పరిష్కారం దిశగా ‘పెండింగ్‌’

పరిష్కారం దిశగా ‘పెండింగ్‌’


న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌ పడటాన్ని గురించి మాత్రమే ఎప్పుడూ వింటున్నవారికి శుభవార్త... నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలో పదేళ్లకుమించి ఉన్న పెండింగ్‌ కేసుల్లో అత్యధిక భాగం పరిష్కార మయ్యాయి. మన దేశంలో పెండింగ్‌ కేసుల తీరుకు లండన్‌ కోర్టు తొమ్మిదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్య అద్దం పడుతుంది. 2008లో ముంబైపై జరిగిన ఉగ్రదాడిలో గాయపడిన బ్రిటష్‌ పౌరుడొకరు తాజ్‌ హోటల్‌ గ్రూప్‌ నుంచి నష్ట పరిహారం కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసినప్పుడు ఆ కోర్టు దాన్ని అనుమతిస్తూ భారత్‌ కోర్టుల్లో విచారణ కనీసం ఇరవైయ్యేళ్లు పడుతుందని వ్యాఖ్యానించింది. పెండింగ్‌ కేసులు నానాటికీ పెరగడంపై దేశంలో అందరిలోనూ ఆదుర్దా ఉంది. ఆ సమ స్యను పరిష్కరించాలన్న తపన కూడా ఉంది. కానీ అది అంతకంతకూ పెరుగు తున్నదే తప్ప తగ్గడం లేదు.  దేశవ్యాప్తంగా పదేళ్లకుమించి పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం దాదాపు 23 లక్షలు. ఇలాంటి సమయంలో కేరళ, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, చండీగఢ్‌ న్యాయస్థానాలు ఆశ పుట్టిస్తు న్నాయి. ఈ అయిదుచోట్లా కింది కోర్టుల్లో పదేళ్లకుమించి పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 11,000కు పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ తోవలోనే ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, అస్సాం, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల న్యాయస్థానాలు కూడా ఉన్నాయంటున్నారు.  



ఇప్పుడు మెరుగైన పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో ఏం జరిగిందో అధ్యయనం చేసి ఆచరిస్తే ఆ సమస్య ఉన్న ఇతర రాష్ట్రాల్లో కూడా అలాంటి ఫలితాలే రావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పంజాబ్, హర్యానా హైకోర్టు తన పరిధిలోని చండీగఢ్, పంజాబ్, హర్యానాల్లో ఒక  నిర్వహణా వ్యవస్థను రూపొందించింది. ఒక కేసు దాఖలైనప్పటినుంచి దాన్ని పరిష్కరించేవరకూ ప్రతి దశలోనూ పర్యవేక్షణ ఉండే ఈ వ్యవస్థ కేసుల స్వభావాన్నిబట్టి వాటిని వర్గీక రించింది. న్యాయాధికారులకు లక్ష్య నిర్దేశం చేసింది. వార్షిక లక్ష్యాలను ఇచ్చింది. పాత కేసుల పరిష్కారానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. త్రైమాసిక సమీక్షలు నిర్వహించింది. అదే సమయంలో లక్ష్య సాధన పేరుతో  కేసు లోతుపాతుల్లోకి పోకుండా హడావుడిగా తీర్పునిచ్చే ధోరణులు తలెత్తకుండా చూసింది. క్రిమినల్‌ కేసులకు సంబంధించినంతవరకూ నిందితులు రెండేళ్లకు మించి కస్టడీలో ఉన్న కేసులకు ప్రాధాన్యతనిచ్చారు. మాదకద్రవ్య కేసులపై శ్రద్ధ పెట్టారు. క్రియాశీలంగా వ్యవహరించి కింది కోర్టుల పనితీరును నిశితంగా పర్యవేక్షిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు వస్తాయో చెప్పడానికి పంజాబ్, హర్యానా హైకోర్టు సాధించిన విజయమే ఉదాహరణ.



న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో పడటానికి తగిన సంఖ్యలో న్యాయా ధికారుల నియామకం జరగకపోవడం ఒక కారణం. కానీ అదే ప్రధాన కారణం కాదు. పై కోర్టుల పర్యవేక్షణ ప్రభావవంతంగా లేకపోవడం, న్యాయమూర్తులకూ న్యాయవాదులకూ మధ్య తలెత్తే వివాదాలు, క్రిమినల్‌ కేసుల్లో పోలీసుల దర్యాప్తు తీరు నాసిరకంగా ఉండటం, కేసు విచారణలో న్యాయమూర్తులు తగినంత శ్రద్ధ కనబరచకపోవడం లాంటివి కూడా పెండింగ్‌ కేసులు కొండలా పెరిగిపోవడానికి కారణమవుతున్నాయి. నేరగాళ్లకు పలుకుబడి ఉన్న సందర్భాల్లో సైతం కేసులు పెండింగ్‌ పడుతుంటాయి. డేరా బాబా గుర్మీత్‌పై వచ్చిన కేసే దీనికి ఉదాహరణ. ఆ ఆశ్రమ మేనేజర్‌ అదృశ్యం కేసులో డేరా బాబాపై ఆరోపణలొచ్చినప్పుడు మొదట పోలీసులు కేసు నమోదు చేయడానికే ముందుకు రాలేదు. చివరకు 2009లో ఆ కేసును దర్యాప్తు చేయమని పంజాబ్‌ హర్యానా హైకోర్టు సీబీఐని ఆదేశించాక కదలిక వచ్చింది.



ఆ తర్వాత కూడా అది అనేక మలుపులు తిరిగింది. డేరా బాబాపై హత్య కేసు పెట్టాలని 2010 ఫిబ్రవరిలో సీబీఐ తేల్చింది. కానీ చిత్రంగా ఆ కేసు దర్యాప్తు అధికారిని వెంటనే బదిలీ చేసి మరొకరిని నియ మించారు. ఆ తర్వాత డేరా బాబాపై కేసు మూసేయాలని సీబీఐ సిఫార్సు చేసింది. ఇది అన్యాయమని, తిరిగి దర్యాప్తునకు ఆదేశించాలని 2013లో దాఖలైన పిటిషన్‌ ఇప్పటికీ పంజాబ్‌ హర్యానా హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. మొత్తానికి పాతికేళ్లుగా ఆ హత్య కేసు అతీ గతీ లేదు. మొన్నీమధ్య డేరా బాబాపై రెండు అత్యాచారం కేసులు, ఒక హత్య కేసులో వెలువడిన తీర్పు ఈ కేసులోని బాధిత కుటుంబానికి ఆశ కల్పిస్తోంది. 1993నాటి ముంబై పేలుళ్ల కేసులో అబూ సలేం తదితరులకు ఇటీవలే ప్రత్యేక కోర్టు శిక్షలు విధించింది. ఒక సివిల్‌ కేసులో తీర్పు వెలువడాలంటే తమిళనాడులోని కింది కోర్టుల్లో సగటున 2.95 ఏళ్లు పడుతుందని ఒక అధ్యయనం తేల్చింది. అరియళూరు జిల్లాలోని ఒక కోర్టులో ఆ సగటు 4.65 ఏళ్లుగా ఉన్నదని అదే అధ్యయనం తేల్చింది. అలాగే చెన్నైలోని కింది కోర్టులు క్రిమినల్‌ కేసుల్ని త్వరగా పరిష్కరిస్తుంటే, కోయంబత్తూరులోని కోర్టుల్లో నత్తన డక నడుస్తున్నాయని చెప్పింది. ఈ కోర్టుల్లో న్యాయాధికారులు సమంగా ఉన్నారు.



కేసుల పెండింగ్‌ బెడద తీరడానికి లా కమిషన్‌ 230వ నివేదిక కొన్ని సూచ నలు చేసింది. కేసుల్లో వాయిదాలివ్వడానికి నిర్దిష్టమైన మార్గదర్శకాలుండా లన్నది అందులో ప్రధానమైనది. చట్టానికి సంబంధించి సంక్లిష్టతలున్న సంద ర్భాల్లో తప్ప మౌఖికమైన వాదనలకిచ్చే సమయాన్ని తగ్గించటం, కేసు తిరిగి అప్పీల్‌కు వెళ్లేందుకు వీలులేనివిధంగా విస్పష్టమైన, నిర్ణయాత్మకమైన తీర్పు నివ్వడం అవసరమని కూడా చెప్పింది. ఉన్నత న్యాయవ్యవస్థలో సెలవుల సంఖ్య తగ్గాలని సూచించింది. ఇవన్నీ చేస్తూనే జనాభా నిష్పత్తికి అనుగుణంగా న్యాయా ధికారుల సంఖ్య ఉండేలా చూడటం అవసరం. దేశవ్యాప్తంగా కింది కోర్టుల్లో 2.54 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 46.3 శాతం రెండేళ్లలోపులో నివే. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో సాధించిన విజయాలు మొత్తంగా ఈ సమస్య పరిష్కారానికి స్ఫూర్తినిస్తాయని, లండన్‌ కోర్టు వ్యాఖ్య గతకాలానికి ఆనవాలుగా మిగులుతుందని ఆశించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top