ఎట్టకేలకు చిక్కిన చోటా


ఒకప్పుడు ముంబై మహానగరాన్ని గడగడలాడించిన నేర ప్రపంచ రారాజుల్లో ఒకడైన చోటా రాజన్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. 22 ఏళ్లుగా అతని కోసం అన్వేషణ సాగిస్తున్నామని, ఇన్నాళ్లకు చిక్కడం గొప్ప విజయమంటున్నారు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్. చోటా రాజన్ అరెస్టు వార్తతోపాటే అందుకు దారితీసిన పరిణామాల గురించి మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. అవి ఈ అరెస్టుకు సంబంధించి రెండు ప్రధాన వాదనలను వినిపిస్తున్నాయి. రాజన్ పట్టివేత మరో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం లేదా మట్టుబెట్టడమనే అతి పెద్ద ఆపరేషన్‌లో భాగమన్నది అందులో ఒకటి.



దాని ప్రకారం దావూద్ ఇప్పుడు ఆఫ్రికాలో తలదాచుకుంటున్నాడు. అక్కడి నుంచి పాకిస్థాన్ లేదా గల్ఫ్ దేశాలకు వెళ్లిపోతే దాడి కష్టమవుతుంది గనుక ఈలోగానే అతడి సంగతి తేల్చడం కోసం ప్రణాళిక సిద్ధమైంది. అలా జరిగే పక్షంలో చోటా రాజన్‌కు ప్రాణహాని ఉంటుందన్న భావనతోనే ఈ అరెస్టు అంకానికి తెరలేపారన్నది వారి విశ్లేషణ. ఈ అరెస్టుకు సంబంధించి మరో వాదన కూడా ఉంది. రాజన్ అరెస్టు వార్త తెలిసి, దాన్ని చక్కదిద్దుదామని మన భద్రతా విభాగం అధికారులు అనుకునేలోగానే అది బయటి ప్రపంచానికి తెలిసిపోయింది. దాంతో భారత్, ఇండొనేసియా, ఆస్ట్రేలియాల సమష్టి కృషి వల్లే ఈ అరెస్టు సాధ్యమైందని సీబీఐ అధికారులు ప్రకటించాల్సి వచ్చిందన్నది ఆ వాదన సారాంశం. రాజన్‌కు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, అందువల్లే అతను లొంగిపోయే ఉద్దేశంతో పట్టుబడ్డాడని మరికొందరి విశ్లేషణ.



 రాజన్ గత పుష్కరకాలంగా మన భద్రతా విభాగాలకు సహకారం అందజేస్తున్నాడన్నది వాస్తవం. ప్రత్యర్థి దావూద్ ముఠా విదేశాల్లోనూ, భారత్‌లోనూ సాగిస్తున్న కార్యకలాపాల గురించి ఉప్పందించడంతోపాటు ఆ ముఠాకు చెందిన కీలక నేతలు ఆరుగురిని చోటా రాజన్ మట్టుబెట్టాడు. వారందరూ 1993లో జరిగిన ముంబై బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులు. తానూ ప్రత్యర్థుల చేతుల్లో రెండుసార్లు చావు తప్పించుకున్నాడు. వివిధ దేశాల్లో ఉంటున్న ఎందరో ప్రవాస భారతీయులు భిన్న రంగాల్లో నైపుణ్యం ప్రదర్శించడం ద్వారా...నిరంతర శ్రమ, పట్టుదల కారణంగా ఉన్నత స్థాయికి ఎగబాకారు. కోట్లాది డాలర్లు ఆర్జించారు. కానీ చదువూ సంధ్యా ఏమీ లేకుండా ఆకతాయిగా తిరుగుతూ...క్రమేపీ బ్లాక్ టిక్కెట్ల విక్రయాన్ని, ఇతర చిల్లర నేరాలనూ చేస్తూ...ఒక నేరస్త ముఠా సభ్యుడిగా ఎదిగిన వ్యక్తి... అనంతర కాలంలో తానే ముఠా నాయకుడిగా మారి విదేశాల్లో తనకంటూ పటిష్టమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకుని విలాసవంతంగా బతకడం, ఖండాంతరాల్లో నేర కార్యకలాపాలు సాగించడం ఊహించడానికే వీలుకానిది.



ఇదంతా ఎలా సాధ్యమైంది? మారు పేరుతో పాస్‌పోర్టు, వీసా సంపాదించి విదేశాలకు వెళ్లడం, అక్కడ తలదాచుకోవడం వరకూ ఎవరికైనా కుదరవచ్చు. అలాంటివారు అడపా దడపా పట్టుబడుతున్న వార్తలు మీడియాలో వెల్లడవుతుంటాయి. కానీ చోటా రాజన్ అలా పరారై గుట్టుగా బతికిన బాపతు కాదు. ఖండాంతరాల్లో విడిది చేసి నేరగాళ్ల ముఠాకు నాయకత్వంవహించాడు. తన ముఠాకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ, వ్యాపారవేత్తలను బెదిరిస్తూ, మాట విననివారిని హత్యలు చేయించాడు. అతడిపై 17 హత్య కేసులు, లెక్కకు మిక్కిలిగా బెదిరింపు కేసులు, అక్రమ వసూళ్ల కేసులు ఉన్నాయి. అతనికి వేర్వేరు దేశాల్లో వ్యాపారాలున్నాయి. ఇదంతా దాదాపు 20 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. రాజకీయ నేతలు, అధికార గణం అండదండలు లేకుండా వ్యక్తిమాత్రుడిగా ఇవన్నీ సాధించడం రాజన్‌కు సాధ్యమవుతాయని ఎవరైనా నమ్మగలరా?



 ముంబైలో 50వ దశకంలో మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం, విలాస వస్తువుల స్మగ్లింగ్, చిన్న చిన్న బెదిరింపులకు మాత్రమే పరిమితమైన మాఫియాలు ఆ నగరంతోపాటే ఎదిగారు. వాల్కాట్, సుకూర్ నారాయణ్ బఖియా, హాజీ మస్తాన్, వరదరాజన్ వంటివారు ఎక్కువగా స్మగ్లింగ్ కార్యకలాపాల్లో తలమునకలయ్యే వారు. విదేశాలనుంచి ఓడల్లో వచ్చే సరుకును చిన్న చిన్న పడవలపై వెళ్లి తెచ్చుకునేవారు. వాటిని అమ్ముకోవడం, డబ్బు చేసుకోవడమే వారి ప్రధాన వ్యాపకం. దావూద్, చోటా రాజన్‌ల తరహాలో కాక వారి కలలకూ, కాంక్షలకూ కూడా పరిమితులుండేవి. స్మగ్లర్లుగానే తప్ప మాఫియా డాన్‌లుగా ఎదిగినవారు తక్కువ. ముంబైలో వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించేకొద్దీ, సంపద భారీగా పోగుపడేకొద్దీ నేర ప్రపంచం మరింత సంఘటితం కావడం మొదలైంది.



భూమి లభ్యత తక్కువగా ఉండే ముంబై లాంటి మహానగరంలో మాఫియా డాన్‌లు పుట్టుకురావడం వింతేమీ కాదు. వందల కోట్ల రూపాయలతో సాగే రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి, దాన్ని వేగంగా పెంచుకోవడానికి వ్యాపార వర్గాలకు ఈ డాన్‌లు బాగా తోడ్పడ్డారు. కోట్లాది రూపాయల పెట్టుబడి అవసరమయ్యే సినిమా రంగానికి కూడా వీరి అండదండలు అవసరమయ్యాయి. నకిలీ నోట్లు, మ్యాచ్ ఫిక్సింగ్‌లు, సినిమా ఛాన్స్‌లు... ఇలా ఎన్నిటినో మాఫియా నిర్వహించింది. అత్యాధునిక సాంకేతికత, మెరుగైన ఆయుధాలు, రాజకీయ రంగం తోడ్పాటు, శాంతిభద్రతల విభాగం అండదండలు మాఫియాల పలుకుబడిని పటిష్టం చేశాయి. 1993లో జరిగిన పేలుళ్లు 257 మంది పౌరుల ప్రాణాలు తీయడమే కాదు...నేర ప్రపంచాన్ని కూడా బీటలువార్చాయి. మాఫియాలపై చర్య తీసుకోవడం తప్పనిసరి పరిణామమైంది. ఐఎస్‌ఐ అండదండలతో దావూద్ ముఠా సాగించిన ఆ పేలుళ్లు అప్పటికే ఉన్న విభేదాలకు మతం, దేశభక్తి, దేశద్రోహం రంగులద్దాయి. చోటా రాజన్ అరెస్టుకు సంబంధించిన ఫొటోలు గమనిస్తే అతను అనూహ్యంగా పట్టుబడ్డాడని నమ్మడం కష్టమే. లాంఛనాలన్నీ పూర్తయి, అతన్ని మన దేశం తీసుకురాగలిగితే వెల్లడయ్యే రహస్యాలు పుట్లకొద్దీ ఉంటాయంటున్నారు. అలా జరిగి, సంఘటిత నేర ప్రపంచం వెన్ను విరగాలని ఆశిద్దాం.

 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top