ప్రియాంక రంగప్రవేశం

Priyanka Gandhi Enter Into Politics - Sakshi

తమతో మాటమాత్రమైనా చెప్పకుండా...తమను అసలు పరిగణనలోకే తీసుకోకుండా సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్‌పీ)–బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ)లు కూటమిగా ఏర్పడటాన్ని చూసి డీలా పడిన కాంగ్రెస్‌ శ్రేణులకు బుధవారం తీపి కబురు అందింది. వారంతా ఏనాటినుంచో కోరు కుంటున్నట్టు రాహుల్‌గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్‌ తూర్పు ప్రాంత కాంగ్రెస్‌ విభాగానికి ఆమెను ప్రధాన కార్యదర్శిగా నియమించినట్టు కాంగ్రెస్‌ ప్రకటించింది. రాహుల్, ప్రియాంకలకు ఒక విషయంలో పోలిక ఉంది. రాహుల్‌ ఎంపీగా గెలిచినా వీలు కుదిరినప్పుడల్లా రాజకీయాలపట్ల అనాసక్తత కనబరిచేవారు. విపక్షంలో కూర్చో వడం మొదలుపెట్టాకే ఆయనలో మార్పువచ్చింది. ప్రియాంక ధోరణి సైతం అదే. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఎట్టకేలకు ఆమె కూడా మారారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏను ఎలాగైనా మట్టికరిపించి మళ్లీ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని రాహుల్‌ విశ్వప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన ప్రసంగాల తీరు మునుపటితో పోలిస్తే మెరుగైంది. మొన్న అయిదు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు చేతికి అందిరావడం ఆయన  ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో లెక్క తప్పింది. తెలుగుదేశంతో కూటమి కట్టి బోర్లాపడ్డారు. మూడు రాష్ట్రాల్లో గెలుపు దాదాపుగా అందరూ ఊహించిందే. రాజస్తాన్‌లో అయిదేళ్లకోసారి పాలకులను మార్చడం రివాజు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ గఢ్‌లలో మూడు దఫాలుగా అధికారం చలాయిస్తున్న బీజేపీపై ఓటరుకు అసంతృప్తి ఏర్పడింది. అదే కారణంతో మిజోరంలో కాంగ్రెస్‌ ఓటమి చవిచూసింది. దానిపైనా పెద్దగా దిగుల్లేదు. ఏతా వాతా తెలంగాణలో అధికారం రాకపోవడం సంగతలా ఉంచి, ఈ స్థాయి పరాభవం సంభ వించడమే దానికి మింగుడు పడకుండా ఉంది. తెలంగాణలో మంచి ఫలితాలు వచ్చి ఉంటే ఉత్తర ప్రదేశ్‌లో ఎస్‌పీ, బీఎస్‌పీలు కాంగ్రెస్‌ను ఇంతగా తీసిపారేసేవి కాదు.  ఆ రెండు పార్టీలూ చెరో 38 స్థానాలూ పంచుకుని, మిగిలిన నాలుగులో రెండింటిని కాంగ్రెస్‌కు, మరో రెండింటిని రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్‌డీ)కి ఇస్తున్నట్టు ఏకపక్షంగా ప్రకటించాయి.

పౌరుషానికి పోయి ‘మీ దయా దాక్షిణ్యాలు మాకు అవసరం లేద’ని చెప్పే ధైర్యాన్ని కూడా కాంగ్రెస్‌ ప్రదర్శిం చలేకపోయింది. వారి నిర్ణయాన్ని గౌరవిస్తామని మాత్రమే రాహుల్‌ ప్రకటించారు. ఒకపక్క కేంద్రంలో మరోసారి అధికార పగ్గాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిస్తూ, మరోపక్క డీఎంకే వంటి మిత్ర పక్షాల ద్వారా ఆ సంగతిని బాహాటంగా చాటిస్తున్న పార్టీకి సహజంగానే ఈ పరిస్థితి మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో ప్రియాంక రంగ ప్రవేశం పార్టీ శ్రేణుల్లో ఎంతో కొంత ఉత్సాహాన్ని తీసుకొస్తుందనటంలో సందేహం లేదు. తాము నిరాసక్తంగా, నిస్తేజంగా ఉండబోమని... పార్టీకి జవజీవాలు కల్పించడానికి రానున్న సార్వత్రిక ఎన్నికలను వినియోగించుకుంటామని ఈ చర్య ద్వారా కాంగ్రెస్‌ చెప్పినట్టయింది. ఆమె రాకతో యువత, మహిళలు తమకు చేరువ కాగలరని పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు.

నిజానికి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ దాదాపు కనుమరుగైంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అది ఏడంటే ఏడు స్థానాలు మాత్రమే గెల్చుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 42 శాతం ఓట్లు లభిస్తే, ఎస్‌పీ–బీఎస్‌పీలు రెండూ 41శాతం వరకూ తెచ్చుకున్నాయి. కాంగ్రెస్‌కు లభించిన ఓట్లు 7.5శాతం మాత్రమే. 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంచుమించు ఇదే స్థితి. బీజేపీకి 39.47శాతం ఓట్లు రాగా, ఎస్‌పీ, బీఎస్‌పీలకు 44.2శాతం గెల్చుకున్నాయి. కాంగ్రెస్‌కు దక్కిన ఓట్ల శాతం 6.2 మాత్రమే.  ఆ పార్టీకి ఒకప్పుడు వెన్నుదన్నుగా ఉన్న ముస్లింలు చెల్లాచెదురు కావడం, ఓబీసీలు, దళితుల్లో అత్యధికులు ఎస్‌పీ, బీఎస్‌పీలవైపు మొగ్గు చూపడం, ఆధిపత్య కులాలు బీజేపీని నమ్ముకోవడం వంటి పరిణామాలే ఇందుకు కారణం. ఈ పరిస్థితిని ప్రియాంక ఏమేరకు మార్చ గలరన్నదే ప్రశ్న. గత కొన్ని నెలలుగా రాహుల్‌గాంధీ తనకు తోచిన రీతిలో మార్పు తీసుకురావ డానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. తాను మొదణ్ణించీ శివభక్తుడినని ఆయన చాటుకున్నారు.

తన కుల గోత్రాలు గుర్తు చేశారు. దేవాలయాలు సందర్శించారు. కానీ ఆ చర్యలు పార్టీకి పెద్దగా ఉప యోగపడిన దాఖలాలు లేవు. సరికదా ఎస్‌పీ, బీఎస్‌పీలు తమతో చేర్చుకోక పోవడం వల్ల పరిస్థితి మరింత క్షీణించింది. తూర్పు యూపీ బీజేపీకి కంచుకోట. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతి నిధ్యంవహిస్తున్న వారణాసి ఆ ప్రాంతంలోనిదే. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా అక్కడివారే. ఆ ప్రాంతంలో పార్టీని పటిష్టం చేయడంలో ప్రియాంక తోడ్పడితే ఆ మేరకు బీజేపీకి నష్టం కలుగుతుంది. బ్రాహ్మణ–దళిత–ముస్లిం ఫార్ములాను మళ్లీ ప్రయోగించగలిగితే... ఆధిపత్య కులాల్లో మోదీపై ఉన్న అసంతృప్తిని వినియోగించుకోగలిగితే అది సాధ్యమేనని కాంగ్రెస్‌ లెక్కలు వేసుకుంటోంది. ఇదంతా ప్రియాంక వల్ల సాధ్యమవుతుందని విశ్వసిస్తోంది. అయితే ఈ క్రమంలో ఎస్‌పీ–బీఎస్‌పీ ఓటు బ్యాంకును కాంగ్రెస్‌ చీల్చవచ్చునని, అంతిమంగా అది బీజేపీకే లాభిస్తుం దన్న అంచనాలూ ఉన్నాయి. 

ప్రియాంక రాజకీయ రంగప్రవేశం చేయడం నిజానికి లాంఛనప్రాయమే. ఆమె ఈ రంగానికి ఎప్పుడూ దూరంగా లేరు. తన తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలి, సోదరుడు ప్రాతి నిధ్యంవహిస్తున్న అమేథీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఆమెకు అలవాటే. ఆమె మాట తీరు, వ్యవహారశైలి ఇందిరాగాంధీని గుర్తుకుతెస్తున్నాయని ఆ రెండుచోట్లా చాలామంది అనుకునే మాట. ప్రియాంక రూపంలో తాజాగా తలెత్తిన సవాలును బీజేపీ తేలిగ్గా తీసుకోదు. కనుక 2019 సార్వత్రిక ఎన్నికలు అనుకున్నకంటే మరింత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఆ సంగతలా ఉంచి ఆమె రంగప్రవేశం కాంగ్రెస్‌ పార్టీకి ఏమేరకు జవసత్వాలిస్తుందో వేచిచూడాలి.
 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top