అనిశ్చితిలో జర్మనీ

political uncertainty in Germany - Sakshi

సాధారణ ఎన్నికలు జరిగి రెండు నెలలు దాటకుండానే జర్మనీ రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. తన నేతృత్వంలోని క్రిస్టియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ(సీడీ యూ)కి ఆ ఎన్నికల్లో తగినంత మెజారిటీ రాకపోవడంతో సిద్ధాంత సారూప్యత లేని పార్టీలతోనైనా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఆశించారు. అది ఫలించే అవకాశం లేదని తాజా పరిణామాలు చాటు తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కోసం జరుగుతున్న చర్చల నుంచి ఫ్రీ డెమొక్రటిక్‌ పార్టీ(ఎఫ్‌డీపీ) తప్పుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మరో మూడు వారాలపాటు ఈ అనిశ్చితి కొనసాగితే మరోసారి ఎన్నికలు తప్పకపోవచ్చు. జర్మ నీలో ఇప్పుడున్న ప్రతిష్టంభన మెర్కెల్‌కూ, ఆ దేశానికే కాదు... మొత్తం యూరప్‌ ఖండానికే వణుకు పుట్టిస్తోంది. ఈ సంక్షోభం నుంచి అది గట్టెక్కాలని, సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని యూరప్‌లోని అన్ని దేశాలూ కోరుకుంటున్నాయి. దేశం గడ్డు స్థితిలో ఉన్నప్పుడు పన్నెండేళ్లక్రితం మెర్కెల్‌ అధికార పగ్గాలు చేపట్టారు. అప్పటినుంచీ ఒక క్రమపద్ధతిలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్న పేరు తెచ్చుకున్నారు. యూరప్‌లో దేశాన్ని నంబర్‌ వన్‌గా నిలబెట్టారు. వివిధ ఎన్నికల్లో వరస విజయాలు సాధిస్తూ వచ్చారు. అయితే రెండేళ్లక్రితం ఇరాక్, సిరియా, అఫ్ఘానిస్తాన్‌ల నుంచి వచ్చిపడిన వలసలతో ఆమెకు దేశంలో అంతవరకూ ఉన్న మద్దతు కొడిగట్టడం ప్రారంభమైంది. మరోపక్క జర్మనీతోపాటు వివిధ యూరప్‌ దేశాల్లో ఉగ్రవాద దాడులు జరగడంతో ఆమెకు ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ(ఏఎఫ్‌డీ) వంటి మితవాద, జాతీయవాద పక్షాల నుంచి సవాళ్లు బయల్దేరాయి. మెర్కెల్‌ సార థ్యంలో దేశం ఆర్ధికంగా అగ్రగామిగా ఉన్నా వలసలపై జర్మనీ పౌరుల్లో ఒకపక్క ఆగ్రహమూ, మరోపక్క భయమూ ఏర్పడ్డాయి. ఇదంతా చూసి సంకీర్ణంలోని ఎస్‌పీడీ విడిగా పోటీ చేయడమే మేలనుకుంది.

మొన్న జరిగిన ఎన్నికల్లో వెలువడ్డ ఫలితాలు మెర్కెల్‌ ఆశించినవి కాదు. మెర్కెల్‌ విధానాలపై పౌరుల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా ఆమెకు దీటైన ప్రత్యా మ్నాయం లేదని ఎక్కువమంది భావిస్తున్నారు గనుక సీడీయూకు 37 శాతం పైగా ఓట్లు లభించగలవని వివిధ సర్వేలు అంచనా వేశాయి. తీరా అది 32.9 శాతం వద్దే ఆగిపోయింది. ఇది గత ఎన్నికలకన్నా 8.6 శాతం తక్కువ. ఆమెతో తలపడిన ఎస్‌పీడీకి 20.5 శాతం ఓట్లు వచ్చాయి. తాము ముందు చెప్పిన మాటకు కట్టుబడి సంకీర్ణంలో చేరదల్చుకోలేదని ఎన్నికల అనంతరం మరోసారి ఎస్‌పీడీ చెప్పడంతో విధి లేని స్థితిలో ఆమె 10.7 శాతం ఓట్లు తెచ్చుకున్న ఎఫ్‌డీపీతోనూ, 8.9 శాతం ఓట్లు తెచ్చుకున్న గ్రీన్స్‌తోనూ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్చలు ప్రారంభిం చారు. అయితే యూరప్‌ యూనియన్‌(ఈయూ)తో సంబంధాలు మొదలుకొని వలసల వరకూ అనేక అంశాల్లో సీడీయూతో అసలే పొసగని ఎఫ్‌డీపీ చివరకు రెండురోజుల క్రితం చర్చల నుంచి తప్పుకుంది. తమ ప్రతిపాదనలకు మెర్కెల్‌ అంగీకరించకపోవడంతో ప్రభుత్వంలో చేరడం లేదని ప్రకటించింది. ‘ఆర్ధిక క్రమ శిక్షణ’ పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తూ దివాలా బాటలో పోతున్న గ్రీస్‌ వంటి దేశాలను ఈయూలో కొనసాగించవద్దని ఎఫ్‌డీపీ పట్టుబడుతోంది. ఆ దేశాల విధానాల వల్ల జర్మనీ ఎందుకు దెబ్బతినాలన్నది ఆ పార్టీ ప్రశ్న. అయితే తగిన నియంత్రణలతో వాటిని దారికి తీసుకురావాలి తప్ప బయటకు నెట్టేస్తే అది మొత్తం యూరప్‌పై ప్రభావాన్ని చూపుతుందని, అంతిమంగా జర్మనీ సైతం నష్టపోవాల్సి వస్తుందని మెర్కెల్‌ వాదన. వలసల విషయంలోనూ ఆమెది భిన్నమైన దారి. చట్ట విరుద్ధమైన వలసలను అరికట్టడానికి అమల్లోకి తెచ్చిన కఠినమైన చట్టాలను ఇప్ప టికే అమలు చేస్తున్నాం గనుక అంతకుమించి ఆ విషయంలో చర్యలు అవసరం లేదని మెర్కెల్‌ అభిప్రాయం. అటు పర్యావరణ సమస్యల విషయంలో గ్రీన్స్‌ పార్టీతో కూడా సీడీయూకు విభేదాలున్నాయి.

మరోసారి దేశంలో ఎన్నికలు తప్పనిసరైతే రాజకీయంగా మెర్కెల్‌కు అది తీరని నష్టం కలిగిస్తుంది. పార్టీ నాయకురాలిగా ఆమెను కొనసాగించే విషయంలో సీడీయూ పునరాలోచనలో పడినా పడొచ్చు. ఇప్పటికైతే పార్టీలో ఆమెకు దీటైన నాయకులెవరూ లేరు. మరోసారి ఎన్నికలొస్తే జర్మనీ తీరుతెన్నులెలా ఉంటా యన్నది ఎవరూ చెప్పే స్థితి లేదు. ఎవరూ ఊహించని రీతిలో మొన్న ఎన్నికల్లో 12.6 శాతం ఓట్లు తెచ్చుకున్న తీవ్ర మితవాద పక్షం ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ (ఏఎఫ్‌డీ) మరింత బలపడితే అది జర్మనీ భవిష్యత్తును మాత్రమే కాదు...ఈయూ రూపురేఖల్ని కూడా మార్చేస్తుంది.  యూరప్‌ ఇప్పటికే సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నది. 2009 చివరిలో చుట్టుముట్టిన రుణ సంక్షోభం నుంచి అది ఇప్పటికీ అది పూర్తిగా బయట పడలేదు. గ్రీస్, పోర్చుగల్, ఐర్లాండ్, స్పెయిన్, సైప్రస్‌లు ఆర్ధికంగా ఇంకా అంతంతమాత్రంగానే ఉన్నాయి. అలాగే యూరప్‌ భద్రత, వలసలు, రష్యా దూకుడు, బ్రెగ్జిట్‌ వగైరా అంశాలు యూరప్‌ను కుదిపేస్తున్నాయి. ఎలాంటి సంక్షోభాన్నయినా ఎదుర్కొనడానికి ముందుకొస్తూ సమర్ధ నాయకత్వాన్ని అంది స్తున్న జర్మనీ ఇప్పుడు తానే అనిశ్చితిలో పడితే అది ఈయూను అయోమయంలోకి నెడుతుంది. జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్‌ స్టీన్‌మియర్‌ సంక్షోభ నివారణకు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. మెర్కెల్‌ కూడా తన పాత మిత్ర పక్షం ఎఫ్‌డీపీతో, గ్రీన్స్‌ పార్టీతో చర్చిస్తున్నారు. అయితే సిద్ధాంతపరంగా, విధానాల పరంగా పరస్పరం పొసగని ఈ పార్టీలు ఏర్పాటుచేసే ప్రభుత్వాలు ఎంతకాలం మనుగడ సాగించగలవు? అటు రష్యా ఉక్రెయిన్‌పై దాడిచేసి క్రిమియాను ఆక్ర మించినప్పుడుగానీ, ఇటు వలసల విషయంలో టర్కీతో సమస్య ఏర్పడిన ప్పుడుగానీ ఎంతో చాకచక్యంతో, నిర్ణయాత్మకంగా వ్యవహరించి పెనుముప్పును నివారించిన మెర్కెల్‌ ఈ మాదిరి ప్రభుత్వాల్లో అంత సమర్ధతను చూప గలు గుతారా? యూరప్‌ను ఇప్పుడు ఇలాంటి సందేహాలు ఆవహించాయి. ప్రస్తుత రాజకీయ సంక్షోభం నుంచి జర్మనీ ఎలా గట్టెక్కుతుందన్నది రాగల రోజుల్లో తేలుతుంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top