ఇమ్రాన్‌ రాజ్యం!

Pakistan PM Imran Khan Relations With India - Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌ దిగ్గజం ఇమ్రాన్‌ఖాన్‌ శనివారం ఆ దేశ ప్రధానిగా కొలువుదీరారు. ఆయన పార్టీ పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఏ–ఇన్సాఫ్‌(పీటీఐ) అత్యధిక స్థానాలు గెల్చుకున్నట్టు ప్రకటించగానే ఆయన భారత్‌ను ఉద్దేశించి ‘మీరు ఒక అడుగు ముందుకేస్తే, మేం రెండడుగులు ముందుకేస్తామ’ని చెప్పారు. దానికి కొనసాగింపుగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాక్‌ జైళ్లలో మగ్గు తున్న భారత్‌ ఖైదీలు 30మందిని విడుదల చేశారు. మన దేశం కూడా ఏడుగురు పాకిస్తానీ పౌరులకు చెర నుంచి విముక్తి కలిగించింది. ‘మంచి ఇరుగు పొరుగుగా ఉందామని, అర్ధవంతమైన, నిర్మాణాత్మకమైన చర్చలు కొనసాగిస్తూ ఉగ్రవాదం లేని దక్షిణాసియా ఏర్పడటానికి కృషి చేద్దామని ప్రధాని నరేంద్ర మోదీ ఇమ్రాన్‌కు రాసిన లేఖలో పిలుపునిచ్చారు.

పాక్‌ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన షా మహ్ముద్‌ ఖురేషీ కూడా ఇటువంటి సంకల్పాన్నే వ్యక్తపరిచారు. అయితే ఇమ్రాన్‌ కేబినెట్‌లోని 21మందిలో ఖురేషీ, మరో 11మంది గతంలో సైనిక పాలకుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ మంత్రివర్గంలో పనిచేసినవారేనని తెలిసినప్పుడు కొంత నిరాశ కలుగుతుంది. ఇమ్రాన్‌ ఖాన్‌ను ప్రధాని చేయడమే సైన్యం ధ్యేయమని ఎన్నికలకు ముందే కథనాలు వెలువడినా, మరీ ఈ స్థాయిలో ముషార్రఫ్‌ అనుచరులతో కేబినెట్‌ నిండిందంటే ప్రభుత్వంపై మున్ముందు దాని పట్టు ఎంతగా ఉండబోతున్నదో స్పష్టంగా అర్ధమవుతుంది. అయితే ఇమ్రాన్‌ ఆశించిన ‘వినూత్న పాకిస్తాన్‌’ సాధ్యం కావాలంటే ఆ దేశంలో ప్రశాంతత నెలకొనాలి. మనతో సుహృద్భావ వాతావరణం ఉండాలి. దేశ ఆర్థిక వ్యవస్థ చక్కబడాలి. పరిశ్రమలు పెరిగి యువతకు ఉపాధి లభించాలి. ఈ దిశగా తీసుకునే చర్యలే ఇమ్రాన్‌ రాజకీయ భవిత వ్యాన్ని నిర్ణయిస్తాయి.

అత్యంత కీలకమైన విదేశాంగ శాఖతోపాటు రక్షణ, ఆంతరంగిక భద్రత శాఖలు సైన్యం అనుకూలుర చేతుల్లో ఉన్నాయి. ఇమ్రాన్‌ వీటి జోలికి రానంతవరకూ సైన్యంతో ఆయనకు ఎలాంటి పేచీలూ ఉండవు. అలాగే ఈ శాఖలకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ఇద్దరి అభిప్రాయాలూ ఒకటే అయినా సమస్యలుండవు. ఆయన అయిదేళ్ల పూర్తి కాలం దేశాన్ని పాలించిన ప్రధానిగా రికార్డులకెక్కుతారు. అయితే దేశ ఆర్థిక పరిస్థితి ఏమంత సవ్యంగా లేదు. అది పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. గడిచిన డిసెంబర్‌ నుంచి ఇంతవరకూ పాకిస్తాన్‌ స్టేట్‌ బ్యాంక్‌(పీఎస్‌బీ) రూపాయి విలువను నాలుగుసార్లు తగ్గించాల్సి వచ్చింది. వృద్ధి రేటు దరిదాపు ఆరు శాతం. కరెంట్‌ అకౌంట్‌ లోటు తీవ్రంగా భయపెడుతోంది. ద్రవ్య లోటు స్థూల దేశీయో త్పత్తిలో 6.8 శాతం ఉంది. దీన్ని 5 శాతానికి తీసుకొస్తే తప్ప ఆర్థిక వ్యవస్థ పుంజుకోదని ఒకపక్క ఆర్థిక నిపుణులు చెబుతుండగా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న ఇమ్రాన్‌ లక్ష్యం ఎలా నెరవేరుతుందన్నది అర్ధంకాని విషయం. ద్రవ్యలోటు తగ్గించుకోవాలంటే ఇప్పుడమలవుతున్న పథకాలనే కుదించక తప్పని స్థితి ఏర్పడుతుంది. బహుశా ఇప్పటికే ఇమ్రాన్‌కు వాస్తవ పరిస్థితులు అర్థమై ఉండాలి. అందుకే ఆర్థిక రంగానికి సంబంధించి కఠిన నిర్ణయాలు తప్పకపోవచ్చునని ఆయన హెచ్చరించారు. పన్ను సంస్కరణలు, పొదుపు చర్యలు, అవినీతిని అంతమొందించటం, విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బును వెనక్కి తీసుకురావటం వగైరా చర్యలు తీసుకుంటానని ఆయన చెబుతున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై, ముఖ్యంగా చైనా ఆపన్న హస్తంపై ఇమ్రాన్‌కు బాగా ఆశలున్నట్టు కనబడుతోంది.

ఆయన విజయోత్సవ ప్రకటనలో చైనాకే అధిక ప్రాధాన్య మిచ్చారు. అయితే పరస్పరం పోటీలు పడి సుంకాలు విధించుకుంటూ, ఆంక్షలు అమలు చేస్తూ వివిధ దేశాలు వాణిజ్య యుద్ధాలకు దిగుతున్న ప్రస్తుత వాతావరణంలో అదేమంత సులభం కాదు. పైగా పాకిస్తాన్‌లో మత ఛాందసవాదులు, ఉగ్రవాద బృందాలు తరచు సృష్టించే ఉద్రిక్త పరిస్థితుల గురించి చెప్పనవసరమే లేదు. తాము ప్రశాంతంగా వ్యాపారం జరుపుకోవచ్చునని, పెట్టిన పెట్టు బడులకు ఖచ్చితంగా లాభాలొస్తాయని భావిస్తేనే ఏ దేశమైనా వేరే చోట పెట్టుబడులకు ఉత్సాహం చూపుతుంది. పాక్‌ సంపన్నుల్లో చాలామంది బయటి దేశాల్లో పెట్టుబడులు పెడుతూ లాభాలు గడిస్తుంటారు. వారిని ఆకర్షించడానికి అనువైన ఆర్థిక విధానాల రూపకల్పన ఇమ్రాన్‌కు పెద్ద సవాలు. చైనా–పాకిస్తాన్‌ ఆర్థిక కారిడార్‌(సీపీఈసీ) పనులు మొదలైతే తమకు మంచి అవకాశా లొస్తాయని వ్యాపారవేత్తలు మొదట్లో భావించినా అందులో చైనా సంస్థలకే సింహభాగం దక్కు తుందన్న అనుమానాలు వారికున్నాయి.

 ఇమ్రాన్‌ పార్టీ ఖైబర్‌ ఫక్తూన్‌ఖ్వా, పంజాబ్‌ రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసు కోవటంతోపాటు బలూచిస్తాన్‌లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిం«ద్‌లో ప్రతిపక్షంగా ఉంది. ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న కేబినెట్‌లో కూటమి పక్షాలకు ఆయన కీలకమైన పదవుల్ని ఇవ్వక తప్పలేదు. సొంత పార్టీ లుకలుకల సంగతి సరేసరి. ఇమ్రాన్‌ ఇప్పుడేం చెబుతున్నా అంతంతమాత్రం మెజారిటీతో ఆయన అద్భుతాలు సృష్టించటం అసాధ్యం. ఇమ్రాన్‌ ప్రమాణం రోజునే అధీన రేఖ(ఎల్‌ఓసీ) వద్ద కాల్పుల విరమణ ఉల్లంఘన చోటు చేసుకుంది. ఇందుకు కారణం మీరంటే మీరని భారత్, పాక్‌లు ఆరోపించుకున్నాయి. సరిహద్దుల్లో మెరుగైన సంబం ధాలు ఆశించడం దురాశేనని ఈ ఉదంతం చెబుతోంది. ఇమ్రాన్‌ ఆహ్వానంపై పాక్‌ వెళ్లిన పంజాబ్‌ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఆ దేశ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ జావేద్‌ బజ్వాను హత్తు కున్నాడని, పీఓకే ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నాడని కొందరు వృథా వివాదాలు రెచ్చ గొడుతున్నారు. ఆయనపై ఒకరైతే దేశద్రోహం కేసు కూడా పెట్టారు. ఇలాంటి ధోరణులు దేనికీ తోడ్పడవు. సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు నెలకొంటే భారత్, పాక్‌లు రెండూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయి. అందుకోసం చిత్తశుద్ధితో ప్రయత్నించటం, సంయమనం పాటించటం ఇరువైపులా అవసరం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top