గల్ఫ్‌ సమస్యలు పట్టవా?

గల్ఫ్‌ సమస్యలు పట్టవా? - Sakshi


చదువుకునేందుకు లేదా ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన, అక్కడే స్థిరపడిన భారతీయుల సమస్యల్ని చర్చించే వేదికగా ఉంటూ వస్తున్న ప్రవాసీ భారతీయ దివస్‌ ఉత్సవాలు బెంగళూరులో మూడు రోజులు కొనసాగి సోమవారం ముగిశాయి. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో విస్తృ తంగా పర్యటించడమే కాదు... ఆయా దేశాల్లో భారతీయులనుద్దేశించి ప్రసంగిం చారు. అందువల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం సులభమవుతుం దని అక్కడివారు విశ్వసించారు. ఇంతక్రితం జరిగిన సమావేశాల్లో అందుకు సంబం ధించి అనేక నిర్ణయాలు ప్రకటించారు. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదని ఈ సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలు చూస్తే అర్ధమవుతుంది. ఇతర సమస్యల మాట అటుంచి దేశ ప్రజానీకాన్ని ఇప్పటికీ ఇబ్బందులకు గురిచేస్తున్న పెద్ద నోట్ల రద్దు సమస్య ప్రవాసులను కూడా తాకింది.



నిర్ణయానికి ముందు ఎలాంటి సమ స్యలు తలెత్తగలవో అంచనా వేయలేని రిజర్వ్‌బ్యాంక్‌ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గదర్శకాలు జారీ చేయడం... అలా వెలువరించిన మార్గదర్శకాలపై నిరసనలు తలెత్తేసరికి వాటిని సవరిస్తూ మళ్లీ కొత్త కొత్తవి ప్రకటించడం రివాజుగా మారింది. కానీ వేర్వేరు దేశాల్లో ఉంటున్న ప్రవాసులకు ఈ నోట్ల రద్దు అదనపు సమస్యలను సృష్టించింది. కానీ యథాప్రకారం రిజర్వ్‌బ్యాంక్‌ ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకో కుండా అందరితోపాటు వారికి కూడా వచ్చే మార్చి 31లోగా మార్చుకోవాలంటూ తుది గడువు విధించింది. సాధారణంగా ప్రవాసుల వద్ద భారీయెత్తున పాత నోట్లు ఉండే అవకాశం లేదు. కానీ స్వదేశానికొచ్చినప్పుడు విమానాశ్రయంలో దిగిన దగ్గర్నుంచి గమ్య స్థానానికి చేరేవరకూ వివిధ అవసరాలకు ఉపయోగపడతాయని కొద్దో గొప్పో మొత్తాన్ని వారు దగ్గరుంచుకుంటారు.



అలా దాచుకున్న నోట్లకు కూడా మార్చి 31 గడువే విధిస్తే వారికి సమస్యలు ఎదురవుతాయి. ఉన్న కొద్దిపాటి మొత్తం మార్చుకోవడానికి ఇక్కడకు రావడం ఎన్నో వ్యయప్రయాసలతో కూడు కున్నది. విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తుండవచ్చు... ఉద్యోగులకు సెలవు దొరక్క పోవచ్చు... అలాంటి వెసులుబాట్లున్నా భారీ మొత్తం ఖర్చు పెట్టాల్సిరావడం ఇబ్బంది కావచ్చు. కనుక ఆయా దేశాల్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు అక్కడి దౌత్య కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటుచేసి అలా మార్చుకునే సదుపాయం కల్పిస్తే వేరుగా ఉండేది. ఇక్కడున్నవారి సమస్యలనే సక్రమంగా అంచనా వేసి అందుకు అనుగుణమైన ఏర్పాట్లు చేయలేకపోయిన రిజర్వ్‌బ్యాంక్‌కు అలాంటి ఆలోచన రాకపోవడంలో వింతేమీ లేదు. కనీసం ఈ ప్రవాసీ భారతీయ దివస్‌లో చాలామంది దీన్ని లేవనెత్తారు గనుక దీన్ని సరిదిద్దడంపై దృష్టి పెట్టాలి.



 ఇక గల్ఫ్‌ దేశాల్లో ఉంటున్న ప్రవాసుల సమస్యలు ప్రత్యేకమైనవి. ఇతర దేశాలకు వెళ్లేవారిలో అత్యధికులు చదువు కోసం లేదా తమ విద్యార్హతలకు తగిన ఉద్యోగం దొరుకుతుందని ఆశించి వెళ్తారు. కానీ గల్ఫ్‌ దేశాలకు చాలామంది ఇంటి పనులు, వంట పనులు చేసేందుకు, డ్రైవింగ్‌లాంటి వృత్తులు చేపట్టేందుకు వెళ్తుం టారు. సహజంగానే వారిలో చాలామందికి చదువుసంధ్యలు తక్కువగా ఉంటాయి. దాన్ని ఆసరా చేసుకుని ఏజెంట్లు మొదలుకొని అనేకులు మోసగిస్తుంటారు. ఇక అక్కడి యజమానుల దాష్టీకాలకు అంతే లేదు. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న భారతీయులు దాదాపు 2 కోట్ల 20 లక్షలమంది. దాదాపు 6,000మంది భారతీయులు వివిధ దేశాల జైళ్లలో ఉంటే అందులో సౌదీ అరేబియా జైళ్లలోనే 1,500మంది, ఇతర గల్ఫ్‌ దేశాల్లో మరో 3,000మంది మగ్గుతున్నారు. ప్రవాసభారతీయులంటే అత్యుత్సా హాన్ని ప్రదర్శించే మన ప్రభుత్వాలు గల్ఫ్‌లో ఉంటున్నవారిని నిర్లక్ష్యం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ ప్రవాస భారతీయ దివస్‌ ఉత్సవాల సందర్భంగా తమ సమస్యలపై ప్రధానంగా చర్చించడానికి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గల్ఫ్‌లో ఉంటున్న ప్రవాస భారతీయులు కోరారు. కానీ నిర్వాహకులు ఆ పని చేయలేదు.  



గల్ఫ్‌ దేశాలకెళ్లిన భారతీయులు తమ కుటుంబాలకు ఏటా పంపుతున్న సొమ్ము తక్కువేమీ కాదు. అది 2 కోట్ల పైమాటే. కానీ అందుకు ప్రతిఫలంగా వారి బాగోగుల గురించి ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదు. గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి మునుపటిలా లేదు. ముడి చమురు ధరలు ఆమధ్య బాగా పడిపోవడం వల్ల ఆ దేశాలు ఆర్ధికంగా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. పలు కంపెనీలు మూత బడ్డాయి.  అది వలసకారులపై ప్రభావం చూపుతోంది. అక్కడ నివాసానికి సంబం ధించిన నిబంధనలు కఠినతరమయ్యాయి. ఇక్కడ మన చట్టాలు సాధారణ నేరా లుగా పరిగణించేవాటికి సైతం అక్కడ కఠిన శిక్షలుంటాయి.



ఇక సాంస్కృతిక పరమైన ఇబ్బందులు సరేసరి. అలాగే తిరిగి రాదల్చుకున్నవారి పునరావాసానికి ప్రభుత్వపరంగా లభించే సాయం తదితర అంశాల్లో అవగాహన కల్పించేం దుకు ప్రవాస భారతీయ దివస్‌లాంటి వేదికలు ఎంతగానో తోడ్పడతాయి. ఆపత్సమయాల్లో గల్ఫ్‌ దేశాల్లోని మన దౌత్య కార్యాలయాల ద్వారా ఎలాంటి సాయం పొందవచ్చునో, అందుకు సంబంధించి చేసిన ఏర్పాట్లేమిటో తెలి యజెబితే ఈ సదస్సుకు వచ్చినవారు ఆయా దేశాల్లో బాధితులకు అండదండ లందిస్తారు. అలాగే వేర్వేరు దేశాల్లో దౌత్య కార్యాలయాల్లో ప్రవాస భారతీయులకు సంబంధించిన విషయాలను చూసేవారు కూడా హాజరైతే అది వారి పనితీరు మెరుగుదలకు దోహదపడుతుంది.


బాధితులకు వెనువెంటనే సాయం అందడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ విషయంలో తగిన కృషి జరగలేదు. ప్రవాస భారతీయులు కన్నతల్లి లాంటి దేశానికి సేవలందించాలని, తాము ప్రారంభించిన స్వచ్ఛ్‌ భారత్, డిజిటల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, నమామి గంగే వంటి పథకాలకు చేయూతనివ్వాలని ప్రధాని పిలుపునిచ్చారు. పెట్టుబడులకు కూడా ఆహ్వానించారు. మంచిదే. కానీ వాటితోపాటు బాధాసర్పద్రష్టుల్లా మిగిలిపోయిన వారి సమస్యలపైనా దృష్టి పెట్టాలి. వారికి, వారి కుటుంబాలకు మనో ధైర్యమివ్వాలి. అప్పుడే ప్రవాస భారతీయ దివస్‌లాంటి వేదికలు సార్ధక మవుతాయి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top