బాణీ మారని కాంగ్రెస్‌

Sonia Gandhi Is Back As Congress President - Sakshi

దాదాపు రెండున్నర నెలలపాటు సాగిన అంతర్గత మథనం తర్వాత చివరకు కాంగ్రెస్‌ పార్టీ గాంధీ–నెహ్రూ కుటుంబమే దిక్కని తీర్మానించింది. పార్టీ అధ్యక్ష పదవికి ముకుల్‌ వాస్నిక్, మల్లికార్జున్‌ ఖర్గే వంటి దళిత నేతల పేర్లు, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్‌ పైలెట్‌ వంటి యువ నేతల పేర్లు వినబడి, వారిలో ఎవరో ఒకరిని ఎన్నుకోవడానికి సంప్రదింపుల ప్రక్రియ ప్రారం భమైన కొన్ని గంటలకే అనూహ్యంగా సోనియాగాంధీకి పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్టు పార్టీ ప్రకటించింది. అయితే ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనన్న వివరణ కూడా వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ‘తాత్కాలిక ఏర్పాటు’ వ్యవధి ఎంతో ఎవరూ చెప్పలేరు. అధ్యక్ష పదవి నుంచి రాహుల్‌ తప్పుకున్నాక పార్టీ నిద్రాణస్థితికి  చేరుకుంది. దేశం దశ, దిశ మార్చే కీలక పరిణామాలు అనేకం చోటుచేసుకుంటున్నా పార్టీ అయోమయావస్థలో ఉండిపోయింది. ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యానాలు చేసి పార్టీ పరువు తీశారు. ఇంత మూల్యం చెల్లించాక కాంగ్రెస్‌ చివ రకు ‘నీవే తప్ప ఇతఃపరంబెరుగ... సంరక్షించు భద్రాత్మకా’ అని సోనియానే శరణువేడింది. ఆమెకు విశ్రాంతినవ్వడం అవసరమని కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ చేసిన ప్రకటన మినహా ఇతరు లంతా ఆ కుటుంబం మనసు మార్చుకుని సారథ్యబాధ్యతలు స్వీకరించడాన్ని హర్షిస్తున్నారు.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అధికారం మాట అటుంచి, కనీసం గౌరవప్రదమైన స్థాయిలో కాంగ్రెస్‌కు స్థానాలు లభిస్తాయని చాలామంది అంచనా వేశారు. అందుకు కారణం రాహుల్‌ గాంధీలో కనబడిన పరిణతే. 2014తో పోలిస్తే ఆయన చురుగ్గా పనిచేశారు. విపక్షంలో ఉండటం వల్ల ఆయనలో పోరాటశీలత పెరిగింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ వగైరా అంశాల్లో ఆయన పార్ల మెంటులోనూ, వెలుపలా చెప్పుకోదగ్గ రీతిలో పోరాడారు. పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం రాహుల్‌ నాయకత్వంపై పార్టీ శ్రేణులకు భరోసా కలిగించింది. కానీ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ చతికిలబడిన తీరుతో వారు నిరాశలో కూరుకుపోయారు. గతంతో పోలిస్తే 8 స్థానాలు మాత్రమే అదనంగా రావడం, కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాకైనా దిక్కులేకపోవడం నైతికంగా దెబ్బతీసింది. రాహుల్‌గాంధీయే అయోమయా వస్థలో పడిపోయారు. ప్రధాని నరేంద్రమోదీపైనా, బీజేపీపైనా తాను ఒంటరి పోరు చేయాల్సి వచ్చిందని ఆయన, ఆయన సోదరి ప్రియాంక నేరుగానే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో నిష్టూర మాడారు. ఆ తర్వాతే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతోపాటు తమ కుటుంబం నుంచి ఎవరూ పగ్గాలు చేపట్టే ప్రశ్నేలేదని తేల్చిచెప్పారు. నేతలంతా నచ్చజెప్పాలని చూసినా, పీసీసీలు, ఇతర అనుబంధ సంస్థలూ తీర్మానాలు చేసినా ఆయన చలించలేదు. గత్యంతరం లేక కొత్త అధ్య క్షుడిని అన్వేషించడం కోసం ముఖ్యనేతలతో కమిటీని ఏర్పాటు చేశారు. వారు రాష్ట్రాలవారీగా అభి ప్రాయాలు తీసుకున్నారు. యువ నేతలైతే మంచిదన్న వారు కొందరైతే, రద్దయిన లోక్‌సభలో విపక్ష నేతగా వ్యవహరించిన మల్లికార్జున్‌ ఖర్గే సమర్థుడని మరికొందరు చెప్పారన్న కథనాలు వెలు వడ్డాయి. సోనియా రాజకీయ వ్యవహారాల సలహాదారు అహ్మద్‌ పటేల్‌ ముకుల్‌ వాస్నిక్‌ లేదా ఖర్గే ఆ పదవి అధిష్టించాలని కోరుకుంటున్నారన్న వదంతులు గుప్పుమన్నాయి. చివరకు తిరిగి తిరిగి సోనియా వద్దకే ఆ పదవి వెళ్లింది.

పార్టీని పూర్తిగా తమ అదుపాజ్ఞల్లో ఉండేవిధంగా తీర్చిదిద్ది, దాని అభివృద్ధికి సూచనలు చేసిన వారినీ, సొంత చొరవతో పార్టీ పటిష్టతకు చిత్తశుద్ధిగా పనిచేసినవారిని అనుమాన దృక్కులతో చూసినచోట, అవమానించి వెళ్లగొట్టినచోట ఇంతకంటే మెరుగైన పరిణామాలను ఊహించలేం. విధేయతే ప్రధాన అర్హతగా భావించకుండా నేతలకు వేర్వేరు బాధ్యతలప్పగించి, లక్ష్యాలు నిర్దేశిస్తే ఎవరి సమర్థత ఎంతో తెలిసేది. పార్టీని, దాని ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ సమష్టిగా కృషి చేసేవారు. తమ తమ సత్తా చాటేవారు. కానీ ఇందుకు భిన్నంగా తమ చుట్టూ కోటరీని నిర్మించుకోవడంతోపాటు రాష్ట్రాల్లో దానికి అనుబంధంగా పనిచేసే బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. కనీసం తమ నివాస ప్రాంతాల్లో ఓట్లు కూడా రాబట్టలేనివారు కూడా ఇందులో భాగస్తులయ్యారు. చాడీలు చెప్పి నాయకులుగా చలామణీ అయ్యారు. వారు చెప్పిందే వేదమైంది. వారితోనే పార్టీ విజయశిఖరాలు అధిరోహిస్తుందన్న భ్రమలో సోనియా, రాహుల్‌ కూరుకు పోయారు. వాస్తవానికి రాహుల్‌గాంధీ ఈ సంగతి గ్రహించకపోలేదు. పార్టీకి కొత్త నెత్తురు ఎక్కించా లని, యువతకు చోటీయాలని ఆయన మొదట్లో కొంత ప్రయత్నించారు. కానీ అందులో కాస్త యినా విజయం సాధించలేకపోయారు. 

ఇక పార్టీలో ‘నిజమైన’ మార్పు ఖాయమనుకున్న నేతలకు చివరకు నిరాశే మిగిలింది. సోనియా కుటుంబసభ్యులు పోటీలో ఉండబోరన్న సంగతి తెలిశాక యువనేతలు కొందరు పార్టీ సారథ్యాన్ని అందుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టకపోలేదు. కానీ ఆ కుటుంబం నేరుగా తాము రంగంలో లేకపోయినా తమ చెప్పుచేతల్లో ఉండేవారిని అక్కడ ప్రతి ష్టించదల్చుకున్నదని వారికి ఆలస్యంగా అర్ధమైంది. కనుకనే కొత్త సారథి ఎంపిక ప్రక్రియ తూ తూ మంత్రంగా సాగింది. పార్టీలో అందరికీ ఆమోదయోగ్యులైనవారు, దాన్ని ఏకతాటిపై నడపగలిగిన వారు ‘రెడీమేడ్‌’గా దొరకరు. బాధ్యతలు అప్పగించి వారిని సొంతంగా పనిచేయనిస్తే... నిర్ణయా త్మకంగా వ్యవహరించడానికి, కొత్త ఆలోచనలు చేయడానికి అవకాశం ఏర్పడితే అలాంటి నేతలు రూపొందుతారు. అప్పుడు సమాజంలోని భిన్నవర్గాలు పార్టీకి చేరువవుతాయి. కానీ కాంగ్రెస్‌లో అది ఇప్పట్లో సాధ్యం కాదని తాజా పరిణామం నిరూపించింది. కనీసం ఈ ‘తాత్కాలిక’ దశలోనైనా పార్టీలో పని సంస్కృతిని సోనియా పెంచగలుగుతారా, చిత్తశుద్ధితో పనిచేసేవారిని గుర్తించగలుగు తారా అన్నదాన్నిబట్టి కాంగ్రెస్‌ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top