జీడీపీ దుమారం

Indian GDP Issue Economic Growth - Sakshi

ఏ దేశం ఏ స్థాయిలో అభివృద్ధి సాధించిందో చెప్పడానికి ఆ దేశంలోని ఆర్థిక పురోగతిని గీటు రాయిగా తీసుకుంటారు. ముఖ్యంగా వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవారంగాల్లో ఒక దేశం నిర్దిష్టమైన వ్యవధిలో సాగించిన లావాదేవీల విలువెంతో లెక్కేస్తారు. వాటి వినిమయం ఎలా ఉందో తెలుసుకుంటారు. దీని ద్వారా ఒక దేశానికి సంబంధించిన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)ని నిర్ధారి స్తారు. జీడీపీ బాగుంటే దేశం ఆర్థికంగా బాగున్నట్టు, లేనట్టయితే అది కష్టాల్లో ఉన్నట్టు పరిగణిస్తారు. నాలుగైదు రోజులక్రితం జీడీపీకి సంబంధించి ఒక వెబ్‌సైట్‌లో వెల్లడైన అంచనాలు ప్రస్తుతం రాజ కీయ దుమారం సృష్టిస్తున్నాయి. జాతీయ గణాంకాల కమిషన్‌(సీఎస్‌సీ) నియమించిన సబ్‌ కమిటీ వాజ్‌పేయి నాయకత్వంలోని తొలి దశ ఎన్‌డీఏ ప్రభుత్వం(1998–99 నుంచి 2003–04), మన్మో హన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం(2004–05 నుంచి 2013–14), నరేంద్రమోదీ గత నాలుగేళ్ల పాలనా కాలం(2014–15 నుంచి 2017–18) ఏమేరకు ఆర్థిక ప్రగతిని సాధించాయో అధ్య యనం చేసి లెక్కలు కట్టింది. దాని ప్రకారం తొలి దశ, మలి దశ ఎన్‌డీఏ ప్రభుత్వాల్లో కన్నా యూపీఏ హయాంలోనే వృద్ధి రేటు బాగుందని తేల్చింది.

2006–07లో నమోదైన జీడీపీ 10.08 శాతంకాగా, ఆ స్థాయిలో రెండంకెల వృద్ధి ఇంతవరకూ మళ్లీ ఎప్పుడూ లేదని వివరించింది. ఎన్‌డీఏ పాలనలో 2015–16 ఆర్థిక సంవత్సరంలో సాధించిన 8.1 శాతం వృద్ధి రేటే అత్యధికమని పేర్కొంది. ఉత్పాదక వస్తువులకు సంబంధించిన పన్నులు, సబ్సిడీల ప్రభావాన్ని మినహాయించే కొత్త విధానం కింద ఈ గణాంకాలను రూపొందించారు. వాస్తవానికి ఈ లెక్కలను ఇంకా సీఎస్‌సీ నిశితంగా పరిశీలించి ధ్రువీ కరించాల్సి ఉంది. ఆ తర్వాతే అవి అధికారిక గణాంకాలవుతాయి. కానీ ఈలోగానే కేంద్ర ఆర్థిక గణాం కాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో వెల్లడికావడంతో ఈ దుమారం బయల్దేరింది. అభిప్రాయ సేకర ణకు మాత్రమే ఉంచాం తప్ప వాటినింకా ఖరారు చేయలేదని ప్రభుత్వం వివరణనిచ్చుకుంది.యూపీఏ హయాంలో సాధించిన వృద్ధికి ప్రాతిపదిక అంతక్రితం వాజపేయి ప్రభుత్వం సాగిం చిన కృషేనని బీజేపీ ఎదురు దాడి చేస్తుండగా, అంకెలు అబద్ధాలు చెప్పవని, తాము 14 కోట్లమందిని దారిద్య్ర రేఖ దిగువ నుంచి పైకి తీసుకొచ్చామని కాంగ్రెస్‌ నేతలు జవాబిస్తున్నారు. జీడీపీ గణాం కాలను లెక్కేయటంలో అంతక్రితం వరకూ 2004–05 ఆర్థిక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుం టుండగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015లో దాన్ని 2011–12కు మార్చింది.

ఇలా మార్చటం వల్ల వాస్తవ వృద్ధి రేటుపై అంచనాకు రావడం అసాధ్యంగా మారుతుందని అప్పట్లోనే ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చిన తర్వాత కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) తొలిసారిగా ఇప్పుడే గత ఆర్థిక సంవత్సరాల గణాంకాలను కూడా పరిగణనలోకి తీసు కుంది. కనుక తొలి దశ ఎన్‌డీఏ ప్రభుత్వ హయాం మొదలుకొని ఇప్పటి వరకూ ఎవరెవరి పాలనలో వృద్ధి రేటు తీరుతెన్నులెలా ఉన్నాయో వెల్లడైంది. పర్యవసానంగా దీర్ఘకాలంలో దేశ స్థూల ఆర్థికాభి వృద్ధి ఎలా ఉన్నదో అవగాహన చేసుకోవటం సులభమవుతుంది. ఇప్పుడు వెల్లడైన గణాంకాలు చూస్తే అటు పెద్ద నోట్ల రద్దు, ఇటు జీఎస్‌టీ కూడా మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయని అర్ధమవుతుంది. కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం ఏం ఆరోపించుకుంటున్నా సామాన్య పౌరుల దృష్టిలో అభివృద్ధికి వేరే అర్థాలుంటాయి. వారి వరకూ ఉపాధి అవకాశాలు బాగుంటే... తమకొస్తున్న వేతనాలకు రెండు పూటలా పట్టెడన్నం తినగలిగితే... ఎంతో కొంత పొదుపు చేసే స్థితి ఉంటే...ప్రజారోగ్య స్థితిగతులు బాగుంటే... ఒడిదుడుకులు లేకుంటే దేశ ఆర్థిక స్థితి బాగున్నట్టు. అయితే జీడీపీ లెక్కలు ఇప్పుడే కాదు... ఎప్పుడూ ఇలాంటి అంశాలను చెప్పవు. ఉన్నతాదాయ వర్గాలకు మరింత ఆదాయం పెర గటం, ప్రభుత్వ సిబ్బందికి ఉన్నత స్థాయి వేతనాలుండటం... వారంతా వినియోగ వస్తువుల్ని భారీగా కొనుగోలు చేయటం వగైరాల వల్ల వస్తు వినిమయం భారీగా పెరిగినట్టు గణాంకాల్లో నమోదవు తుంది.

పారిశ్రామిక ఉత్పత్తి సూచీ బాగుంటుంది. స్థూల దేశీయోత్పత్తి గణనకు ఇవన్నీ ప్రాతిపదిక లవుతాయి. కానీ ఇవి వాస్తవ అభివృద్ధిని ప్రతిబింబించవు. ఇందుకు బదులుగా ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలు గణనీయంగా పెరిగితే వివిధ రంగాలు పుంజుకుని ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం వెల్లడైన గణాంకాలపై ఇంకా అధికారిక ముద్ర పడకపోయినా ఇవి ఏకరువు పెడుతున్న అంశాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీల పరస్పర ఆరోపణల పర్వంలో అవి మూలనపడుతు న్నాయి. 1993–94, 2011–12 మధ్య జీడీపీ నాలుగు రెట్లు పెరిగింది. కానీ కార్మికుల వేతనాలు రెట్టింపు మాత్రమే అయ్యాయని ఈమధ్యే అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) వెల్లడించింది.  దేశంలో కార్మికుల పని పరిస్థితులు సక్రమంగా లేవని, వేతనాలు నాసిరకమని, ఆ వేతనాలివ్వటంలో లింగ వివక్ష ఇప్పటికీ పోలేదని ఆ సంస్థ నివేదిక తెలిపింది.

మెరుగైన వేతనాలు కేవలం పట్టణ ప్రాంతాల్లోని స్వల్ప సంఖ్యలో ఉన్న కార్మికులు లభిస్తున్నాయి తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి లేదని పేర్కొంది. ఇలాంటి అంశాలు జీడీపీని లెక్కగట్టడంలో పరిగణనలోకి రావు. తమ హయాంలో జీడీపీ బాగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ స్వీయ ఘనతగా యూపీఏ చెప్పుకుంటు న్నది. కానీ ఆనాటి అంతర్జాతీయ పరిస్థితులు అందుకు దోహదపడ్డాయని మరిచిపోకూడదు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల సెంట్రల్‌ బ్యాంకుల ద్రవ్య విధానాలు ఉదారంగా ఉండటంతో లిక్విడిటీ బాగా పెరిగి పెట్టుబడులు ప్రవాహంలా వచ్చాయి. అయితే ఈ తరహా పెట్టుబడులు నిలకడగా ఉండవు. అవి ప్రతికూల పరిస్థితులను పసిగడితే వెంటనే జారుకుంటాయి. యూపీఏ హయాం చివరిలో జరిగింది ఇదే. దేశంలో ద్రవ్యలోటు, విదేశీ మారకద్రవ్య సంక్షోభం క్రమేపీ పెరగడాన్ని గమ నించాక వాటి జోరు తగ్గింది. తాజా వివాదం సంగతెలా ఉన్నా ఉపాధి అవకాశాలు పుంజుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుని ఆర్థిక రంగానికి జవసత్వాలు కల్పించాల్సిన అవసరం ఉంది.
 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top