మరింత చేరువగా...

మరింత చేరువగా...


ప్రధాని నరేంద్ర మోదీ అధికార పీఠం అధిరోహించాక ఈ మూడేన్నరేళ్లలో భారత్‌–జపాన్‌ మైత్రీ బంధం విస్తరించింది. ఇరు దేశాల అధినేతలూ క్రమం తప్పకుండా ప్రతియేటా పరస్పరం పర్యటనలు జరుపుకోవడం ఈ రెండింటి మధ్యే సాధ్యమైంది. నరేంద్ర మోదీ ఉప ఖండం వెలుపల జరపాల్సిన తొలి పర్యటనకు 2014లో జపాన్‌ను ఎంచుకున్నారు. ఆ మరుసటి ఏడాది జపాన్‌ ప్రధాని షింజో అబే మన దేశంలో పర్యటించారు. నిరుడు మోదీ జపాన్‌ వెళ్తే...ఈసారి అబే రెండు రోజులు పర్యటించడానికి భారత్‌కు వచ్చారు.బుధవారం అహ్మదాబాద్‌ చేరుకున్న అబే దంపతులకు మోదీ స్వాగతం పలికి సబర్మతి ఆశ్రమం వరకూ రోడ్‌ షో ద్వారా తోడ్కొని వెళ్లారు. గురువారం జపాన్‌ సహకారంతో నిర్మాణమై 2022 కల్లా సాకారం కానున్న లక్షా పదివేల కోట్ల రూపాయల విలువైన హైస్పీడ్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతోపాటు పౌర విమానయానం, శాస్త్ర సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి తదితర రంగాలకు సంబంధించి 15 ఒప్పందాలు కూడా కుది రాయి. ఇరు దేశాలూ ఉగ్రవాద బెడదను తీవ్రంగా ఖండించాయి. దీని నివారణకు అన్ని దేశాలూ కలిసిరావాలని కోరాయి.ఇరు దేశాలకూ వేరే దేశాలతో వివాదాలున్నాయి. అవి ఈ మధ్యకాలంలో ముదిరాయి. ఈ  నేపథ్యంలో ఈ పర్యటనకు విశేష ప్రాముఖ్యత ఉంది. చైనాతో మనకేర్పడ్డ డోక్లాం వివాదం రెండు నెలలకుపైగా కొనసాగి ఈమధ్యే సమసి పోయింది. ఇక జపాన్‌కు ఉత్తర కొరియా పెద్ద శిరోభారంగా మారింది. అది హైడ్రోజన్‌ బాంబును పరీక్షించడం, జపాన్‌ ఉపరితలం మీదుగా దూసుకెళ్లేలా క్షిపణిని ప్రయోగించడంలాంటి చేష్టలతో ఆగక ప్రపంచ పటంలో జపాన్‌ను మిగల కుండా చేస్తానని హెచ్చరికలు జారీచేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో సాగుతున్న వాగ్యుద్ధంలో ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌వైపు వినబడే భీషణ ప్రతిజ్ఞల్లో ‘జపాన్‌ విధ్వంసం’ తప్పనిసరిగా ఉంటుంది. జపాన్‌కు మరో పక్క చైనాతోనూ సమస్యలున్నాయి.తూర్పు చైనా సముద్రంలోని సెన్‌కాకు దీవులు తమవేనని ఆ రెండు దేశాలూ చెప్పుకుంటున్నాయి. మరోపక్క బుల్లెట్‌ రైలు సాంకే తికత విక్రయంలోనూ ఆ దేశాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 50వ దశకం నుంచి ఇండొనేసియాలో జపాన్‌ పెట్టుబడులుండగా ఆలస్యంగా 2000 సంవత్సరంలో అక్కడికి ప్రవేశించిన చైనా చాలా త్వరలోనే తన పెట్టుబడులను భారీగా పెంచింది. రెండేళ్లక్రితం జపాన్‌కు రావాల్సిన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును తన్నుకుపోయింది. ఇటు మన దేశంతో కూడా చైనా ఇలాగే పోటీ పడుతోంది.మన పరిధిలోనే ఉంటుందనుకున్న శ్రీలంకను ఆ దేశం మచ్చిక చేసుకుని అక్కడ హంబన్‌తోట ఓడరేవు నిర్మాణం కాంట్రాక్టును చేజిక్కించుకుంది. చైనా ప్రతిపాదించిన ‘వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌’(ఓబీఓఆర్‌) నిర్మాణంలో పాలుపంచుకోవడానికి మన దేశం నిరాకరించింది. అందుకు బదులుగా ఇండియా–మయన్మార్‌–థాయ్‌లాండ్‌ (ఐఎంటీ) రహదారి ప్రతిపాదనను చూపుతోంది. అలాగే ఆసియా–ఆఫ్రికా గ్రోత్‌ కారిడార్‌(ఏఏజీసీ)ని కూడా సూచించింది. ఈ రెండు ప్రాజెక్టులనూ మన దేశం మున్ముందుకు తీసుకెళ్లాలంటే జపాన్‌ సహకారం అవసరం. చైనా అభీష్టానికి భిన్నమైన ప్రాజెక్టులు కనుక జపాన్‌కు కూడా సమ్మతం. జపాన్‌ పెట్టుబడులతో, మన సాంకేతిక నైపుణ్యంతో ఆఫ్రికాతో అనుబంధాన్ని పెంచుకోవచ్చునన్నది భారత్‌ వ్యూహం. అందువల్ల భారత్‌–జపాన్‌ల సాన్నిహిత్యానికి ‘తగిన కారణాలు’ ఇతరత్రా చాలానే ఉన్నాయి.వేరే దేశాలతో పోలిస్తే జపాన్‌కు మన దేశం ఇస్తున్న వెసులుబాటు ఎక్కువే. అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి జపాన్‌ మినహా ఏ దేశానికీ అనుమతి లేదు. దీన్నిబట్టే జపాన్‌కిస్తున్న ప్రాధాన్యమేమిటో అర్ధమవుతుంది. అటు జపాన్‌ సైతం మనపట్ల సుహృద్భావంతో ఉంటోంది. డోక్లాం విషయంలో మనకు బహిరంగంగా మద్దతు తెలిపిన ఏకైక దేశమది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పీటీ)పై సంతకం చేయని దేశాలతో అణు ఒప్పం దాలు కుదుర్చుకోకూడదన్న తన దృఢ నిశ్చయాన్ని జపాన్‌ మన దేశం విషయంలో సడలించుకుంది.


2008లో అమెరికాతో మనకు అణు ఒప్పందం కుదిరాక రష్యా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ వంటి దేశాలు సైతం ఆ మాదిరి ఒప్పందాలు కుదు ర్చుకున్నా 2016 వరకూ జపాన్‌ అందుకు సిద్ధపడలేదు. అలాగే ప్రస్తుత పర్య టనలో అబే అత్యంతాధునిక ఉభయచర యుద్ధ విమానం యూఎస్‌–2ను మనకు అందజేసేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. జపాన్‌ వద్ద పుష్క లంగా సాంకేతిక పరిజ్ఞానమూ, నిధులూ ఉన్నాయి. మన దేశానికి ఆ రెండింటి అవసరమూ అధికంగా ఉంది. తన దగ్గరున్న నిధుల్ని దేశ వ్యూహాత్మక ప్రయోజ నాలకు తోడ్పడేలా వినియోగించాలని జపాన్‌ భావిస్తోంది. మన దేశం అందుకు అన్నివిధాలా తగినదన్న నమ్మకం దానికుంది.   ఇప్పుడు శంకుస్థాపన జరిగిన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుపై పెదవి విరుస్తున్న వారున్నట్టే, ప్రశంసిస్తున్నవారూ ఉన్నారు. ఎన్‌డీఏ మిత్రపక్షం శివసేన దీన్ని నిలు వుదోపిడీ అంటున్నది. మౌలిక వైద్య సదుపాయాలుగానీ, రవాణా సదుపాయాలు గానీ లేని దేశంలో రెండు మహా నగరాల మధ్య ఇంత భారీ వ్యయంతో కూడిన ప్రాజెక్టు అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే రోజూ దాదాపు 200 రైళ్లు నడిచే అహ్మదాబాద్‌–ముంబైల మధ్య ఎంత వేగంగా చేరడానికి అవకాశమున్నా ఒకటిన్నర రెట్లు అధికంగా చార్జీలు చెల్లించి ప్రయాణించేవారుంటారా అన్న సందేహం అందరిలోనూ ఉంది.


ప్రాజెక్టు పూర్తయ్యే 2022నాటికి ఆ రెండు నగ రాల్లో, వాటి మధ్య ఉండే నగరాల్లో జనాభా... దాంతోపాటు రవాణా అవసరాలూ బాగా పెరుగుతాయి గనుక బుల్లెట్‌ రైలుకు కీలక ప్రాధాన్యత ఉంటుందని నిపు ణులు చెబుతున్నారు. మొత్తానికి బహుళ రంగాల్లో ఉమ్మడి అవసరాలు, ప్రయో జనాలూ ఉన్న భారత్‌–జపాన్‌ చెలిమి రానున్న కాలంలో మరింత విస్తృతం కాగల దని అబే పర్యటన తెలియజెబుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top