కాలుష్యం ఎవరి పాపం?

who is the responsible for pollution - Sakshi

ఉష్ణోగ్రతలు తగ్గి, శీతగాలులు మొదలయ్యేసరికి మన నగరాల్లోని కాలుష్య భూతం మరింత ఉగ్రరూపం దాలుస్తుంది. దట్టంగా వ్యాపించే పొగమంచులో దుమ్మూ, ధూళి కణాలతోపాటు కార్బన్‌ డై ఆక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ వంటి మృత్యు ఉద్గారాలు కలగలిసి జనం ఊపిరితిత్తుల్లోకి చొరబడతాయి. కొంచెం కొంచెంగా ప్రాణాలను పీల్చేస్తుంటాయి. సాధారణ సమయాల్లో కాలుష్యం గురించి పట్టనట్టుండే ప్రభుత్వాలు ముప్పు ముంచుకొచ్చాక ఏవో దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్టు కనబడతాయి. విద్యా సంస్థలకు సెల వులివ్వడం, వాహనాల నియంత్రణ, నిత్యావసర సరుకులు తీసుకొచ్చే వాహనాలకు తప్ప ఇతర భారీ వాహనాలకు నగరంలో అనుమతి నిరాకరించడం వంటి నిర్ణయాలు ప్రకటిస్తాయి. కానీ ఈ చర్యలేవీ మూలాలను తాకవు. కనుక సమస్య యధాతథంగా ఉండిపోతుంది. కాలం గడుస్తున్నకొద్దీ అది పెరుగుతూ పోతుందే తప్ప తగ్గదు. ఈసారి పరిస్థితి మరింతగా దిగజారుతున్నట్టు కనబడుతోంది. హైదరాబాద్‌ మొదలుకొని దేశ రాజధాని న్యూఢిల్లీ వరకూ ఇదే కథ. బంగాళాఖాతంలో తుఫానులో, వాయుగుండాలో ఏర్పడినప్పుడు వాటి పర్యవసానంగా శీతగాలుల్లో తేమ ఆవరించి... దానికి పరిశ్రమలనుంచి, వాహ నాలనుంచి వెలువడే కాలుష్యం తోడై నగరాల్లో ప్రమాద తీవ్రత హె చ్చుతుంది. నగరాల వరకూ ఎందుకు... పట్టణాల్లో సైతం ఈ దుస్థితి తప్పడం లేదు. ఒక్క శీతాకాలం మాత్రమే కాదు...ఏటికేడాదీ కాలుష్యంతో నిండి ఉండే న్యూఢిల్లీ గురించి చెప్పనవసరమే లేదు. అక్కడి ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో ఈమధ్య జరిగిన క్రికెట్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో శ్రీలంక క్రీడాకారులు మాస్క్‌లు ధరించి పాల్గొన్నారు. ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్లయితే ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులెదురై మైదానం నుంచి నిష్క్రమించారు.  

వేకువజామునే పనుల కోసం రోడ్డెక్కేవారూ, బస్సుల కోసం ఎదురుచూసే బడి పిల్లలు, ఉద్యోగ బాధ్యతల కోసం కార్యాలయాలకు వెళ్లాల్సినవారూ ఈ పొగమంచులో చిక్కుకుంటున్నారు. ఎదురుగా ఏముందో కనబడక ఢిల్లీలో ఇటీవల పదులకొద్దీ వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్న వైనం సామాజిక మాధ్యమాల్లో అందరూ చూశారు. నిజానికి నిరుడు నవంబర్‌లో తన ముందు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తీరును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఆ మండలి స్పందిస్తున్న తీరు సరిగా లేదని దుయ్యబట్టింది. అటు ఢిల్లీ ప్రభు త్వాన్ని అక్కడి హైకోర్టు కూడా తీవ్రంగా అభిశంసించింది. ప్రభుత్వ యంత్రాంగాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి సారాంశంలో నరమేథానికి పాల్పడటంతో సమానమని వ్యాఖ్యానించింది. ఇంతగా మందలించినా ఈ ఏడాది మళ్లీ అవే పరిస్థితులు పునరావృతమయ్యాయి. దేశ రాజధాని నగరం ‘గ్యాస్‌ ఛాంబర్‌’గా మారిపోయింది. భారత్‌లో 1990–2015 మధ్య వాయు కాలు ష్యంవల్ల సంభవించిన మరణాలు 47 శాతం పెరిగాయని ఈ ఏడాది మొదట్లో వెలువడిన అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. కాలుష్యం పెరగడం వల్ల నెలలు నిండకుండానే పుట్టే పిల్లల సంఖ్య పెరుగుతున్నదని ఆ నివేదిక హెచ్చరించింది. సమస్య తెలుసు... సమస్యకు గల మూల కారణం తెలుసు. శీతాకాలంలో అది మరింత పెరుగుతుందని తెలుసు. కానీ ఎప్పటిలా నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న హెచ్చరికలు సైతం వాటి చెవులకు సోకడం లేదు.

ప్రభుత్వాలకు ముందు చూపు కొరవడి చేస్తున్న నిర్ణయాలే సమస్యను ఉన్నకొద్దీ పెంచుతున్నాయి. అభివృద్ధి పేరిట సమస్తమూ నగరాల్లో కేంద్రీ కరించడంలోనే ఈ సంక్షోభం మూలాలున్నాయి. పరిశ్రమలు, భారీ వాణిజ్య సముదాయాలు, సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు, అనేకానేక ప్రభుత్వ కార్యాలయాలూ నగరాల్లోనూ, వాటి చుట్టుపట్లా ఉండటం వల్ల అక్కడ జనాభా కేంద్రీకరణ తప్పడం లేదు. అటు పల్లెసీమల్లో ఉపాధి అవకాశాలు తగ్గి వారంతా నగరాలకు వలస రావలసివస్తోంది. ఇలాంటివారందరికీ అవసరమైన ప్రజా రవాణా వ్యవస్థను నిర్వహించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. రాని బస్సుల కోసం గంటల తరబడి రోడ్లపై వేచి చూడటం కంటే అప్పో సప్పో చేసి సొంతంగా వాహనం సమకూర్చుకుంటే సమస్య తీరిపోతుందన్న ధోరణి పౌరుల్లో పెరు గుతోంది. పరిశ్రమలు వదిలే కాలుష్యం చాలదన్నట్టు అదనంగా ఈ వాహనాలు వదిలే ఉద్గారాలు వాతావరణంలో కేన్సర్‌ కారక కార్సినోజిన్‌ల వ్యాప్తికి కారణ మవుతున్నాయి. దేశంలో ఏ నగరం, పట్టణం చరిత్ర చూసినా ఇదే పరిస్థితి. నిరుడు వివిధ నగరాల వాయు నాణ్యత గురించి పరీక్షలు నిర్వహిస్తే పట్నా, లూధియానా, బెంగళూరు, లక్నో, అలహాబాద్‌ నగరాల్లోని పౌరులు అక్షరాలా మృత్యువును ఆఘ్రాణిస్తున్నారని వెల్లడైంది. ఇలాంటి జాబితాల్లో మన నగరం లేదా పట్టణం లేదు కదా అని భరోసాతో ఉండలేం. కాలుష్యమయమైన నగరాలు, పట్టణాలతో పోలిస్తే అవి కాస్త మెరుగ్గా ఉండొచ్చుగానీ పూర్తి సురక్షితమైనవని నిర్ధారించలేం. నిజానికి ప్రభుత్వాలు తల్చుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోదు. ఆధార్‌ కార్డు లేకపోతే జీవించడమే సాధ్యం కాదన్నంత స్థాయిలో ప్రచారం చేస్తూ... న్యాయస్థానాలు విధిస్తున్న పరిమితులను కూడా లెక్క చేయక ప్రతి అవసరానికీ దాన్ని తప్పనిసరి చేసి జనంపై రుద్దుతున్న పాలకులకు కాలుష్యాన్ని తరమడం ఒక సమస్యా? మొక్కుబడిగా వాహనాల నియంత్రణ అమలు చేయడం కాక... వాటి అమ్మకాలను సైతం నియంత్రించడం, ప్రజా రవాణా వ్యవస్థను పటిష్ట పరచడం, పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకు న్నాయో లేదో నిఘా పెట్టడంలాంటి చర్యలకు ఉపక్రమిస్తే కాలుష్యం దానంతటదే సర్దుకుంటుంది. కావలసినందల్లా దృఢ సంకల్పం... చిత్తశుద్ధి. ఆ రెండూ పాల కులకు కలగనంతకాలమూ కాలుష్యమూ, అందువల్ల కలిగే అనర్థమూ ఈ మాదిరే కొనసాగుతాయి. నానాటికీ ఉగ్రరూపం దాలుస్తాయి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top