కేజ్రీవాల్‌ (ఢిల్లీ సీఎం) రాయని డైరీ

Madhav Singaraju Writes On Kejriwal - Sakshi

ఫ్రైడే మార్నింగ్‌ నేను, నా డిప్యూటీ, ఇంకొందరం కలిసి అనిల్‌ బైజల్‌ ఇంటికి వెళ్లాం. షేవ్‌ చేసుకుని ఫ్రెష్‌గా కనిపించారు బైజల్‌. ఉదయం నైన్‌థర్టీకే ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కి ఇంత తీరికెలా దొరికిందబ్బా అని భలే ఆశ్చర్యం వేసింది!
‘సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్‌ శిసోడియా, ఒకళ్లిద్దరు ఆప్‌ ఎమ్మెల్యేలు వచ్చి,
నా చెంప మీద కొట్టి వెళ్లారు’ అని బైజల్‌ మాపై కంప్లయింట్‌ చేస్తే కనుక.. మోదీ మళ్లీ మా ఇంటి పైకి ఓ యాభై మంది పోలీసుల్ని పంపేంత మృదువుగా ఉన్నాయి ఆయన చెంపలు.
‘‘మీరే చేసుకుంటారా? బయటి నుంచి ఎవరైనా వచ్చి చేస్తారా బైజల్‌జీ’’ అని అడిగాను.
‘‘ఏంటి చేసుకునేది?’’.. అడిగారాయన.
‘‘గెడ్డం షేవింగ్‌’’ అన్నాను.
‘‘మీ ఆప్‌ ఎమ్మెల్యేలంతా గెడ్డాలపై పడ్డారేంటి కేజ్రీ?’’ అన్నారు.. తన చెంపల్ని రెండు చేతులతో నిమురుకుంటూ. అది  నిమురుకోవడం కాదు, దాచుకోవడం అని మా డిప్యూటీ సీఎం కనిపెట్టినట్లున్నాడు. నావైపు చూసి నవ్వబోయాడు. ‘నవ్వబోవద్దు’ అన్నట్లు నేను సైగ చేశాను.
‘‘ఏంటీ.. నవ్వబోవద్దు అని మీ డిప్యూటీకి సైగ చేస్తున్నావు?’’.. అడిగారు బైజల్‌.
నాకు మతిపోయింది. ‘‘ఇంత షార్ప్‌ ఏంటి బైజల్‌జీ మీరు! ఎవరైనా నవ్వుని పట్టేస్తారు. మీరు నవ్వబోవడాన్ని కూడా పట్టేశారు’’ అన్నాను.
‘‘మీరు గ్రేట్‌ సర్‌’’ అన్నాడు మా డిప్యూటీ.. ఆయనకు షేక్‌హ్యాండ్‌ ఇవ్వబోతూ.
బైజల్‌ పట్టించుకోలేదు. ‘‘ఏంటిలా వచ్చారు?’’ అని అడిగారు.
‘‘చెప్పే వచ్చాం కదా సర్‌’’ అన్నాడు మా డిప్యూటీ.
‘‘చెప్పకుండా వచ్చారని నేను అనడం లేదు. వచ్చింది ఎందుకో చెప్పమని అంటున్నాను’’ అన్నారు.
‘‘స్టేట్‌లో ఒక్క స్టేట్‌ ఎంప్లాయీ కూడా ఫోన్‌లు చేస్తుంటే ఎత్తట్లేదు. మీటింగులకు రమ్మంటే రావడం లేదు సర్‌’’ అని చెప్పాడు మా డిప్యూటీ.
‘‘వచ్చినవాళ్ల గెడ్డాలు పగలగొట్టి, గొంతులు పిసికేస్తుంటే ఎవరొస్తారు కేజ్రీ? అయినా సీఎస్‌ని
ఏ చీఫ్‌ మినిస్టర్‌ అయినా అలా పట్టుక్కొట్టేస్తాడా!’’ అన్నారు బైజల్‌.. నావైపు తిరిగి.
‘‘నేను కొట్టడమేంటి బైజల్‌జీ!’’ అన్నాను.
‘‘నీ ఎమ్మెల్యేలు కొడితే నువ్వు కొట్టినట్టు కాదా కేజ్రీ?’’ అన్నారు బైజల్‌.
‘‘వాళ్లు కూడా ఏం కొట్టలేదు బైజల్‌జీ. ప్రజలకి పంపిణీ చేయాల్సింది పంపిణీ చేయడం లేదని, సీఎస్‌కి పంపిణీ చేయాల్సింది సీఎస్‌కి పంపిణీ చేశారు. అంతే’’ అని చెప్పాను.
‘‘సర్లే.. వెళ్లండి. వెళ్లి, కలిసిమెలిసి పనిచేసుకోపోండి’’ అని పైకి లేచారు బైజల్‌.
‘‘మోదీ, అమిత్‌షా కూడా కలిసిమెలిసి పనిచేయడానికి వచ్చేస్తున్నారు బైజల్‌జీ!’’ అని చెప్పాను.
‘‘అయినా సరే, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. పోండి’’ అన్నారాయన!! - మాధవ్‌ శింగరాజు

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top