ఎస్‌బీఐ పీఓ రిక్రూట్‌మెంట్‌–2017

ఎస్‌బీఐ పీఓ రిక్రూట్‌మెంట్‌–2017 - Sakshi


తుది దశలో విజయానికి..ఎస్‌బీఐ.. 2017, ఫిబ్రవరిలో  2313 ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కు దేశ వ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది హాజరయ్యారు. దాదాపు 50 వేల మంది మెయిన్‌ ఎగ్జామినేషన్‌కు అర్హత సాధించారు. ఇందులో ప్రతిభ చూపిన దాదాపు 6,376 మందిచివరిదశ అయిన గ్రూప్‌ ఎక్సర్‌సైజ్, పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. ఈ ప్రక్రియ త్వరలో  ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ఉపయోగపడేలా

విజయానికి సూచనలు..



తుది దశ.. గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు కలిపి మొత్తం 50 మార్కులకు ఉంటుంది. వాస్తవానికి గతేడాది వరకు ఎస్‌బీఐ పీవో ఎంపిక ప్రక్రియలో చివరి దశను గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూగా పేర్కొనేవారు. తాజా నోటిఫికేషన్‌లో గ్రూప్‌ డిస్కషన్‌కు బదులు గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ను ప్రవేశపెట్టారు.



గ్రూప్‌ డిస్కషన్‌ (జీడీ)

నోటిఫికేషన్‌లో ‘గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌’ అని పేర్కొన్నప్పటికీ.. గ్రూప్‌ డిస్కషన్‌ (జీడీ)కు సన్నద్ధమై వెళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.



జీడీలో అయితే ఆరు లేదా ఏడుగురు అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పరచి.. ఏదైనా ఒక అంశం ఇచ్చి దానిపై చర్చించమంటారు. ఈ చర్చకు కేటాయించే సమయం పది నుంచి పదిహేను నిమిషాలు ఉంటుంది.



ఒక అంశం ఇచ్చిన తర్వాత చర్చ ప్రారంభించడానికి రెండు నిమిషాలు కేటాయిస్తారు. ఆ సమయంలో అభ్యర్థులు సదరు టాపిక్‌కు సంబంధించి ముఖ్యాంశాలను సిద్ధం చేసుకోవాలి.



చర్చ ప్రారంభించిన తర్వాత అభ్యర్థులు తమ టాపిక్‌కు సంబంధించి గుర్తించిన అంశాలు, తాజా పరిస్థితులను అన్వయిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేయాలి.



అభిప్రాయ వ్యక్తీకరణ క్రమంలో స్పష్టత అవసరం. చర్చను నిర్దిష్ట అభిప్రాయంతో ముగించడం మేలు చేస్తుంది.



గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌

ఆరేడు మంది అభ్యర్థులను ఒక గ్రూప్‌గా ఏర్పాటు చేసి.. వారికి ఒక సమస్యను ఇస్తారు. ఈ సమస్యను అభ్యర్థులు క్రమపద్ధతిలో పరిష్కరించాల్సి ఉంటుంది. కొన్ని సమస్యలకు నేరుగా సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. కానీ, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ ప్రధాన ఉద్దేశం అభ్యర్థుల్లోని విశ్లేషణాత్మక, నిర్ణయాత్మక శక్తిని గుర్తించడమే. కాబట్టి ఎంత సులువైన సమస్యను ఇచ్చినా.. క్రమపద్ధతిలో పరిష్కారాన్ని సూచించడం లాభిస్తుంది.



ఒక సమస్యను పరిష్కరించే సమయంలో

అనుసరించాల్సిన క్రమ పద్ధతి

సమస్యకు గల కారణాన్ని గుర్తించడం.

కారణాన్ని విశ్లేషించడం.

పరిష్కార, ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించడం.

మెరుగైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేయడం.

ప్రత్యామ్నాయం ఆధారంగా సమస్యకు పరిష్కారం  కనుగొనడం.



ఇంటర్వ్యూ

ఇందులో అధిక శాతం ప్రశ్నలు విద్య, వ్యక్తిగత నేపథ్యం, భవిష్యత్తు లక్ష్యాలకు సంబంధించినవిగా ఉంటాయి. ఇంటర్వ్యూ 15 నుంచి 20 నిమిషాల పాటు జరిగే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు చెప్పేలా సన్నద్ధం కావాలి. గ్రూప్‌ డిస్కషన్‌/గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ సమయంలో అభ్యర్థులు వ్యక్తం చేసిన అభిప్రాయాల గురించి కూడా అడిగే అవకాశం ఉంది. సమాధానాలు తెలియని ప్రశ్నలకు తెలియదని నిజాయితీగా అంగీకరించడం మేలు.



న్యూస్‌ పేపర్‌ రీడింగ్‌

గ్రూప్‌ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూకు ప్రిపరేషన్‌ పరంగా అభ్యర్థులకు న్యూస్‌ పేపర్‌ రీడింగ్‌ ఎంతో మేలు చేస్తుంది. ఇలా చదువుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలకు సంబంధించి నిపుణుల వ్యాసాలు– అందులోని ముఖ్య పాయింట్లతో సినాప్సిస్‌ రూపొందించుకోవాలి. ఒక వ్యాసం చదవడం పూర్తయిన తర్వాత దాని సారాంశం ఆధారంగా.. సొంతంగా, క్లుప్తంగా నోట్స్‌ రాసుకోవాలి. న్యూస్‌ ఛానెళ్లలో సమకాలీన పరిణామాలపై వచ్చే చర్చలను పరిశీలించాలి. తద్వారా ఆయా రంగాలకు చెందిన నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవచ్చు. ఫలితంగా కొత్త  అంశాలపై అవగాహన ఏర్పడుతుంది.



వొకాబ్యులరీపై పట్టు

గ్రూప్‌ ఎక్సర్‌సైజ్, పర్సనల్‌ ఇంటర్వ్యూలలో మెరుగైన ప్రదర్శన కోసం.. అభ్యర్థులు ఇంగ్లిష్‌ వొకాబ్యులరీని మెరుగుపరచుకోవాలి. తద్వారా పద ప్రయోగం, వాక్య నిర్మాణంపై అవగాహన ఏర్పడుతుంది. వొకాబ్యులరీపై పట్టు కోసం ప్రామాణిక ఇంగ్లిష్‌ గ్రామర్‌ పుస్తకాలను ఉపయోగించుకోవాలి. వర్డ్‌ పవర్‌ మేడ్‌ ఈజీ, ఇంగ్లిష్‌ బైట్స్‌ వంటి పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా వొకాబ్యులరీని మెరుగుపరచుకోవచ్చు.



సమతూకంగా..

గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ వ్యవహార శైలి పరంగా బ్యాలెన్స్‌డ్‌ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి. ఆవేశానికి లోనుకావడం.. పెద్దగా మాట్లాడటం.. ఇతరుల చర్చకు ఆటంకం కలిగించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. బాడీ లాంగ్వేజ్‌ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వస్త్రధారణ ప్రొఫెషనల్‌గా ఉండాలి.



ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలి

ఎస్‌బీఐ పీఓ ఎంపిక ప్రక్రియలో తుది అంకానికి చేరుకున్న అభ్యర్థులు.. ఈ దశలో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలి. లక్షల మందితో పోటీ పడి తమ ప్రతిభ ద్వారా చివరి దశకు చేరుకున్న అభ్యర్థులు.. ఇప్పుడు ఏ మాత్రం తడబడినా తుది ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఒత్తిడిని దరిచేరనీయకుండా, ఫలితం గురించి ఆలోచించకుండా ముఖ్యమైన అంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు కృషి చేయాలి. ఇలా చేస్తే తప్పక విజయం లభిస్తుంది.

– మనోజ్‌ సేథి, కోర్స్‌ డైరెక్టర్, టైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top