ఎవరి వ్యూహం వారిది!

Sakshi Editorial On Narendra Modi Campaign In Telangana

‘ఆడవారి మాటలకూ అర్థాలే వేరులే,’ అంటూ సినీకవి దెప్పిపొడవడంలో పురుషాధిక్యభావం  ఉన్నదని తప్పుపట్టవచ్చును కానీ ఎన్నికల ఆట ఆడేవారి మాటలకు అర్థాలు వేరంటే ఎవ్వరూ ఆక్షేపించనక్కరలేదు. ప్రధాని నరేంద్రమోదీ, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీల పర్యటనలతో తెలంగాణ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఎవరు ఏ మాట ఎందుకు మాట్లాడుతున్నారో, ఎవరి లక్ష్యం ఏమిటో, ఎవరి వ్యూహం ఏ పరిణామాలకు దారితీస్తుందో తెలుసుకోవడం కష్టం. రాజ కీయాలను నిత్యం సునిశితంగా పరిశీలిస్తున్నవారికి నాయకుల ప్రసంగాలలోని అంతరార్థం తెలిసిపోతుంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కొన్ని రోజుల కిందట తెలంగాణలో పర్యటించినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌)పైన ధ్వజమెత్తారు. ఆయనకూ, ప్రధాని మోదీకి మధ్య రహస్య ఒప్పందం ఉన్నదని ఆరోపించారు. అందుకు ఎన్నికలు ముందుకు జరిపారంటూ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, రాహుల్‌గాంధీ తాజా మిత్రుడు నారా చంద్రబాబునాయుడు సైతం అదే ఆరోపణ అనేక సందర్భాలలో చేశారు.

ఈ అంశంపైన ప్రజలలో సందేహం లేకపోలేదు. ప్రతిపక్షాల ప్రచారం వల్ల కావచ్చు, కార్యకారణ సంబంధాల విశ్లేషణ వల్ల కలిగే అవగాహన వల్ల కావచ్చు మోదీ, కేసీఆర్‌ల మధ్య అప్రకటిత ఒప్పందం ఉన్నదనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. ఇదే ఆరోపణను ప్రజలు విశ్వసిస్తే ఎన్నికలలో కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)కి నష్టం వాటిల్లుతుంది. ముస్లిం ఓట్లపైన ఆధారపడి అంచనాలు వేసుకొని ఆత్మవిశ్వాసంతో ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన కేసీఆర్‌కు మోదీతో స్నేహం చేస్తున్నారనే వదంతి టీఆర్‌ఎస్‌కు నిశ్చయంగా అపకారం చేస్తుంది.  ఈ అభిప్రాయాన్ని పటాపంచలు చేసేందుకే నిర్మల్‌ ఎన్నికల సభలో కేసీఆర్, ‘మోదీకి హిందూ–ముస్లిం బీమారీ (జబ్బు)’ ఉన్నదంటూ ఘాటైన వ్యాఖ్య చేశారు. దీన్ని జాతీయ స్థాయి టీవీ చానెళ్ళలో బీజేపీ ప్రతినిధులు ఖండించారు. ఒక ప్రధానిని పట్టుకొని అంత మాట అంటారా అంటూ టీవీ ప్రవక్తలు ఆశ్చర్యం, ఆగ్రహం వెలిబుచ్చారు. టీఆర్‌ఎస్‌కు ముస్లింలు దూరమైతే బీజేపీకి ప్రయోజనం లేదు. ముస్లింలు ఎటూ బీజేపీకి మూకుమ్మడిగా ఓటు చేయరు. టీఆర్‌ఎస్‌ కాదనుకుంటే కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తారు. కేసీఆర్, మోదీ రహస్య మిత్రులనే మాట విశ్వసనీయతను సంతరించుకోవడం బీజేపీ ప్రయోజనాలకూ భంగకరమే. అందుకే మోదీ మంగళ వారం నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ పట్టణాలలో ఎన్నికల సభలలో మాట్లాడుతూ కేసీఆర్‌ను ఎక్కువ మోతాదులోనే విమర్శించారు.

టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెండూ ఒకటేనంటూ ధ్వజమెత్తారు. సోనియాగాంధీ రిమోట్‌కంట్రోల్‌తో నడిపిన యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్‌ మంత్రిగా పని చేశారనీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు రెండూ కుటుంబాలు నడిపే పార్టీలేననీ, రెండింటిలోనూ అంతర్గత ప్రజాస్వామ్యం బొత్తిగా లేదనీ ఆరో పించారు. ఒక అవగాహనతోనే (మ్యాచ్‌ఫిక్సింగ్‌) కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు పరస్పరం విమర్శిం చుకుంటున్నాయనీ, ఇది మిత్రవైరమనీ, ఫ్రెండ్లీ మ్యాచ్‌ అనీ మోదీ అభివర్ణించారు. ‘ఒక్క కుటుంబం వల్లనే తెలంగాణ వచ్చిందా? ఒక్క కుటుంబం కోసమే తెలంగాణ యువత బలిదానం చేశారా,’ అంటూ ప్రశ్నించారు. ‘జనతా జనార్దన్‌’కు సిసలైన సేవ చేసే పార్టీ బీజేపీ మాత్రమేనంటూ ప్రకటించారు. మోదీ విమర్శకు సమాధానం కొన్ని గంటల వ్యవధిలోనే కేసీఆర్‌ అంతే ధాటిగా  ఇచ్చారు. బీజేపీకి మతపిచ్చి పెరిగిందంటూ హాలియా సభలో వాక్బాణాలు సంధించారు. మోదీకి చంద్రబాబునాయుడు భయపడవచ్చునేమో కానీ తాను భయపడేది లేదనీ, తాను ఎటువంటి తప్పూ చేయలేదనీ కేసీఆర్‌ అన్నారు. మోదీ అయినా, రాహుల్‌గాంధీ అయినా స్థానిక నాయకులు అందించిన సమాచారాన్ని తమ ప్రసంగాలలో వినియోగిస్తారు. మోదీ అనుభవజ్ఞుడూ, ప్రతిభాశాలి అయిన వక్త కనుక కేసీఆర్‌పైన దాడి బలంగా చేయగలిగారు. మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చి అధికారంలో ఉన్న కేసీఆర్‌నూ, అధికారపక్షమైన టీఆర్‌ఎస్‌నీ ప్రస్తావించకుండా కేవలం కాంగ్రెస్‌నీ, టీడీపీనీ విమర్శించి ఢిల్లీకి వెళ్ళిపోతే తనకూ, కేసీఆర్‌కీ మధ్య మైత్రీబంధం ఉన్నదనే అభిప్రాయం బలపడుతుంది. పైగా 119 స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టిన బీజేపీ తెలంగాణ ప్రభుత్వం లోటుపాట్లపైన వ్యాఖ్యానించకుండా ఉండటం ఆత్మహత్యాసదృశం. అందుకే కేసీఆర్‌పైన మోదీ పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ కాంగ్రెస్‌  కూటమిలో చేరినప్పటికీ ఆ పార్టీని కానీ ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కానీ మోదీ పెద్దగా ప్రస్తావించకపోవడం విశేషం. దాడిని కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌పైనే కేంద్రీకరించారు. 

బద్ధశత్రువులైన కాంగ్రెస్, టీడీపీలు చేతులు కలపడం ఈ ఎన్నికలలో ప్రత్యేకత. ఇటీవలి వరకూ సోనియాగాంధీని ఇటలీ మాఫియోజీ అనీ, కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేయాలనీ రంకెలు వేసిన చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్ళి రాహుల్‌ నివాసంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడితో సమాలోచన జరపడం వర్తమాన రాజకీయాలను మలుపు తిప్పిన సందర్భం. గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా టీడీపీని తిట్టిపోసిన కాంగ్రెస్‌ నాయకులకు ఇప్పుడు చంద్రబాబునాయుడు ఆప్తుడైనారు. నాలుగేళ్ళు బీజేపీతో అధికారం పంచుకున్న టీడీపీ మోదీని శత్రువుగా పరిగణిస్తున్నది.  మోదీని వ్యతిరేకిస్తున్నట్టు ప్రజలకు అర్థం కావడం చంద్రబాబునాయుడి అవసరం. కానీ చంద్రబాబునాయుడిని తన ప్రత్యర్థిగా పరిగణించడం మోదీకి ఇష్టం ఉన్నట్టు లేదు. మార్చిలో ఎన్‌డీఏ నుంచి టీడీపీ నిష్క్రమించిన తర్వాత  మోదీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెంచడానికి చంద్రబాబునాయుడు శాయశక్తులా కృషి చేస్తున్నప్పటికీ మోదీ టీడీపీ అధినేతపైన పల్లెత్తు మాట కూడా అనకపోవడం విశేషం. చంద్రబాబునాయుడు తనకు సమఉజ్జీ కాదని మోదీ అనుకుంటున్నారో లేక భవిష్యత్తులో చంద్రబాబునాయుడితో అవసరం ఉండవచ్చున ని భావిస్తున్నారో ఊహించుకోవలసిందే. అవకాశవాద రాజకీయాలకు ఇది పరాకాష్ఠ. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top