​​​​​​​బెడిసికొట్టిన సవాలు!

Sakshi Editorial On TRAI Chief  Ram Sewak Sharma

జనం కోసం చెప్పే అబద్ధాలను తామే నమ్మే స్థితికి చేరుకుంటే ఎంత ప్రమాదమో ట్రాయ్‌ చైర్మన్‌ రాంసేవక్‌ శర్మకు అనుభవపూర్వకంగా అర్ధమై ఉండాలి. ఆధార్‌ అందజేసే విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన శర్మ దాన్ని బాగా వెనకేసుకొచ్చేవారు. అది ఎంతో సురక్షితమైన విధానమని అభయమిచ్చేవారు. చివరికది ఆయనలో విశ్వాసంగా మారి ట్వీటర్‌లో సవాలు విసిరే వరకూ వెళ్లింది. తన ఆధార్‌ నంబర్‌ను ఆయన అందులో విడుదల చేశారు. ‘దీని ఆధారంగా నాకు ఎలాంటి హాని చేయగలరో చూపమ’ని నెటిజన్లను కవ్వించారు. శర్మ ఉన్నతాధికారి మాత్రమే కాదు... ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణుడు కూడా. కానీ సైబర్‌ ప్రపంచం అసాధా రణమైనది. అక్కడ ఆయన్ను మించిన నిపుణులుంటారు. ఎవరినీ ఖాతరు చేయకపోవడం, ఏ సవాలుకైనా సిద్ధపడటం వారి నైజం. అందుకే శర్మకు వెనువెంటనే స్పందనలు మొదలయ్యాయి. 24 గంటలు తిరగకుండానే ఎథికల్‌ హ్యాకర్లు ఆయన వ్యక్తిగత వివరాలన్నీ ఏకరువు పెట్టారు. బ్యాంకు ఖాతాల నంబర్లు, వాటిల్లో జరిగిన లావాదేవీలు, ఆయన ఈ–మెయిల్, పాన్‌ నంబర్, వాట్సాప్‌ వివరాలు, రెండు ఫేస్‌బుక్‌ ఖాతాలు, ఆయన ఇంటి చిరునామా, ఆయన కుటుంబసభ్యుల వివరాలు బయటపెట్టారు. ఒకరైతే ఆయన చిరునామాకు ఆయన పేరిటే కొత్త మొబైల్‌ ఫోన్‌ను కూడా బుక్‌ చేశారు. ఆయన బ్యాంకు ఖాతాకు రూపాయి చొప్పున పంపినవారున్నారు.

ఆయన ఆధార్‌ నంబర్‌ను ఉపయోగించుకుని మరొక నెటిజన్‌ నకిలీ ఆధార్‌తో ఫేస్‌బుక్, అమెజాన్‌ క్లౌడ్‌ సర్వీస్‌లలో చేరాడు. ఆ రెండు మాధ్యమాలూ ఆయన చూపిన నకిలీ ఆధార్‌ను విశ్వసించాయి. ఇలా చేసిన వారంతా కేవలం శర్మ సవాలుకు జవాబిచ్చేందుకే ఆ పని చేశారు. కానీ సైబర్‌ నేరగాళ్లతో అంతకుమించిన ప్రమాదం ఉంటుంది. కానీ జరిగినదానికి శర్మ చెక్కు చెదరలేదు. ‘నేను ఈ వివ రాలు చెప్పమని సవాలు చేయలేదు... నాకు హాని చేసి చూపండ’న్నాను అంటున్నారు. గోప్యంగా ఉండాల్సిన తన వివరాలన్నీ బజారునపడటం హాని కాదని ఆయననుకుంటున్నారు. కానీ పౌరు లందరూ అలా భరోసాతో ఉండలేరు. నేరగాళ్లు ఎవరి ఆధార్‌ కార్డునైనా ఆన్‌లైన్‌లో సేకరించి ఫొటో తారుమారు చేసి సులభంగా సిమ్‌ కార్డు పొందగలరు. నేరాలకు పాల్పడగలరు. ఏమైనా జరిగిన పక్షంలో శర్మ ఉన్నతస్థాయి అధికారిగనుక  ఫిర్యాదు చేస్తే తక్షణం పోలీసు వ్యవస్థ స్పందిస్తుంది. కానీ సాధారణ పౌరులకు అలాంటి ఆసరా లభిస్తుందన్న గ్యారెంటీ లేదు. ఈ వ్యవహారం తర్వాత శర్మ కుమార్తెకు ట్వీటర్‌లో బెదిరింపులు వచ్చాయని ఒక వెబ్‌సైట్‌లో వార్త వెలువడింది. ఆధార్‌ వెల్లడితో ఎంత చేటు జరగవచ్చునో దీన్నిబట్టే అర్ధమవుతుంది.
 
ఈ ఏడాది మొదట్లో ఆంగ్ల దినపత్రిక ట్రిబ్యూన్‌ జర్నలిస్టు ఒకరు రూ. 500 చెల్లించి కోట్లాదిమంది పౌరుల వివరాలన్నీ ఉన్న ఆధార్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సంపాదించారు. మరికొంత సొమ్ముతో కావలసిన ఆధార్‌ కార్డు వివరాల కాపీ పొందడానికి వీలు కల్పించే సాఫ్ట్‌వేర్‌ పొందారు. కార్డుకు రూ. 2 చెల్లించి 15,000మంది పౌరుల వివరాలు కూడా రాబట్టారు. ఇలా వెల్లడైనప్పుడు కూడా ఆధార్‌ అధికారులు ‘అయితే ఏమిటి...’ అంటూ దీర్ఘాలు తీశారు. ఆధార్‌ సర్వర్లు, సాఫ్ట్‌వేర్‌ దుర్భేద్యమైనవని, వాటిని సైబర్‌ నేరగాళ్లు ఛేదించటం అసాధ్యమని చెబుతూ వచ్చినదానికి భిన్నంగా అవి ఎవరికైనా అతి సులభంగా దొరకటం కంటే ప్రమాదం ఏముంటుంది? ఆ వివరాలతో అసాంఘిక శక్తులు ఏమైనా చేయొచ్చు. ముంబైలో దావూద్‌ ఇబ్రహీం ముఠా రాజ్యమేలినప్పుడు బ్యాంకుల్లో పనిచేసే సిబ్బందిని లోబరుచుకుని వారి ద్వారా బాగా డబ్బున్న ఖాతాదార్లెవరో తెలు సుకుని మామూళ్ల కోసం వేధించేవారు. ఇప్పుడు ఆధార్‌ పుణ్యమా అని అదంతా మరింత సులభమైంది.

 

శర్మ తన ఆధార్‌ నంబర్‌ను వెల్లడించాక ఆయనకు మద్దతుగా మరికొందరు తమ నంబర్‌లు కూడా ట్వీటర్‌లో బహిర్గతం చేశారు. ఇలా చేయటం చట్టవిరుద్ధమని, అనర్ధదాయకమని యూఐడీఏఐ అంటున్నది. వేరే వారి నంబర్‌ ఉపయోగించుకున్నట్టు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. మంచిదే. కానీ ఆధార్‌ ప్రారంభించటానికి ముందే దాన్ని ఏ ఏ ప్రయోజనాలకు వినియోగించాలో, ఎలాంటి పరిమితులు విధించాలో ప్రభుత్వానికీ, యూఐడీఏఐకి అవగాహన ఉంటే బాగుండేది. ఆధార్‌ మొదలుకావటం తరవాయిగా దాన్ని అన్నిటికీ తప్పనిసరి చేయటం ప్రారంభించారు. ప్రజాస్వామ్యానికి కీలకమనదగ్గ ఎన్నికల ప్రక్రియను దొంగ ఓట్ల బెడద పరిహసిస్తోంది. దానికి మాత్రం ఆధార్‌ అక్కర్లేదని ప్రభుత్వాలు ఎందుకనుకుంటున్నాయో తెలి యదు. ఆమధ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన 210 వెబ్‌సైట్లు పౌరుల ఆధార్‌ వివ రాలన్నీ పొందుపరిచాయి. ఆ తర్వాత యూఐడీఏఐ జోక్యంతో వీటిని తొలగించారు. ఇలా ప్రభుత్వ విభాగాలకే ఆధార్‌ విషయంలో అంతంతమాత్రం అవగాహన ఉంటే ఇక సాధారణ పౌరుల గురించి చెప్పేదేముంది? డేటా లీకైతే ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చునన్న అంశంపై ఇన్నాళ్ల తర్వాత ఈమధ్యే ముసాయిదా బిల్లు రూపొందింది. 

పౌరులు తమ సమస్త అవసరాలకూ ఆధార్‌ అనుసంధానించాల్సిన అవసరమేమిటో ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. బ్యాంకు ఖాతాలకూ, బీమా పాలసీలకూ, ప్రావిడెంట్‌ ఫండ్‌కూ, ఆఖ రికి పింఛన్‌కూ... ఆధార్‌ అవసరమంటున్నారు. తీరా వేలిముద్రలు సరిపోలడంలేదని సబ్సిడీలు ఎగ్గొడుతున్నారు. పింఛన్‌ చెల్లించడానికి వేధిస్తున్నారు. ఆధార్‌ నంబర్‌ ద్వారా లబ్ధిదారుల వివరా లన్నీ తెలిసే అవకాశమున్నప్పుడు కేవలం వారి వేలిముద్రల కోసం అంత పట్టుబట్టటం, అవి సరిగా లేవని వారికి రావలసినవి నిరాకరించటం ఏం సబబు? ఆధార్‌ చెల్లుబాటుపై సుప్రీంకోర్టు దాదాపు నాలుగు నెలలపాటు విచారించి మొన్న మే నెలలో తీర్పు రిజర్వ్‌ చేసింది. తాజా ఉదంతం తర్వాత ఆ తీర్పు ఎలా ఉండబోతున్నదన్న ఆసక్తి అందరిలో మరింత పెరిగింది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top