అరచేతి వైకుంఠం

అరచేతి వైకుంఠం - Sakshi


కాంగ్రెస్ మేనిఫెస్టో(ఓపెన్  డయాస్): దారిద్య్రరేఖకు ఎగువన, మధ్యతరగతికి దిగువన ఉన్న జనాభాను మధ్యతరగతి పరిధిలోకి తెస్తామని కూడా కాంగ్రెస్ చెబుతోంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాభాను నిర్ధారించడంలో తప్పుడు లెక్కలపై ఆధారపడిన ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలోనిదే కాదా? పేదరికం స్థాయిని నిర్ధారించడంలో మళ్లీ ఇలాంటి అవకతవకలే పునరావృతం కాకుండా ఉంటాయా?

 

 రాజకీయ, సామాజిక రంగాల్లో భారత్ రూపురేఖలనే మార్చేసే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ 15 అంశాల ఎజెండాతో తన మేనిఫెస్టోను ముందుకు తెచ్చింది. ఆర్థిక పునరుద్ధరణకు, స్థూలంగా సమ్మిళిత వృద్ధి సాధనకు పలు సంస్కరణలను చెబుతోంది. సామాజిక స్థితిగతుల మెరుగుదలకు లెక్కలేనన్ని ‘హక్కు’లనూ చట్టబద్ధం చేసే సంకల్పాన్నీ పునరుద్ఘాటించింది. భారత్ వృద్ధిపర్వంలో కీలకపాత్ర పోషించిన మూడు వర్గాలకూ- వాణిజ్య వర్గానికి, యువజన ప్రాబల్యంగల మధ్యతరగతికి, పేదలకు సమాన ప్రోత్సాహకా లను కల్పించనున్నట్లు భరోసా ఇచ్చింది. కాంగ్రెస్ హామీల్లో కొన్ని సాహసోపేతమైనవి, సృజనాత్మకమైనవి కాగా, మిగిలినవి కొత్తవే అయినా, నామమాత్రమైనవి.

     వచ్చే మూడేళ్లలో 8 శాతం స్థూల జాతీయోత్పత్తిని (జీడీపీ) సాధించాలన్న సంకల్పాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టో వెలిబుచ్చింది. ఇందుకోసం మ్యానుఫాక్చరింగ్ రంగానికి ఊత మిచ్చేందుకు అంతర్జాతీయంగా పోటీపడే స్థాయిలో బహిరంగ వాణిజ్య వాతా వరణం కల్పించడం, కార్మిక చట్టాలను మెరుగుపరచడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాన్ని పెంపొం దించ డం లక్ష్యాలుగా పెట్టుకుంది. యూపీ ఏ-1, 2 హయాంలో జీడీపీ సగటు వృద్ధి రేటు 7.7 శాతంగా ఉన్నందున, 8 శాతం వృద్ధిరేటు లక్ష్యంపై ఆర్థికవేత్తలు హర్షం వ్యక్తం చేయవచ్చు.

 దేశంలో నిరుద్యోగం పెరుగుతుండటంపై  విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రానున్న పదేళ్లలో మ్యానుఫాక్చరింగ్ రంగానికి ఊతమివ్వడం ద్వారా పదికోట్ల మంది యువకులకు ఉద్యోగాలు కల్పించ నున్నట్లు కాంగ్రెస్ మేనిఫెస్టో చెబుతోంది. భారత యువతరాన్ని ఆకట్టుకునేందుకు చౌకగా విద్యారుణాలు కల్పించనున్నట్లు చెబుతోంది.

 ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతుండటంపై ప్రధానంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఈ అంశానికే తొలి ప్రాధాన్యమిచ్చింది. అయితే, యూపీఏ అధికారంలో ఉన్న గత పదేళ్లలో సంఘటిత రంగంలో ఉద్యో గాలు అంతంత మాత్రంగానే ఉండగా, అసంఘటిత రంగంలోను, కాంట్రాక్టు ఉద్యోగాలు లెక్కకు మిక్కిలిగా అందుబాటులోకి రావడం నిస్పృహ కలిగిస్తుంది.

 విదేశాల్లో దాచిపెట్టిన నల్లడబ్బును వెనక్కు తెప్పించడానికి ప్రత్యేక రాయబారి నియామకం ఏమాత్రమైనా ఉపయోగపడుతుందా? ఈ అంశంలో గత ప్రభుత్వాలు అనుసరించిన తాత్సార ధోరణులు అందరికీ తెలిసినవే. ఎన్డీఏ, యూపీఏ సహా గడచిన ఆరు దశాబ్దాల్లో ప్రభుత్వాలన్నీ నల్లడబ్బు విషయంలో వెనుకంజ వేస్తూనే ఉన్నాయి. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే, బాబా రామ్‌దేవ్‌లు చేపట్టిన ఉద్యమాలకు ఇదే ప్రధానమైన అంశంగా నిలిచింది.

 నల్లడబ్బు కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంలో న్యాయ వ్యవస్థ జోక్యం ఏదో ఒకరోజు జరగాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక రాయబారిని నియమించడంలో విశ్వసనీయత ఏముంటుంది?

  సామాజిక రంగానికి సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో లెక్కకు మిక్కిలి హక్కులను కల్పించనున్నట్లు చెబుతోంది. పింఛను హక్కు, ఆరోగ్య హక్కు, గృహ వసతి, పారిశుద్ధ్య హక్కు, సామాజిక భద్రత, గౌరవప్రదమైన, మానవత్వంతో కూడిన పని వాతావరణానికి హక్కు వంటివన్నీ ఇందులో ఉన్నాయి. చట్టబద్ధంగా వీటన్నింటినీ కల్పిస్తామంటే బాగానే ఉంటుంది. అయితే, వీటి అమలును పర్యవేక్షించే సంస్థలను బలోపేతం చేయాల్సి ఉంది.

     పన్నుల వ్యవస్థలోనూ పెనుమార్పులు తేనున్నట్లు మేనిఫెస్టో చెబు తోంది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా వస్తువులు, సేవల పన్ను, ప్రత్యక్ష పన్నుల కోడ్ బిల్లులను ఆమోదించనున్నట్లు ప్రకటించింది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనందునే  యూపీఏ-2 ప్రభుత్వం ఈ రెండు బిల్లులనూ ఆమోదించ లేకపోయింది.

  ప్రస్తుత రాజకీయ పరిణామాలనే పరిగణనలోకి తీసుకుంటే, ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుంటున్నాయి. కాంగ్రెస్, తన భాగస్వాములతో కలసి ఈ అంశంపై మద్దతు కూడగట్టుకోవడం దుస్సాధ్యమనే చెప్పాలి.

  యూపీఏ పాలనలో ఒకవైపు ధరల దూకుడు కొనసాగుతూ, ఆహార ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరుకుని సామాన్యులు గగ్గోలు పెడుతుంటే, ద్రవ్యోల్బణం తగ్గినట్లు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పుకోవడం విడ్డూరం.

     ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేటు రంగంలో అవకాశాల కోసం కచ్చితమైన చర్యలు తీసుకుంటానని కూడా ఈ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. అలాగే, ప్రస్తుతం కులాల ఆధారంగా ఉన్న రిజర్వేషన్లకు ఎలాంటి అవరోధం లేకుండానే, బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు హామీ ఇచ్చింది. అయితే, ఏకాభిప్రాయం కుదిరితే అనే షరతుపై మాత్రమే. ఉద్దేశం మంచిదే అయినా, భారత రాజకీయ రంగంలో ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరడం ఆషామాషీ కాదు. పేదలకు అనుకూలంగా ఉన్న ఈ హామీలన్నీ జనాలను ఆకట్టుకుంటాయా? దీనికోసం వేచి చూడాల్సిందే.

 - కె.స్టీవెన్‌సన్

 జర్నలిజం విభాగం

 ఉస్మానియా యూనివర్సిటీ


 

 జన  ఎజెండాఐటీ రంగం అభివృద్ధికి ఊతమివ్వాలి

 తెలంగాణలో హైదరాబాద్‌యేతర జిల్లాల్లో సమాచార సాంకేతిక (ఐటీ) రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఎన్‌ఐటీ, కేయూ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు గల వరంగల్‌తో సహా కనీసం 4 జిల్లాల్లో ఐటీ మౌలిక వసతులు అభివృద్ధి చేయాలి. నేరుగా ఉద్యోగవకాశాలు కల్పించే కంపెనీలకు పన్ను రాయితీలిచ్చి ప్రోత్సహించాలి. ఐటీ సంస్థలు 24 గంటలూ పనిచేయడానికి వీలుగా పూర్తిస్థాయిలో ఇంటర్నెట్, విద్యుత్ సదుపాయాలను అందించాలి. స్థానిక వ్యవసాయం, ఉత్పత్తి పరిశ్రమలకు అనుకూలంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధిపరిచే ఐటీ కంపెనీలకు ప్రోత్సాహకాలివ్వాలి.  

 - రాధేష్‌రెడ్డి గుర్రాల, అమెరికా

 

 యువ నాయకత్వం అవసరం

 ఇది మన రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో కీలక సమయం. ఈ సమయంలో ప్రజలకు నిజాయితీగా చిత్తశుద్ధితో సేవలందించగల క్రమశిక్షణ గల చురుకైన యువ నాయకత్వం అవసరం. ఇప్పటికీ అత్యధిక ప్రజల మనుగడకు ఆధారమైన వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చి అన్ని విధాల ఆదుకోవాల్సిన అవసరం ఉంది. శాంతిభద్రతలను కట్టుదిట్టంగా అమలు చేయాలి. విద్య, ఆరోగ్య రంగానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలి. అవినీతి నిరోధక విభాగాన్ని పటిష్టపరిచి, అవినీతిని సమూలంగా నిర్మూలించాలి.                                

  - సుబ్బారెడ్డి.సిహెచ్,

 హైదరాబాద్

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top