సహజీవనం–చట్టబద్ధత

Supreme Court Verdict On Dating - Sakshi

యుక్త వయసు వచ్చిన జంట వివాహ వ్యవస్థ వెలుపల కూడా సహజీవనం చేయొచ్చునని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఆ విషయంలో తరచుగా తలెత్తుతున్న వివాదాలకూ, సందేహాలకూ ముగింపు పలుకుతుందని...ఒక చట్టం ఏర్పడేందుకు దోహదపడుతుందని భావించాలి. వివాహబంధంపై సుప్రీంకోర్టు ఈ తరహా తీర్పునివ్వడం ఇది మొదటిసారి కాదు. భిన్న సందర్భాల్లో దీన్ని గురించి చెబుతూనే ఉంది. అయినా ఇలాంటి బంధాలు వివాదా స్పదం అవుతూనే ఉన్నాయి. తన జీవితభాగస్వామి ఎవరో నిర్ణయించుకునే స్వేచ్ఛ, నచ్చిన విధంగా ఎంపిక చేసుకునే హక్కు యువతికి ఉన్నదని కేరళకు చెందిన 26 ఏళ్ల హదియా కేసులో మొన్న మార్చిలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరస్పర అంగీకారంతో, ఇష్టపూ ర్వకంగా ఏర్పడే ఇలాంటి బంధాల్లో జోక్యం చేసుకునే హక్కు తల్లిదండ్రులతోసహా ఎవరికీ లేదని తెలిపింది. హదియా పెళ్లిని రద్దు చేసిన కేరళ హైకోర్టు తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది.

ఇదేవిధంగా ఒక జంట వివాహమనేది లేకుండా దీర్ఘకాలం కలిసి ఉన్న పక్షంలో దాన్ని చట్టబద్ధమైన వివాహంతో సమానంగా గుర్తించాలని, వారి సంతానాన్ని అక్రమ సంతా నంగా పరిగణించడం చెల్లదని అయిదేళ్లక్రితం ఒక కేసులో తీర్పునిస్తూ సుప్రీంకోర్టు చెప్పింది. పెళ్లాడకుండా కలిసి ఉన్న ఒక జంట మధ్య విభేదాలు ఏర్పడి, భరణం కోసం ఆమె కోర్టును ఆశ్రయించినప్పుడు కూడా ఇదే న్యాయస్థానం సహజీవనంలో తప్పేమీ లేదని చెప్పింది. అయితే ఇలాంటి బంధంలో ఉండే మహిళల రక్షణ కోసం స్పష్టమైన చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ మార్పు జరిగేవరకూ భరణం ఇవ్వాలంటూ ఆదేశాలి వ్వలేమని చెప్పింది. 

ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకొచ్చిన కేసు విలక్షణమైనది. హదియా కేసు మాదిరిగానే ఈ కేసులో కూడా కేరళ హైకోర్టు పెళ్లిని రద్దు చేసింది. నిరుడు ఏప్రిల్‌లో ఈ జంట పెళ్లి చేసు కునే సమయానికి అందులోని యువతి వయసు 19, యువకుడి వయసు 20 సంవత్సరాలు. చట్టప్రకారం ఆడపిల్లకు వివాహానికి యుక్త వయసు 18 కనుక యువతికి సమస్య ఏర్పడలేదు. కానీ అతడికి 21 ఏళ్లు రాలేదు గనుక ఈ పెళ్లి చెల్లదని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. యువతిని ఆమె తండ్రికి అప్పజెప్పింది. యుక్త వయసు వచ్చిన యువతికి తాను ఎవరితో కలసి ఉండాలో నిర్ణయించుకునే హక్కుంటుందని, అతడికి తగిన వయసు లేనంతమాత్రాన దాన్ని రద్దు చేయడం చెల్లదని తాజా తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకోవడానికి చట్ట బద్ధమైన అర్హత తమకు లేదనుకుంటే, కలిసి ఉండటానికి వేరే మార్గం ఎన్నుకునే హక్కు వారికుంటుందని చెప్పింది. ఈ బంధంలోకి వెళ్లిన జంటలో ఎవరైనా దాన్ని పరిత్యజించాలను కుంటే వేరే విషయంగానీ, న్యాయస్థానాలు మాత్రం ‘సూపర్‌ గార్డియన్‌’గా వ్యవహరించి దాన్ని రద్దు చేయలేవని తెలిపింది.  

స్త్రీ, పురుష సహజీవనం వివాహం ద్వారా ఏర్పడాలా లేక ఇతరత్రా పద్ధతుల్లో ఉండొ చ్చునా అన్న అంశంలో రకరకాల వాదాలున్నాయి. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్న సమాజంలో ఫలానా బంధం మాత్రమే సరైందని నిర్ధారణగా చెప్పడం సాధ్యం కాదు. మన దేశంలో పెళ్లి మినహా మరే వ్యవస్థ గురించీ ఏ చట్టమూ మాట్లాడటం లేదు. అయితే ఈ విషయంలో 2005నాటి గృహ హింస నిరోధక చట్టం కాస్త ముందుకెళ్లి ఆలోచించిందనే చెప్పాలి. అది వివాహం వెలుపల ఏర్పడే సంబంధాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. అయితే ‘వివాహ స్వభావం కలిగిన సంబంధాల’ గురించి మాత్రమే అది మాట్లాడింది. ఇద్దరు స్త్రీ, పురుషులు సహజీవనం చేస్తున్న సందర్భంలో దాన్ని ‘వివాహ స్వభావం కలిగిన సంబం ధం’గా ఆ చట్టం భావిస్తోంది. కానీ బహుభార్యత్వాన్ని మాత్రం అది ‘వివాహ స్వభావం కలిగిన బంధం’గా చూడటం లేదు. అలా గుర్తిస్తే చట్టబద్ధంగా పెళ్లాడిన మహిళలకు, వారి సంతానానికి అన్యాయం జరగొచ్చునని దాన్ని రూపొందించినవారు భావించి ఉండొచ్చు.

కానీ చట్టాలు గుర్తించినా గుర్తించకపోయినా ఇలాంటి బంధాలు ఉనికిలో ఉంటున్నాయి. ఇవి చిక్కుల్లో పడితే బాధితులుగా మారుతున్నది, దిక్కుతోచని స్థితిలో పడుతున్నది మహిళలే. వారు మగవాడి చేతిలో గృహహింసనూ, ఇతరత్రా వేధింపులనూ ఎదుర్కొంటున్నా చట్టాల నుంచి ఎలాంటి రక్షణా లభించడంలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు తర్వా తనైనా ఇతరత్రా బంధాలను గుర్తించే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.  పెద్దల ప్రమేయం లేకుండా యువతీయువకులు పరస్పరం ఇష్టపడి పెళ్లి చేసుకున్న  సంద ర్భాల్లో వివాదాలు ఏర్పడుతున్నాయి. కక్షలు, కార్పణ్యాలు రాజుకుంటున్నాయి. పరస్పరం దాడులు చేసుకోవడం, అవి హత్యలకు దారితీయడం కనబడుతూనే ఉంది. కులం, మతం, ప్రాంతం, డబ్బు, అధికారం వగైరాలన్నీ ఈ బంధాలకు అడ్డుగోడలవుతున్నాయి. హర్యానా, రాజస్తాన్, యూపీ తదితర ప్రాంతాల్లో ఖాప్‌ పంచాయతీలు ‘పరువు హత్యల’కు దిగుతు న్నాయి.

తోచిన విధంగా తీర్పులిస్తున్నాయి. ఫలానా కులం ఓట్లు తమకు రాకుండా పోతా యన్న భయంతో రాజకీయ పార్టీలు సైతం ఈ పంచాయతీలిచ్చే తీర్పుల విషయంలో మౌనం వహిస్తున్నాయి. ఖాప్‌ పంచాయతీల ఆగడాల విషయంలో తన ముందుకొచ్చిన పిటిషన్‌పై మూడు నెలలక్రితం తీర్పునిస్తూ యుక్త వయసొచ్చిన యువతీయువకులు పెళ్లి చేసుకున్నా లేదా చేసుకోవాలనుకున్నా దానిలో జోక్యం చేసుకునే హక్కు, వారిని విడదీసే హక్కు ఎవరికీ లేదని సుప్రీంకోర్టు చెప్పింది. వారి వివాహాల విషయంలో చట్టపరమైన సమస్యలుంటే న్యాయస్థానాలు పరిశీలించి చెప్పాలి తప్ప ఇతరులెవరూ జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. వివాహబంధం గురించి లేదా సహజీవనం గురించి ఇలా న్యాయస్థానాలు పదే పదే చెప్పవలసివస్తున్నది గనుక... వివాహ వ్యవస్థ వెలుపల ఏర్పడే బంధాలు చిక్కుల్లో పడిన ప్పుడు నష్టపోతున్నది అధికంగా మహిళలే గనుక ఈ విషయంలో నిర్దిష్టమైన చట్టాలుండటం అవసరం. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top