వైద్యశాఖలో కొత్తగా 640 పోస్టులు

640 posts in the medical department

సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నియామకానికి నిర్ణయం

జిల్లా స్థాయిలోనే భర్తీ చేయాలని యోచన!

మరో 680 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు కూడా భర్తీ

సర్కారుకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల రాక పెరుగుతున్న నేపథ్యంలో ఖాళీలను భర్తీ చేయడంపై వైద్యారోగ్య శాఖ దృష్టి సారించింది. ప్రజారోగ్య విభాగం, వైద్య విధాన పరిషత్‌ల పరిధిలోని 13 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)లలో వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది కలిపి 640 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. మరో 680 మంది ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని నియమించుకోవాలని యోచిస్తోంది.

సామర్థ్యం పెంపుతో..
రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)ను ప్రభుత్వం దశలవారీగా సీహెచ్‌సీలుగా మార్చింది. పీహెచ్‌సీలుగా ఉన్నప్పుడు వాటిలో 30 నుంచి 50 పడకల వరకు ఉండేవి. సీహెచ్‌సీలుగా మార్చిన తర్వాత గరిష్టంగా 200 పడకల వరకు సామర్థ్యాన్ని పెంచారు. మొత్తంగా 13 పీహెచ్‌సీల్లో పడకల సంఖ్య 1,200కు పెరిగింది. దీంతో అదనంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది అవసరం ఏర్పడింది.

మొత్తంగా 953 మంది వైద్యులు, నర్సులు అవసరంకాగా.. ప్రస్తుతం వాటిల్లో 313 మంది పనిచేస్తున్నారు. దీంతో అదనంగా 640 మంది సిబ్బందిని నియమించాలని వైద్య శాఖ నిర్ణయించింది. ఇక ఈ ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి మరో 680 మంది ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది కూడా అవసరమని తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. వెంటనే జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రతిపాదించింది.

పోస్టులు భర్తీ చేయనున్న పీహెచ్‌సీలివే
భద్రాచలం, మణుగూరు, ఖైరతాబాద్, ములుగు, హుజూరాబాద్, నర్సాపూర్, మల్కాజిగిరి, దేవరకొండ, జోగిపేట, నారాయణ్‌ఖేడ్, గజ్వేల్, హుస్నాబాద్, నంగునూరు

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top