ఏడు నెలల్లో ఎన్ని రెట్లో?

ఏడు నెలల్లో ఎన్ని రెట్లో? - Sakshi


* గతేడాది సెప్టెంబర్లో చంద్రబాబు వెల్లడించిన కుటుంబ ఆస్తులు రూ. 62.3 కోట్లు

* ఇపుడు ఆయన భార్య భువనేశ్వరి ఒక్కరి పేరిటే రూ.165 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడి

* ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు వెల్లడించిన టీడీపీ అధినేత

* ఏడు నెలల్లో ఇన్ని రెట్లు పెరిగాయా? లేక అప్పటివి అబద్ధపు లెక్కలా?

* ఇన్నేళ్లలో ఎన్నడూ అసలు ఆస్తుల విలువ వెల్లడించని బాబు


 

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడే కాదు! ఏడాదిలో ఒకసారి.. తనను జనం నమ్మటం లేదని గుర్తొచ్చినపుడల్లా సడెన్‌గా మీడియా ముందుకు వస్తుంటారు చంద్రబాబు. వచ్చి తన ఆస్తులంటూ ఒక జాబితా విడుదల చేస్తుంటారు. ఆయన సత్యవ్రతాన్ని ప్రపంచానికి చెప్పటానికి ‘ఈనాడు’ ఎటూ ఉంది. ఇవిగో బాబు ఆస్తులంటూ... ఆయన నిజాయితీని ఊదరగొట్టేస్తారు రామోజీ. అదీ స్కీము. ఈ స్కీము ఎంత ఘోరంగా ఉంటుందంటే...  గతేడాది సెప్టెంబరు 16న చంద్రబాబు తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. తన పేరిట రూ.42.06 లక్షలు, భార్య భువనేశ్వరి పేరిట రూ.48.85 కోట్లు, కుమారుడు లోకేష్ పేరిట 9.73 కోట్లు, కోడలు బ్రహ్మణి పేరిట రూ.3.3 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. అంటే... స్థిర, చరాస్తులు కలిపి మొత్తం కుటుంబ ఆస్తి 62.30 కోట్లు.

 

 మరి ఇప్పుడో...?

 ఎన్నికల సందర్భంగా గురువారంనాడు కుప్పంలో చంద్రబాబు తరఫున ఆయన కుమారుడు లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి పేరిట ఉన్న ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో ఎన్నికల అధికారులకు సమర్పించారు. దీనిప్రకారం జస్ట్ భువనేశ్వరి పేరిట ఉన్న చరాస్తుల విలువ 134.32 కోట్లు. స్థిరాస్తుల విలువ మరో 32.54 కోట్లు. అంటే ఒక్క భువనేశ్వరి పేరిట ఉన్న ఆస్తుల విలువే రూ.165 కోట్లు. ఇక లోకే ష్, బ్రహ్మణి పేరిట ఉన్న వాస్తవ ఆస్తులు కూడా కలిపితే? లెక్కించటం కష్టం. ఇంతా చూస్తే బాబు పేరిట ఉన్న ఆస్తులు మాత్రం అతి స్వల్పం. స్థిర, చరాస్తులు కలిపి కేవలం తన పేరిట రూ.10.50 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు మాత్రమే గురువారం బాబు పేర్కొన్నారు. అవును మరి!! నెల్లూరు జిల్లా బాలాయపల్లితో పాటు ముంబయిలో కొన్న అత్యంత విలువైన భూములు, మదీనాగూడలోని ఎకరాల కొద్దీ భూములు, జూబ్లీహిల్స్‌లోని భవనం, ప్లాట్లు అన్నీ లోకేష్ పేరిట బదలాయించాక ఇక బాబు చూపించటానికేం ఉంటుంది లెండి!! ఆఖరికి హెరిటేజ్‌లో ఉన్న వందల కోట్ల విలువైన షేర్లను కూడా ఇతరత్రా కంపెనీలకు బదలాయించి, ఆ కంపెనీల్లోని వాటాలు కూడా లోకేష్‌కే ఇవ్వటం కాదనలేని వాస్తవం.

 

పంజగుట్టలో ధరలు తగ్గాయా?

 ఈసారి బాబు అఫిడవిట్లో ఓ చిత్రం చోటు చేసుకుంది. వాస్తవ విలువలంటూ భువనేశ్వరి పేరిట ఉన్న తమిళనాడు గోడౌన్, మదీనాగూడ భూములు అన్నిటి ధరలనూ 2009తో పోలిస్తే కాస్త పెంచి చూపించిన బాబు... పంజగుట్టలో హెరిటేజ్ ఫుడ్స్‌కు అద్దె కోసం ఇచ్చిన తమ సొంత కార్యాలయం విలువను మాత్రం తక్కువ చేసి చూపటం గమనార్హం. 2009 ఎన్నికల అఫిడవిట్లో ఈ భవనం ధరను 5.70 కోట్లుగా చూపించిన బాబు... ఇప్పుడు మాత్రం దాని ధరను 5.40 కోట్లుగానే చూపించారు. భవనం విలువ తగ్గుతుంది కాబట్టి అలా చూపించారనుకున్నా... భూమి ధర పెరగాలి కదా? అత్యంత విలువైన పంజగుట్టలోని 650 గజాల ధర ఐదేళ్లలో పెరగలేదు సరికదా తగ్గిందంటే ఏమనుకోవాలి? అది చెప్పింది బాబు కనక ఏమీ అనుకోవాల్సిన పనిలేదు లెండి!!.

 

బినామీలకే  ఫేమస్...: నిజానికి బాబు ఆస్తులంటూ ఏవి చూపించినా... వాటికి కొన్ని పదుల రెట్ల ఆస్తులు బినామీల పేరిట ఉన్నాయన్నది అందరికీ తెలిసిన వాస్త వం. తెహల్కా మ్యాగజైన్ సైతం 2000 మొదట్లోనే బాబు ఆస్తులు 20వేల కోట్ల వర కూ ఉన్నాయని వెల్లడించిందంటే... దేశంలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాల్లో నూ ఆయనకు హోటళ్ల వంటి ఆస్తులున్నాయంటే పరిస్థితి చెప్పకనే తెలుస్తుంది. నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, సి.ఎం.రమేష్ సహా పలువురు బినామీలు కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించారంటే అదంతా బాబు బినామీలు కాబట్టేనన్న సంగతి కోర్టుల ముందుకు కూడా వెళ్లింది. బాబు అఫిడవిట్లో కొసమెరుపేమిటం టే... 1994 నుంచీ ఆయన చూపిస్తున్న అంబాసిడర్ కారు. తనకు అదొక్కటే కారుం దంటూ... ఇప్పటికీ దాని విలువను రూ.2.22 లక్షలుగానే చూపిస్తుండటం.  

 

 ఇవీ... బాబు తాజా ఆస్తులు


 చంద్రబాబు ఆస్తులు.. రూ.10.60 కోట్లు

 అప్పులు.. రూ.6,35,387

 భువనేశ్వరి ఆస్తులు.. రూ.166,86,35,092

 అప్పులు.. రూ.16,28,16,064


చంద్రబాబు: రూ.45,72,739 బ్యాంకు డిపాజిట్లతో పాటు 1994 మోడల్‌కు చెందిన అంబాసిడర్ కారు, జూబ్లీహిల్స్‌లో రూ.10.14 కోట్ల విలువైన 1,225 చదరపు అడుగల భవనం తన పేరిట ఉన్నాయని, రూ.6,35,387 మేర అప్పులున్నాయని తెలియజేశారు.

 భువనేశ్వరి: హెరిటేజ్, ఇతర కంపెనీల్లో షేర్లతో పాటు 2008 మోడల్‌కు చెందిన ఆడి కారు, 2.8 కిలోల బంగారు ఆభరణాలు, రత్నాలు, రాళ్లు, 33 కేజీల వెండితో పాటు వుదీనగూడలో ఐదెకరాల భూమి, పంజగుట్టలో భవనం, తమిళనాడులో 2.33 ఎకరాల్లో విస్తరించిన భవనం ఉన్నట్టు పేర్కొన్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top