆరగంట సమయంలోనే 14వార్డుల ఫలితాలను వెల్లడిస్తారు. ఈలెక్క ప్రకారం జిల్లాలోని 7మున్సిపాలిటీలో 30వార్డుల లోపే ఉండడంతో గంటన్నరలో ఫలితాలన్నింటినీ పూర్తి చేయనున్నారు. ఇక జిల్లా కేంద్రంలో మాత్రం 41వార్డులుండడంతో రెండు గంటల వ్యవధిలో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి టేబుల్‌కో కౌంటింగ్ సూపర్‌వైజర్, అసిస్టెంట్ సూపర్‌వైజర్ వంతున ప్రతీ మున్సిపాలిటీకి 28మంది సిబ్బందిని అధికారులు నియమించారు. వీరికి ఈనెల 10లోగా రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చి కౌంటింగ్‌పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నారు.

 

 కౌంటింగ్ కేంద్రాలన్నీ ఎంవీఎస్ డిగ్రీకళశాలలోనే......

 జిల్లాలోని 8మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలన్నీ స్థానిక క్రిస్టియన్‌పల్లిలోని ఎంవీఎస్ డిగ్రీ కళశాలలోనే ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ మున్సిపాలిటీకి ఒక హాల్‌ని సిద్ధం చేసుకొనే పనిలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రస్తుతం అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన  ఈవీఎంలన్నీ అక్కడే భద్రపరుస్తున్నారు. కౌంటింగ్ పక్రియ అలస్యం అవ్వడంతో అధికారులు ఈనిర్ణయం తీసుకొన్నారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top