పాకిస్తానీ ‘సుప్రీం’ సంచలనం

Sakshi Editorial On Pakistan Supreme Court Orders To Its Military

రాజకీయాలలో తలదూర్చరాదంటూ పాకిస్తాన్‌ సైన్యాన్నీ, వేగుల విభాగాన్నీ, గూఢచర్యశాఖనూ ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. విద్వేషం, తీవ్రవాదం, ఉగ్రవాదం వ్యాప్తికి దోహదం చేస్తున్న వ్యక్తులపైనా, సంస్థలపైన కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌ ప్రభుత్వాన్నీ, ఆ దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలనూ సుప్రీంకోర్టు కోరింది. 2017లో ఫైజాబాద్‌లో తెహ్రీక్‌ పాకిస్తాన్‌ (టీఎల్‌పీ), మరి కొన్ని సంçస్థలు కలిసి మూడువారాలపాటు జరిపిన బైఠాయింపు ఆందోళనకు సంబంధించిన  కేసులో బుధవారంనాడు జస్టిస్‌ ఖాజీ ఫాయిజ్‌ ఇసా, జస్టిస్‌ ముషీర్‌ ఆలంతో కూడిన బెంచ్‌ ఈ చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది.  ఇంటర్‌  సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ), మిలిటరీ ఇంటెలిజెన్స్‌ (ఎంఐ), ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (ఐఎస్‌పీఆర్‌) వంటి సంస్థలు తమ హద్దులకు లోబడి వ్యవహరించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది.  ఈ సంస్థల పరిమితు లనూ, విధులనూ స్పష్టంగా నిర్వచిస్తూ చట్టాలు చేయాలని పార్లమెంటుకు న్యాయస్థానం సూచిం చింది. ఇది అసాధారణమైన తీర్పు. పాకిస్తాన్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ శాసించేది సైన్యమే. దాన్నే ‘ద ఎస్టాబ్లిష్‌మెంట్‌’ అంటారు. ఇది బహిరంగ రహస్యం. అధికారంలో బేనజీర్‌ భుట్టో ఉన్నా, నవాజ్‌ షరీఫ్‌ ఉన్నా, ఇమ్రాన్‌ ఖాన్‌ ఉన్నా సైన్యం మాట చెల్లుబాటు కావలసిందే. లేకపోతే ప్రధానులు గల్లంతు అవుతారు. సైన్యం అధికారం హస్త గతం చేసుకుంటుంది. ఆయూబ్‌ఖాన్, యాహ్యాఖాన్, జియా–ఉల్‌–హక్,  ముషారఫ్‌ వంటి జన రల్స్‌ ప్రధానులను తోసిరాజని అధికారం చేజిక్కించుకున్నవారే. జుల్ఫికర్‌ అలీ భుట్టో, ఆయన కుమార్తె బేనజిర్‌ భుట్టోలను హత్య చేయించిందీ సైనిక పాలకులే. నవాజ్‌ షరీఫ్‌కీ, బేజనీర్‌కీ విదే శాలలో తలదాచుకోవలసిన పరిస్థితులు కల్పించిందీ అధికారదాహం అపరిమితంగా కలిగిన సైన్యాధిపతులే. పాకిస్తాన్‌ పౌరహక్కుల దివంగత నేత ఆస్మా జహంగీర్‌ మాటలలో చెప్పాలంటే, ‘మా సైన్యానికి అరకొర అధికారం అక్కరలేదు. సంపూర్ణాధికారం కావాలి.’

అటువంటి దేశంలో సుప్రీంకోర్టు ఆదేశం అమలు జరుగుతుందా? నిజంగానే ప్రజలు ఎన్ను కున్న ప్రధానులు పదవులలో సురక్షితంగా కొనసాగుతారా? సైన్యాధిపతులు బారకాసులకే పరి మితం అవుతారా? పాకిస్తాన్‌లో న్యాయస్థానాలు సాహసోపేతమైన తీర్పులు ఇచ్చిన సందర్భాలు గతంలోనూ లేకపోలేదు. 2011 ఏప్రిల్‌లో నాటి ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్‌ మహమ్మద్‌ ఇటు వంటి ఆదేశాలే జారీ చేశారు. పాకిస్తాన్‌ సైనికులు తాము చేసిన ప్రమాణానికి కట్టుబడి రాజకీయా లకు దూరంగా ఉండాలనీ, రాజ్యాంగాన్ని గౌరవించాలనీ ఒక కేసులో తీర్పు చెప్పారు. అప్పుడు దేశాధ్యక్షుడుగా బేనజీర్‌ భర్త ఆసిఫ్‌ అలీ జర్దారీ ఉండేవారు. అప్పటి నుంచీ సైన్యాధ్యక్షులు ప్రధా నుల జోలికి వెళ్ళలేదు కానీ పరోక్షంగా అధికారం చెలాయిస్తూ వచ్చారు. విదేశీ వ్యవహారాలూ, ఆర్థిక వ్యవహారాలూ, ఆంతరంగిక భద్రతకు సంబంధించి తుది నిర్ణయం సైన్యాధిపతిదే.  సైన్యంతో తలబడి తలబొప్పికట్టిన నేత నవాజ్‌ షరీఫ్‌.  2014 డిసెంబర్‌లో పాకిస్తానీ తాలిబాన్‌ పెషావర్‌లో ఒక పాఠశాలపైన దాడి చేసి ముక్కుపచ్చలారని 132 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారు. దేశప్రజలు దిగ్భ్రాంతికి గురైనారు. తాలిబాన్‌ కార్యకలాపాలపైన ఉక్కుపాదం మోపడానికీ, వారి మతోన్మాదాన్ని అరికట్టడానికీ, ఆర్థికవనరులను దెబ్బతీయడానికీ నవాజ్‌షరీఫ్‌ ప్రభుత్వం 20 అంశాల జాతీయ క్రియాశీల ప్రణాళిక (నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌)ను పకడ్బందీగా సిద్ధం చేశారు. ‘మంచి’ తాలిబాన్‌ (పాకిస్తాన్‌ విరోధులపై దాడులు చేసే ఉగ్రవాదులు), ‘చెడు’ తాలిబాన్‌ (పాకిస్తాన్‌లోనే మానవబాంబులను ప్రయోగించి హత్యాకాండకు తెగబడేవారు) అంటూ తేడా చూపనవసరం లేదని కూడా షరీఫ్‌ చెప్పారు. తాలిబాన్‌ను విచారించేందుకు మిలి టరీ కోర్టులను నెలకొల్పాలంటూ పాకిస్తాన్‌ పార్లమెంటు రాజ్యాంగ సవరణ  చేయడంతో సైన్యం ప్రమేయం పెరిగింది. సుమారు 50 వేల మంది తాలిబ్‌లను అరెస్టు చేశారు.

లష్కర్‌–ఇ–జంఘ్వీ నాయకుడు మాలిక్‌ ఇషాక్‌ను ఎన్‌కౌంటర్‌ చేశారు. దీనికి ప్రతిగా పంజాబ్‌ గవర్నర్‌ షుజా ఖాన్జా దాను లష్కర్‌–ఇ–జంఘ్వీ హతమార్చింది. కానీ దేశం మొత్తంమీద ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గు ముఖం పట్టాయి. అప్పటి సైన్యాధిపతి జనరల్‌ రహీల్‌ షరీఫ్‌ ప్రతిష్ఠ పెరిగింది. క్రమంగా తాలి బాన్‌పైన ఒత్తిడి తగ్గించారు. అంతకంటే ముందు జనరల్‌ ముషారఫ్‌ ప్రభుత్వం 2007లో వేలాది మంది జిహాదీలను జైలులో పెట్టింది. కొన్ని మాసాల తర్వాత విడుదల చేసింది. జిహాదీలకూ, రాజకీయ నాయకులకూ, సైన్యాధికారులకూ రహస్య సంబంధాలు ఉంటాయి. పాకిస్తాన్‌ తాలిబా న్‌నీ, ఇతర జిహాదీ ముఠాలనీ సైన్యం ఒకే గాటన కట్టదు. కశ్మీర్‌పైన దాడులు సాగించే లష్కర్‌–ఇ– తొయ్యబా (ఉరఫ్‌ జమాత్‌–ఉద్‌–దవా)నూ, అఫ్ఘానిస్తాన్‌తో పోరాడుతున్న తాలిబాన్‌నూ, హకానీ దళాలనూ పాకిస్తాన్‌  పౌరప్రభుత్వాలూ, న్యాయస్థానాలూ, సైన్యం ఉపేక్షిస్తాయి. పాకిస్తాన్‌లో హింసకు పాల్బడుతున్న ఉగ్రవాదులను ఏరివేయాలన్న విఫల ప్రయత్నం చేస్తాయి. కొందరు ఉగ్ర వాదులకు సైన్యం ఆశీస్సులు ఉంటాయి. 2002లో ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ విలేఖరి డేనియల్‌ పెర్ల్‌ను చంపిన లండన్‌ స్కూల్‌ ఆప్‌ ఎకనామిక్స్‌ పట్టభద్రుడు ఒమర్‌షేక్‌ కేసు న్యాయస్థానాలలో ఇప్పటికీ అపరిష్కతంగానే నత్తనడక నడుస్తూ ఉంది. 2008లో ముంబయ్‌పైన దాడి చేసిన ముష్కరులూ, వారి నాయకుడు హఫీజ్‌ సయీద్‌ పాకిస్తాన్‌ సమాజంలో హీరోలుగా చెలామణి అవుతున్నారు.  2011లో పంజాబ్‌ (పాకిస్తాన్‌) గవర్నర్‌ సల్మాన్‌ తసీర్‌ను చంపివేసిన ముంతాజ్‌ ఖాద్రీ క్షేమంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు అమలు జరుగుతాయని విశ్వసిం చడం కష్టమే. సైన్యం సహకారంతో అధికారంలోకి వచ్చారనే వదంతులకు ఆస్కారం ఇచ్చిన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కానీ పౌరసంస్థలకు కానీ సైన్యంపైన ఆంక్షలు విధించేందుకు అవసరమైన గుండెబలం ఉన్నదా అన్నది సందేహాస్పదమే. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top