మమత ‘మందుపాతర’

Sakshi Editorial On Mamata Banerjee

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పుడేం మాట్లాడ తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఊహించడం అసాధ్యం. తనకు సబబనిపిస్తే ఏమైనా అనడం, ఎంతటి నిర్ణయం తీసుకోవడానికైనా వెరవకపోవడం ఆమె నైజం. ప్రభుత్వంలో పనులు చేసిపెడతామని ఆశచూపి తృణమూల్‌ నేతలు, ఇతరులు జనం నుంచి వసూలు చేసిన డబ్బంత టినీ వెనక్కిచ్చేయాలంటూ ఇటీవల ఆమె చేసిన ప్రకటన మందుపాతరలా పేలి పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు, ప్రజాప్రతినిధుల ఇళ్లను జనం ఘెరావ్‌ చేయడం, తీసుకున్న లంచం డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేయడం... ఫలానా నేత ఇన్ని లక్షలు తీసుకున్నాడని బాహాటంగా ప్రకటించడం లాంటి పరిణామాలు ఆ పార్టీని ఊపిరాడకుండా చేస్తు న్నాయి. దీనికి కొనసాగింపుగా కావొచ్చు... ప్రజలిచ్చే ఫిర్యాదులను తేలిగ్గా తీసుకుని పట్టించుకోని పోలీసులపై తీవ్ర చర్యలుంటాయని కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ హెచ్చరించారు. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా దెబ్బతినడం, బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరగడం మమ తకు మింగుడుపడటం లేదు. రాష్ట్రంలోని 42 స్థానాల్లో తృణమూల్‌కు 22 దక్కగా, బీజేపీకి 18 లభించాయి. అసెంబ్లీ స్థానాలవారీగా చూస్తే బీజేపీకి 121 చోట్ల ఆధిక్యతలో ఉన్నదని నిపుణులు చెబుతున్నారు.

అందుకే రెండేళ్లలో ముంచుకొస్తున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీకి ‘షాక్‌ ట్రీట్‌మెంట్‌’ తప్పనిసరని ఆమె భావించినట్టు కనబడుతోంది. సహజంగానే ఇలాంటి చర్యలు అనుద్దేశిత పర్యవసానాలకు దారితీస్తాయి. ఇప్పుడు బెంగాల్‌లో జరుగుతున్నది అదే. ఒక గ్రామంలో నిండు చూలాలిగా ఉన్న పంచాయతీ సభ్యురాలు జనం తమ ఇంటిపై దండెత్తబోతున్నా రని తెలిసి ‘బతుకుజీవుడా’ అనుకుంటూ అజ్ఞాతంలోకి పోయింది. మరోచోట ఒక నాయకుడు ఉరే సుకుని చనిపోయాడు. తృణమూల్‌ రాజ్యసభ సభ్యుడు శంతనుసేన్, ఆ పార్టీ కౌన్సిలర్‌ కలసి 2012 మొదలుకొని తననుంచి లక్షల రూపాయలు లంచాలు తీసుకున్నారని కోల్‌కతాలో ఒక రియ ల్‌ఎస్టేట్‌ వ్యాపారి ఆరోపించాడు. ఇవన్నీ చూశాక ఆ పార్టీ స్వరం మార్చవలసి వచ్చింది. మమత మాటల్ని మీడియా వక్రీకరించిందని ప్రకటించింది. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల్లో 99.99 శాతంమంది నిజాయితీపరులని ఆమె ప్రశంసించారని, ఇతర పార్టీలనుంచి వచ్చిన 0.01 శాతం మందితోనే సమస్యలున్నాయని చెప్పారని తృణమూల్‌ నేతలు వివరిస్తున్నారు. ఘెరావ్‌ల వెనక బీజేపీ ఉన్నదని ఆరోపిస్తున్నారు. ఇందులో నిజముంటే ఉండొచ్చు. 

తృణమూల్‌లో పెనుతుపాను రేపుతున్న ఈ పరిణామం చివరికెలా ముగుస్తుందన్న సంగతలా ఉంచితే మన దేశంలో రాజకీయ వ్యవస్థ, దాంతోపాటు ఇతర వ్యవస్థలూ భ్రష్టుపట్టాయన్నది కాదనలేని సత్యం. అవినీతిని అరికట్టడానికి, వ్యవస్థలను ప్రక్షాళన చేయడానికి ఉద్దేశించిన విభా గాల పనితీరు కూడా అంతంతమాత్రమే. చివరికిది వేరుపురుగులా ప్రజాస్వామ్యాన్ని సమూలంగా ధ్వంసం చేస్తుందన్న భయాందోళనలు చాలామందిలో ఉన్నాయి. తర్వాత ఏం చెప్పినా, ఏం చేసినా... అవినీతి విషయంలో సొంత పార్టీలో కనబడుతున్న ధోరణులను ఇలా బాహాటంగా ప్రస్తా వించడం ద్వారా మమత ఒక మంచిపని చేశారు. రాజకీయ అవినీతిపై ఒక పెద్ద చర్చకు తెరలే పారు. ఆమె ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిలా ‘ఎందుకు ఓడిపోయామో తెలియట్లేదు...’ అంటూ నంగనాచితనాన్ని ప్రదర్శించలేదు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు గ్రామస్థాయి వరకూ ఆధిపత్యం చలాయిస్తూ, సాధారణ ప్రజానీకా నికి అందాల్సిన సంక్షేమ పథకాలను నియంత్రిస్తున్నారని, వాటిని తమ ఎదుగుదలకు నిచ్చెనగా వాడుకుంటున్నారని చాన్నాళ్లుగా ఆరోపణలొస్తున్నాయి. ఏ పని జరగాలన్నా డబ్బు విదల్చవలసి వస్తున్నదని, అదేమని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని సాధారణ ప్రజానీకం వాపో యిన సందర్భాలున్నాయి. ఆత్మహత్య చేసుకున్న నాయకుడు ‘ఈమధ్యే మా పార్టీలోకి వచ్చాడ’ని, ‘అతడెవరో తెలియద’ని తృణమూల్‌ నేతలు ఇప్పుడంటున్నా... అతగాడికి పెద్ద పెద్ద నేతలు తెలు సని, ఉద్యోగం కోసం ఆ నాయకుడికి లక్షన్నర సమర్పించుకున్నానని, గట్టిగా అడిగితే ఇద్దరు మహి ళలతో తనపై అత్యాచారం కేసులు పెట్టించాడని ఒక యువకుడు చెబుతున్నాడు. పరిస్థితి ఇంతగా దిగజారింది కనుకే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో తృణమూల్‌ బాగా దెబ్బ తింది. అయితే అవినీతి అంటూ జరిగితే అది గ్రామీణ ప్రాంతాల్లోని ఛోటా నేతలకే పరిమితం కాదు. పైవరకూ పంపకాలుండనిదే ఇదంతా ఇంతగా వేళ్లూనుకోదు. అందుకు బాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న అవినీతే తిరుగులేని ఉదాహరణ. గ్రామాల్లోని జన్మభూమి కమి టీలు మొదలుకొని ఉన్నతస్థాయి నేతల వరకూ అవినీతి ఎంతగా పెనవేసుకుపోయిందో అందరికీ స్పష్టమైంది. ‘వేరే పార్టీవారికి పనులు చేసేది లేద’ని సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే ప్రకటిస్తే ఇక అట్టడుగు స్థాయిలో పనిచేసే కార్యకర్తల్ని నియంత్రించేదెవరు? 

ఇప్పుడు మమత ప్రకటనను ఆసరా చేసుకుని ఆ పార్టీలో సంక్షోభాన్ని సృష్టించి దాన్ని బల హీనపర్చాలనుకునే పార్టీలకు ఆ రాష్ట్రంలో కొదవలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ను మట్టికరిపించి అక్కడ అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. కానీ అంతకంటే ప్రధానంగా ప్రతి పార్టీలోనూ అవినీతి గురించి అంతర్మథనం జరిగితే ప్రజలకు ఎంతో కొంత మేలు కలుగుతుంది. ఎదుటి పార్టీకి చెందినవారిపై ఎలాంటి అవినీతి ఆరోపణలున్నా జంకూ గొంకూ లేకుండా చేర్చుకోవడం, కింది స్థాయిలో ఏం జరుగుతున్నా పట్టనట్టు వ్యవహరించడం, అంతా సవ్యంగా ఉన్నదని దబాయించడం వంటి ధోరణులకు పార్టీలు స్వస్తి చెప్పడం అవసరం. ఎవరే మనుకుంటే మనకేమిటని భావిస్తే పార్టీలకు మాత్రమే కాదు... మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు కలుగుతుంది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top