మూకదాడులపై చట్టమా?

Editorial On Mute Attacks - Sakshi

మూక దాడుల్ని నియంత్రించడానికి ఒక చట్టం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం పార్లమెంటుకు సూచించిన కొన్ని గంటల్లోనే జార్ఖండ్‌ రాష్ట్రంలో సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌పై బీజేపీ అనుబంధ సంస్థ యువమోర్చా కార్యకర్తలమని చెప్పుకున్నవారు మంగళవారం దాడికి పాల్పడి ఆయనను తీవ్రంగా గాయపరిచారు. ఇటువంటి దాడులు జరిగి నప్పుడల్లా ఆ మూకలోని వారు చెప్పే కారణాలనే వల్లెవేస్తూ వాటికొక సాధికారత కల్పించడానికి బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ప్రయత్నించే సంస్కృతి పెరుగుతున్నప్పుడూ... ఈ కేసుల్లో బెయిల్‌పై విడుదలైనవారిని ఏదో ఘనకార్యం చేసినవారిగా పరిగణించి కేంద్రమంత్రులే దండలేసి స్వాగతిస్తున్నప్పుడూ ఈ మాదిరి దాడులు పెరగడంలో వింతేమీ లేదు. నిజానికి అలా జరగక పోతేనే ఆశ్చర్యపోవాలి.

ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని, తమ చర్యలే చట్టమన్నట్టు వ్యవహరించకూడదని ధర్మాసనం చెప్పింది. సుప్రీంకోర్టు సూచించినట్టు మన పార్లమెంటు మూక దాడులపై చట్టం చేస్తుందా లేదా అన్న సంగతలా ఉంచి... అసలు చట్టాలు మాత్రమే దాడుల్ని నిరోధించగలవా అన్న సంశయం ఎవరికైనా ఏర్పడితే వారిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన అసమర్ధ ప్రభుత్వాలు ఉన్నవాటినే సరిగా అమలు చేయలేకపోవడం లేదా దుర్వినియోగం చేయడం రివాజుగా మారింది. అయితే  సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానం మాత్రం ఎన్నదగినది. దేశంలో మూకస్వామ్యం కొత్త నియమంగా మారినట్టు కనబడుతున్నదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత రెండు మూడేళ్లుగా దేశంలో కొనసాగుతున్న పరిస్థితికి ఈ వ్యాఖ్య అద్దం పడుతుంది.

ఇవే మాటలు అన్నవారిని బీజేపీ నాయకులు గతంలో రకరకాలుగా దుయ్యబట్టారు. అసహనం పెరుగుతున్నదని అన్నందుకు పాకిస్తాన్‌కు పొమ్మనడం దగ్గరనుంచి జాతి వ్యతిరేకులు అనడం వరకూ ఎన్నోవిధాల నిందించారు. ప్రభుత్వాన్ని విమర్శించడమంటే దేశాన్ని విమర్శించ డమే అన్నంత విపరీత ధోరణిని ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుంటే తప్ప కొన్ని సందర్భాల్లో ఇలాంటి ధోరణులకు అడ్డుకట్ట పడలేదు. ఈ వాతావరణం ఉన్నప్పుడు మూక దాడులు కొత్త నియమంగా మారినట్టు కనబడటంలో వింతేముంది? గోరక్షణ, పశుమాంసం దగ్గ రుంచుకోవటం వంటి ఆరోపణలతో జరిగే దాడులు ఇంకా ఆగకుండానే... దొంగలన్న పేరుతో, పిల్లల్ని ఎత్తుకుపోయేవారన్న పేరుతో పలువురిపై వివిధచోట్ల మూకలు విరుచుకుపడుతున్నాయి. 

స్వామి అగ్నివేష్‌ దేశంలోనూ, వెలుపలా అందరికీ తెలిసిన ఉద్యమకారుడు. విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, ఆయన 1979లో హర్యానాలో దేవీలాల్‌ నేతృత్వంలోని జనతా ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. అటు తర్వాత ఆయన ఎన్నికల రాజకీయాలనుంచి తప్పుకుని వివిధ సామాజిక సమస్యలపై ఉద్యమాలు నిర్మించారు. వెట్టి కార్మికుల విముక్తి కోసం బంధువా ముక్తి మోర్చా సంస్థ స్థాపించి పోరాడారు. ఆయన వ్యక్తం చేసే అభిప్రాయాలతో విభేదించడంలో తప్పులేదు. ఇప్పుడు దాడికి పాల్పడిన మూక ఆయన హిందువులపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. ఆ వ్యాఖ్యలకు నిరసన తెలియజేయవచ్చు లేదా కేసులు పెట్టవచ్చు. అంతేతప్ప 79 ఏళ్ల వయసు వ్యక్తిపై కిరాతకంగా దాడికి పూనుకోవటం, కిందపడేసి గాయపర్చటం, నోటికొచ్చిన దుర్భాషలాడటం ఎలాంటి సంస్కృతి? దాడి చేసినవారు తమ సంస్థవారో కాదో చెప్పలేనని యువమోర్చా జార్ఖండ్‌ అధ్యక్షుడు అంటున్నారు.

జార్ఖండ్‌లోని పకూర్‌లో ఈ దాడి జరగడానికి ముందు ఆ రాష్ట్రంలోని పహాడియా తెగ ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై విలేకరులతో అగ్నివేష్‌ మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద ఆదివాసీలకు కనీస వేతనం కూడా దక్కడం లేదని, చట్ట ప్రకారం ఏడాదికి వంద రోజుల పని కాకుండా 42–43 రోజులే ఉపాధి కల్పిస్తున్నారని ఆరోపించారు. వీటికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాధానం ఉందో తెలియదు. ఇంతటి అన్యాయమైన స్థితిలో మగ్గుతున్నప్పుడు ఆ ఆదివాసీలు నక్సలైట్లనో, మరొకరినో ఆశ్రయించడంలో వింతేముంది?

 మన దేశంలో మూకదాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టమేదీ లేదు. అయితే మూక పాల్పడే వివిధ నేరాలకు విధించే శిక్షల గురించి భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లో ఉంది. ఒక బృందం నేరానికి పాల్పడినప్పుడు ఆ బృందంలోని సభ్యులందరినీ ఉమ్మడిగా ఆ నేరంపై విచారించాలని నేర శిక్షాస్మృతి(సీఆర్‌పీసీ)లోని సెక్షన్‌ 223 నిర్దేశిస్తోంది. అలాగే భిన్నరూపాల్లోని విద్వేషపూరిత హింసను అరికట్టేందుకు మరికొన్ని చట్టాలున్నాయి. దళితులు, ఆదివాసీలపై జరిగే నేరాల నియం త్రణకు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల(నిరోధక) చట్టం ఉంది. కానీ విషాదమేమంటే ఈ చట్టాలేవీ జరుగుతున్న నేరాలను నిరోధించలేకపోతున్నాయి. దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న నేరా లతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల(నిరోధక) చట్టం కింద నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువన్న ఆరోపణ ఒకపక్క వినబడుతుండగా... ఈ చట్టంకింద నిందితులకు పడే శిక్షల శాతం అతి తక్కువగా ఉంటున్నది.

నేరాలకు పాల్పడినవారు డబ్బు, పలుకుబడి ఉన్నవారైతే బాధితులు చెప్పినా వారి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లలో నమోదు కావు. ఇలాంటి పరిస్థితుల్లో మూక దాడులపై చట్టం తెచ్చినా అది సక్రమంగా అమలవుతుందన్న గ్యారెంటీ ఉందా? ఈ చట్టంకన్నా ముందు ఈ దాడులు సమాజాన్ని ఎంత అమానవీయంగా మారుస్తాయో... విద్వేషాలను పురిగొల్పి సమాజా న్నెలా చీలుస్తాయో చైతన్యం కలగజేయడం చాలా అవసరం. చట్టమంటూ తీసుకొస్తే మూకదాడుల విషయంలో ఉద్దేశపూర్వకంగా నిర్లిప్తత పాటిస్తున్న అధికారులను కఠినంగా శిక్షించే నిబంధనలు పొందుపరచడం ముఖ్యం. అంతేకాదు... ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నవారినైనా ఆ చట్టం విడిచి పెట్టదన్న భావన కలిగితేనే ఫలితం సిద్ధిస్తుంది. లేదంటే ఇప్పుడున్న సవాలక్ష చట్టాల్లో అదొకటవు తుంది. కాగితాలకు పరిమితమవుతుంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top