మోదీ–షా ద్వయం ముద్ర

మోదీ–షా ద్వయం ముద్ర - Sakshi


మిత్రపక్షాల బాదరబందీ అసలే లేని స్థితి, సంఘ్‌ పరివార్‌ పెద్దల్ని సైతం ఒప్పిం చగలిగే నేర్పు ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సంపూర్ణంగా వినియోగించుకుని మూడేళ్లలో మూడోసారి కూడా కేంద్ర కేబినెట్‌ రూపకల్పనలో తమదైన ముద్ర వేశారు. కూడికలు, తీసివేతలు పోగా ఆదివారం నాటి కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత మంత్రుల సంఖ్య 76 కి చేరింది. 2019లో లేదా అంతకన్నా ముందే జరగబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మంత్రివర్గం కనుక గరిష్ట స్థాయిలో పనిచేసి ఫలితాలు చూప గలరన్న విశ్వాసం ఉన్నవారినే మోదీ, అమిత్‌ షా ఏరికోరి ఎంచుకున్నారు. ఈ క్రమంలో వారు ఒత్తిళ్లకు తలొగ్గలేదు. రాజకీయ అనుభవానికి పెద్దగా ప్రాధాన్య మివ్వలేదు. బహుశా ఉమా భారతి ఒక్కరే ఈ విషయంలో మినహాయింపు కావొచ్చు. కానీ ఆమె నుంచి ప్రధానమైన జలవనరులు, గంగా నది పునరుజ్జీవం శాఖల్ని తొలగించి అప్రాధాన్యమైన తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖలి చ్చారు.



నిర్మలా సీతారామన్‌కు అనూహ్యమైన రీతిలో రక్షణ శాఖ బాధ్యతలను అప్పగించడం ద్వారా సమర్థవంతంగా పనిచేసినవారికే గుర్తింపు లభిస్తుందని పార్టీలోని సీనియర్‌ నేతలకు సంకేతాలు పంపారు. ఇందువల్ల ఆమె అత్యంత కీలకమైన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఎస్‌)లో భాగస్వామి అయ్యారు. ప్రధాని సహా కేవలం అయిదుగురు మాత్రమే ఉండే ఈ కమిటీలో సభ్యత్వాన్ని సీనియర్‌ మంత్రులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. మోదీ తోపాటు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ, విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌లు ప్రస్తుతం సీసీఎస్‌లో ఉన్నారు. తమ స్థాయి సీనియర్‌ నేతకే రక్షణ శాఖ అప్పగిస్తారని వీరు ముగ్గురూ భావించారు. నిర్మలా సీతారామన్‌కు ఇచ్చిన ‘డబుల్‌ ప్రమోషన్‌’ వీరిని కూడా ఆశ్చర్యపరిచి ఉండాలి. పార్టీలో ఆమె 2006లో చేరారు. 2014లో మోదీ తన తొలి కేబినెట్‌లో చోటిచ్చి నప్పుడు ఉభయ సభల్లో దేనిలోనూ ఆమెకు సభ్యత్వం లేదు. ఈ మూడేళ్ల వ్యవ  ధిలోనూ ఆమె సమర్ధతను నిరూపించుకుని ఉండొచ్చుగానీ.. అంతకన్నా ముఖ్యంగా తాను అనుకునే ప్రమాణాలకు దీటుగా ఉంటే అలాంటి వారికి ఎంతటి ఉన్నత స్థాయినైనా కల్పిస్తానని పార్టీలోని వారందరికీ ఈ ‘డబుల్‌ ప్రమోషన్‌’ ద్వారా మోదీ సందేశం పంపారు. పునర్వ్యవస్థీకరణకు కొన్ని రోజుల ముందు రైల్వే శాఖను వదులు కోవడానికి సిద్ధపడిన సురేష్‌ ప్రభు కూడా రక్షణ శాఖ ఆశించి ఉండొచ్చుగానీ... తరచు జరుగుతున్న రైలు ప్రమాదాలకు కలవర పడి రాజీ నామా చేయదల్చుకున్నట్టు వెల్లడించడం ఆయనకు మైనస్‌ అయినట్టుంది. మనో హర్‌ పారీకర్‌ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లాక రక్షణ శాఖకు పూర్తి స్థాయి మంత్రి లేరు. దాన్ని అరుణ్‌ జైట్లీయే ఇన్నాళ్లూ చూశారు. ఇరుగు పొరుగు దేశాల నుంచి సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో దానిపై దృష్టి కేంద్రీకరించడం అత్యవసరం. ఎన్నో సంక్లిష్టతలు ఇమిడి ఉండే ఆ శాఖను చూడటం కత్తి మీద సాము. మిగిలిన ఈ ఏడాదిన్నర వ్యవధిలో నిర్మలా సీతారామన్‌ వీటన్నిటినీ ఎదుర్కొనగలగాలి.



 కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి ఆర్‌కె సింగ్, ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ సత్యపాల్‌ సింగ్, ఢిల్లీ అభివృద్ధి మండలి(డీడీఏ) మాజీ కమిషనర్‌ కె. ఆల్ఫోన్స్, మాజీ దౌత్యవేత్త హర్‌దీప్‌ పూరి వంటి మాజీ ఉన్నతాధికారులకు పదవులిచ్చి పార్టీలో దీర్ఘకాలం పనిచేయడం ఒక్కటే కేంద్ర కేబినెట్‌ పదవి ఇవ్వడంలో గీటురాయి కాబోదని మోదీ పరోక్షంగా చెప్పారు. అయితే వీరిలో ఎందరు తమ సమర్ధతను నిరూపించుకోగలుగుతారో చూడాలి. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో బద్ధ వైరం ఉన్న ఎస్‌పీ శుక్లాకు మంత్రి పదవి ఇవ్వడం కూడా గమనించదగ్గదే. తన కులమైన ఠాకూర్‌లను బాగా చేర దీస్తున్న యోగి వల్ల ఆ రాష్ట్రంలోని బ్రాహ్మణ వర్గం కొంతకాలంగా అసంతృప్తితో ఉంది. కల్‌రాజ్‌ మిశ్రాను తప్పించడం ద్వారా ఇది మరింత పెరుగుతుందన్న భావన వల్లా, పనిలో పనిగా యోగికి చెక్‌ పెట్టడం కోసం శుక్లాకు చోటిచ్చారు. ఆయనకు మంత్రి పదవి రాకుండా చూడటానికి యోగి అన్ని ప్రయత్నాలూ చేశారు.



దక్షిణాది రాష్ట్రాలపై,  ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలపై బీజేపీ అధినేతలు దృష్టి సారించినట్టు ఆమధ్య వార్తలు రాగా తాజా పునర్వ్యవస్థీకరణలో అందుకు భిన్నంగా జరిగింది. రాజ్యసభకు రాజస్థాన్‌ నుంచి ఎన్నికైనా వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఆయన ఉప రాష్ట్రపతిగా వెళ్లాక ఏపీ నుంచి కంభంపాటికి అవకాశం వస్తుందని ఊహాగానాలొచ్చాయి. ఇటు తెలంగాణ నుంచి ఎన్నికైన బండారు దత్తాత్రేయ రాజీనామా చేశాక ఆయన బదులు వేరొకరికి అవకాశం ఇస్తారని భావించారు. కానీ రెండుచోట్లనుంచీ కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ ద్వారా మిత్ర పక్షాలకు, ప్రత్యేకించి కొత్తగా వచ్చి చేరిన నితీష్‌కుమార్‌ నేతృ త్వంలోని జేడీ(యూ)కు సైతం మోదీ తన మనోభావాన్ని నేరుగానే తెలియ జేసినట్టయింది. ఒకటి కాదు... రెండు మంత్రి పదవులివ్వాలని పట్టుబట్టిన నితీష్‌కుమార్‌కు ఒక్కటి కూడా కుదరదని తేల్చిచెప్పారు. ఆ విషయంలో కనీసం మర్యాదకైనా నితీష్‌కు వర్తమానం పంపలేదు. పైగా ఆ రాష్ట్రం నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలు ఆర్‌కె సింగ్, అశ్వినీ చౌబేలకు కేబినెట్‌లో చోటిచ్చి బిహార్‌లో పార్టీ సొంతంగా ఎదగదల్చుకున్నదని స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం లోనూ, ఆ తర్వాత ‘కనిష్ట ప్రభుత్వం–గరిష్ట పాలన’ మోదీ నినాదం. కానీ ఆ సూత్రాన్ని ఆచరించడం కష్టమేనని మోదీకి అర్ధమై ఉండాలి. కేంద్ర కేబినెట్‌లో ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలన్నది పూర్తిగా ప్రధాని ఇష్టాయిష్టాలకు సంబంధించిన వ్యవహారం. ఆరెస్సెస్‌ మార్గదర్శకత్వం ఉండే మాట నిజమే అయినా ఈ పునర్వ్యవస్థీకరణలో మోదీ, అమిత్‌ షాల ముద్ర స్పష్టంగా కనబడుతోంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top