అక్కడ మీకేం పని సారూ..?

Enforcement Officers Deal With Wine Shop Owners Achampet - Sakshi

అచ్చంపేటలో మద్యం వ్యాపారులతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల కుమ్మక్కు.?  

మచ్చిక చేసుకోవడానికి ఓ కోళ్లఫాం షెడ్డులో గుట్టుగా మంతనాలు

విషయం బయటికి పొక్కగానే తనిఖీలంటూ నటన  

అచ్చంపేట రూరల్‌: అచ్చంపేటలో మద్యం వ్యాపారులు ఎక్సైజ్‌ అధికారులతో కుమ్మక్కయారనే  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం మద్యం వ్యాపారులందరూ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు పట్టణ శివారులో భోజనాలు ఏర్పాటు చేయడం, అదికాస్త బయటపడటంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. వివరాలిలా.. అచ్చంపేట పట్టణంతో పాటు వివిధ మండలాల్లోని వైన్స్‌షాపులను గుట్టుచప్పుడు కాకుండా తెరిచి వాటిని అధిక రేట్లకు విక్రయిస్తున్నారని కొందరు ఎక్సైజ్‌ కమిషనర్‌కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ ప్రభాకర్‌ తన సిబ్బందితో రెండు రోజులుగా అచ్చంపేట ప్రాంతాల్లో అక్రమంగా దాచిపెట్టిన మద్యం కోసం తనిఖీ చేస్తున్నారు. అయితే వచ్చిన అధికారులను మచ్చిక చేసుకోవడానికి వ్యాపారులు పల్కపల్లి గ్రామ సమీపంలోని ఓ కోళ్లఫారం షెడ్డులో గురు, శుక్రవారాల్లో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సమాచారం అందుకున్న స్థానిక జర్నలిస్టుల బృందం అక్కడికి వెళ్లగా అందరు అవాక్కయ్యారు. ఫొటోలు తీస్తుండగా సీఐ ముఖం చాటేశారు. గమనించిన మద్యం వ్యాపారులు ఒక్కొక్కరుగా అక్కడి నుంచి ఉడాయించారు. 

తనిఖీలు చేస్తున్నట్టు నటన  
కోళ్లఫాం షెడ్డు పక్కనే అధికారులు వారి వాహనం నిలిపారు. జర్నలిస్టులు వచ్చినట్లు గమనించిన సిబ్బంది భోజనాలు చేయకుండా కోళ్ల షెడ్డు పరిసరాలను తనిఖీ చేస్తున్నట్లు నటిస్తూ కనిపించారు. ఈ విషయమై ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ ప్రభాకర్‌ వివరణ ఇస్తూ.. మామిడితోట, గడ్డివాములో తనిఖీలు చేయడానికి వచ్చామని, లాక్‌డౌన్‌ వల్ల భోజనానికి ఇబ్బందిగా ఉన్నందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top