బజార్‌లో ఆధార్‌!

hundreds of govt websites made Aadhaar details public - Sakshi - Sakshi - Sakshi

పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కు ఆధార్‌తో దెబ్బతింటున్నదన్న వాదనలను మొద టినుంచీ కొట్టిపారేస్తున్న ప్రభుత్వాలు ఆచరణలో ఆ వివరాలను ఎలా బజారు పాలు చేస్తున్నాయో వెల్లడైన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లకు సంబంధించిన 210 విభాగాలు తమ వెబ్‌సైట్లలో అనేకమంది పౌరుల ఆధార్‌ వివరాలను పొందుపరిచాయని ఆ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న యూనిక్‌ ఐడిం టిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు అయిదురోజులక్రితం ఇచ్చిన జవాబు గమనిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. మరి ఇన్నాళ్లూ ప్రభుత్వాలతోపాటు ఆ సంస్థ బాధ్యులు చెప్పిందేమిటి? చివరకు జరిగిందేమిటి?

తమ సర్వర్లు దుర్భేద్యమైనవని, వాటిల్లోకి జొరబడి సమాచారాన్ని కొల్లగొట్టడం ఎంతటివారికైనా అసాధ్యమని వారు కొన్నే ళ్లుగా వాదిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడు తుండటమే ఇందుకు కారణమని వారు వివరించారు. ప్రభుత్వ విభాగాలు ఆధార్‌ లోని సమాచారాన్ని సరిపోల్చుకోవడానికి ఉపయోగిస్తాయి తప్ప వాటిని బహి ర్గతం చేయబోవని చెబుతూ వచ్చారు. కానీ ఎవరో హ్యాకర్లకు శ్రమ లేకుండా అనేక విభాగాలు పౌరుల వివరాలన్నిటినీ తమంత తామే బహిరంగ ప్రదర్శనకు పెట్టాయి. ఆధార్‌ వివరాలు లీక్‌ అయిన మాట వాస్తవమేనని మొన్న మే నెలలో కూడా సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

అయితే అది యూఐడీఏఐ నుంచి జరగలేదని, కొన్ని ప్రభుత్వ విభాగాల అవగాహనాలోపమే అందుకు కారణమని చెప్పి ఊరుకుంది. ఇప్పుడు యూఐడీఏఐ అంతకుమించి లౌక్యాన్ని ప్రదర్శించింది. ఒక్క ప్రభుత్వ విభాగం పేరు కూడా వెల్లడించకుండా 210 విభాగాల వెబ్‌ సైట్లలో సమాచారం పొందుపరిచారని చెప్పింది. తాము జోక్యం చేసుకుని ఆ సమా చారాన్ని తొలగించేలా చూశామని వివరించింది. కానీ ఆ విభాగాలేమిటనిగానీ, ఎప్పటివరకూ ఆ వెబ్‌సైట్లలో పౌరుల వివరాలున్నాయని గానీ వెల్లడించలేదు. అడి గింది సమాచార హక్కు చట్టం కింద అయినప్పుడు దరఖాస్తు దారుకు çసందేహా తీతమైన సమాచారాన్ని అందజేయాలన్న కనీస స్పృహ, బాధ్యత యూఐడీఏఐకి లేక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధార్‌ వ్యవ హారాలను పర్య వేక్షిస్తున్న సంస్థ తీరే ఇలా ఉంటే ఆ ప్రక్రియపై పౌరులకు నమ్మకం కలగడం సాధ్యమేనా?

ఒకపక్క ఆధార్‌ చెల్లుబాటుపై అయిదేళ్లుగా సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం నడుస్తోంది. వేల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న ఇంత బృహత్తర మైన ప్రాజెక్టును పార్లమెంటులో ప్రవేశపెట్టి, చర్చించి ఆమోదముద్ర పొందకుండా పాలనాపరమైన ఒక ఉత్తర్వు ద్వారా అమల్లోకి తీసుకురావడమేమిటని 2012లో సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ప్రశ్నించింది. అటు తర్వాత ఆధార్‌ కారణంగా పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కు దెబ్బతింటుందని, ఇది రాజ్యాంగవిరుద్ధమని ప్రకటించాలని మరో వ్యాజ్యం దాఖలైంది. వీటిపై వాద ప్రతివాదాలు సాగుతుండగానే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం పోయి ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చింది. విపక్షంలో ఉండి బీజేపీ ఆధార్‌ను గట్టిగా వ్యతిరేకించింది గనుక ఈ వ్యాజ్యంపై ప్రభుత్వ వాదనల తీరు మారుతుందని, ప్రాజెక్టు త్వరలోనే అటకెక్కుతుందని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నెత్తికెత్తుకుంది. అచ్చం యూపీఏ హయాంలో మంత్రులిచ్చిన జవాబులనే ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులు కూడా వల్లె వేస్తున్నారు. ఆధార్‌ వ్యతిరేకుల నోరు మూయించడానికి చూస్తున్నారు.

ఇదంతా ఇలా సాగుతుండగానే రేషన్‌ కార్డుకూ, వంటగ్యాస్‌కూ మినహా మిగి లినవాటికి ఆధార్‌ తప్పనిసరి చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటీవల పాన్‌ కార్డుతో అనుసంధానించే విషయంలో ప్రభుత్వానికి అనుకూలమైన ఉత్తర్వులి చ్చింది. ఇప్పటికే ఆధార్‌ ఉన్నవారు అనుసంధానించుకోవాలని, అలా లేనివారు ఆ పని చేయనవసరం లేదని చెప్పింది. చిత్రమేమంటే సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలతో నిమిత్తం లేకుండా దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ సమస్త లావా దేవీలకూ ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నాయి. బడుల్లో మధ్యాహ్న భోజనం మొదలు కొని స్కాలర్‌షిప్‌ల వరకూ... రేషన్‌ మొదలుకొని సెల్‌ఫోన్‌ల వరకూ... అన్నిటికీ ఆధార్‌ వివరాలు ఇచ్చితీరాలన్న నిబంధన విధిస్తున్నాయి. ఆధార్‌ లేక పోవడం వల్లా, ఉన్నా దాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థకు అనుసంధానించకపోవడం వల్లా నిరు పేద వర్గాల ప్రజానీకం ఎన్ని బాధలు పడుతున్నారో అప్పుడప్పుడు వెల్ల డవుతున్న ఉదంతాలు చెబుతున్నాయి. ఆధార్‌ అనుసంధానం జరగకపోవడంవల్ల  జార్ఖండ్‌ రాష్ట్రంలో ఒక ఆదివాసీ కుటుంబానికి ఎనిమిదినెలల నుంచి రేషన్‌ అందక పోవ డంతో ఆ కుటుంబంలోని పదకొండేళ్ల బాలిక అర్ధాకలితో కన్నుమూసిందని మొన్న అక్టోబర్‌లో మీడియాలో కథనాలొచ్చాయి. ఆ తర్వాత ఈ తరహా వార్తలే యూపీ, పంజాబ్‌ల నుంచి వెల్లడయ్యాయి.

ఆధార్‌ ఇలా ప్రతిచోటా తప్పనిసరి చేస్తే ఎక్కడో అక్కడ సమస్య లెదుర వుతాయని ప్రభుత్వాలకు తోచకపోవడం, అందుకోసం ముందస్తు జాగ్రత్తలు తీసు కోకపోవడం ఆశ్చర్యకరం. ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా ఆధార్‌ ప్రాజెక్టును తీసుకున్న సంస్థల తీరుతెన్నులే ప్రశ్నార్ధకమైనవి. ఆ సంస్థలు అమెరికా గూఢచార సంస్థ సీఐఏ, అక్కడి ఆంతరంగిక భద్రతా విభాగం, ఫ్రాన్స్‌ ప్రభుత్వ రంగ సంస్థ వగైరాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త ఉషా రామనాథన్‌ వంటివారు ఎప్పటినుంచో హెచ్చరిస్తు న్నారు. ఆ సంస్థల ద్వారా పౌరుల సమాచారం సమస్తమూ దేశం దాటిపోతుందని చెప్పారు. అంత శ్రమ అవసరం లేకుండా మన ప్రభుత్వ విభాగాలే ఆ పని చేశా యని తాజా సమాచారం చెబుతోంది. కనీసం ఈ దశలోనైనా కళ్లు తెరిచి ఆధార్‌ విష యంలో పునరాలోచన చేయాలని, పౌరుల గోప్యతను పరిరక్షించాలని ప్రభుత్వా లను కోరుకోవడం అత్యాశేమీ కాదు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top