చెదలబారిన చదువులు!

Editorial on Indian education system - Sakshi

రేపటి పౌరులు బడి బాట పడుతున్నారన్న సంబరమే గానీ, అందుమూలంగా వారికి కలుగుతున్న మేలేమిటో తెలుసుకునే తీరిక ఎవరికీ ఉండటం లేదని ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన నివేదిక చెబుతోంది. ప్రాథమిక విద్యా రంగానికి జవసత్వాలు తీసుకొచ్చి ఆరు నుంచి పద్నాలుగేళ్లలోపు పిల్లలు ఖచ్చితంగా బడి బాట పట్టేలా చర్యలు తీసుకోవాలన్న సంకల్పంతో మన దేశం వివిధ రకాల కార్య క్రమాలు చేపట్టింది. 1993–94లో మొదలైన జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం (డిపెప్‌), 2000లో ప్రారంభించిన సర్వశిక్షా అభియాన్‌ అలాంటి కార్యక్రమాలే. వీటికయ్యే వ్యయంలో సింహ భాగం కేంద్ర ప్రభుత్వానిది కాగా మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.

ప్రపంచబ్యాంకు, డీఎఫ్‌ఐడీ, యునిసెఫ్‌లాంటి సంస్థల సహాయసహకారాలు కూడా ఈ కార్యక్రమాలకు అందుతున్నాయి. ఇంత మంది కలిసి ఇన్నివిధాల పాటుబడుతున్నా మన ప్రాథమిక విద్యా రంగం పరిస్థితి నాసిరకంగానే ఉంటున్నదని ప్రపంచ బ్యాంకు అంటున్నది. విద్యారంగం తీరు తెన్నులెలా ఉన్నాయన్న అంశంపై ప్రత్యేక దృష్టి పెడుతూ బ్యాంకు విడుదల చేసిన ప్రపంచ అభివృద్ధి నివేదిక(డబ్ల్యూడీఆర్‌) మన ప్రాథమిక విద్యారంగం లోటు పాట్లను బహిర్గతం చేసింది. గ్రామీణ ప్రాంతాల బడుల్లో చదువుకుంటున్న మూడో తరగతి పిల్లల్లో మూడొంతుల మంది రెండంకెల తీసివేతలు చేయలేకపోతున్నారని, అయిదో తరగతిలో ప్రవేశించేనాటికి కూడా వారిలో సగంమందికి అది పట్టుబ డటం లేదని నివేదిక తేల్చిచెప్పింది. అలాగే అయిదో తరగతి పిల్లల్లో సగంమంది మాతృభాషలో ఉన్న రెండో తరగతి వాచకాన్ని కూడా సరిగా చదవలేకపోతున్నారని వివరించింది.

అంతక్రితం డిపెప్, ఆ తర్వాత సర్వశిక్షా అభియాన్‌ వంటి కార్యక్రమాల సంగ తలా ఉంచి అందరికీ నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలన్న లక్ష్యంతో విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి కూడా ఏడేళ్లవుతోంది. కానీ బడి ముఖం చూడని బాలలు ఒకపక్కా, బడికొస్తున్నవారిలో అంతంతమాత్రంగా ఉన్న చదువుల తీరు మరోపక్కా మన పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ రెండు రకాల వారూ అట్టడుగు వర్గాల పిల్లలేనని వేరే చెప్పనవసరం లేదు. ఇలా విద్యాగంధానికి దూరమైనవారికి మంచి భవిష్యత్తును అందించడం సాధ్యమవుతుందా? చదువుకు సంబంధించిన నైపుణ్యం కొరవడిన పిల్లలు పై తరగతులకు వెళ్లేకొద్దీ మరింతగా బండబారిపోతారు. ఉపాధ్యాయులు బోధిస్తున్నదేమిటో అర్ధంకాక, తోటి పిల్లలతో సమానంగా చదవలేక చివరకు చదువుకే స్వస్తి చెబుతారు. అటు ప్రభుత్వ బడు ల్లోనూ, ఇటు ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంటున్నదని ప్రపంచ బ్యాంకు నివేదిక చెబుతోంది.

అట్టడుగు వర్గాల పిల్లలు చదువులో వెనకబడటానికి అనేక కారణాలున్నాయి. పోషకాహారలోపం, అస్వస్థత, పేదరికం వంటివి అందులో కొన్ని. పోషకాహారలోపాన్ని సరిదిద్దడం కోసం మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారు. అయితే అసలు పిల్లలు బడికొచ్చేలా చేయడం, వచ్చినవారు ఉత్సాహంగా చదువుకోవడానికి అవసరమైన వాతావరణం ఉండటం ముఖ్యం. సర్వ శిక్షా అభియాన్‌ కింద మన దేశం రికార్డు స్థాయిలో 2 కోట్లమంది పిల్లల్ని బడి బాట పట్టించిందిగానీ అందులో దాదాపు 30 శాతంమంది తరగతులకు హాజరు కావడం లేదు.

సాంకేతికత నానాటికీ విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో... ఉన్నకొద్దీ చిన్న చిన్న ఉద్యోగాలకు సైతం మెరుగైన నైపుణ్యం అవసరమవుతుంది. ఇలాంటి నైపుణ్యా లను అందిపుచ్చుకోవాలంటే ప్రాథమిక స్థాయిలో గట్టి పునాది అవసరమవుతుంది. ఆ పునాది పడాలంటే అక్కడ తగినంతమంది సుశిక్షితులైన ఉపాధ్యాయులుండాలి. వారికి మెరుగైన వేతనాలు అందుతుండాలి. ఆ నియామకాల్లో అవినీతికి చోటుండ కూడదు. ఆ రంగానికి వచ్చే నిధులు పక్కదారి పట్టకూడదు. కానీ మన దేశంలో జరుగుతున్నది ఇదే. అవసరమైనంతమంది టీచర్లను నియమించలేక, వారికి మంచి జీతాలివ్వక మన ప్రభుత్వాలు కాలక్షేపం చేస్తున్నాయి. తాత్కాలిక ప్రాతిపది కన ఉపాధ్యాయులను నియమిస్తున్నాయి. ఈ క్రమంలో అవినీతి సరేసరి. ఇవన్నీ అంతిమంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు మెరుగైన విద్య దక్కకుండా చేస్తు న్నాయి. అట్టడుగు వర్గాలకు విద్య సక్రమంగా అందితే సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను అది పరిష్కరిస్తుంది.

కానీ మన దేశంలో అమలవుతున్న అస్తవ్యస్థ విధానాలు ఆ వర్గాల పిల్లలకు మంచి విద్యనందకుండా చేస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు నివేదిక మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపమ్‌ కుంభ కోణాన్ని, బిహార్‌లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు వారి బంధువులు చిట్టీలు అందించడానికి ప్రయత్నించడం లాంటి ఉదంతాలను ప్రస్తావించింది. ఇలాంటి మార్గాల్లో డిగ్రీలు పొందుతున్నవారు, ఉద్యోగాలు పొందుతున్నవారు చివరకు టీచ ర్లుగా అవతారమెత్తి విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని తెలిపింది. పాఠశాలల భవనాలకు, ఇతర మౌలిక సదుపాయాలకు వెచ్చించాల్సిన సొమ్మును వేరే పథకాలకు మళ్లిస్తున్న తీరును కూడా వెల్లడించింది.
 

పిల్లలు లేరన్న నెపంతో ఇటీవల సర్కారీ పాఠశాలల్ని మూతపెట్టే ధోరణి పెరిగింది. మారుమూల ప్రాంతాలకు సైతం విద్యనందించాలన్న లక్ష్యం కాస్తా ఇలా మూసివేత జాడ్యంతో నాశనమవుతుంటే... ఉన్న బడులైనా సక్రమమైన విద్యాబోధనలో విఫలమవుతుంటే పిల్లలు ఎదిగేదెలా? వారి భవిష్యత్తు బాగు పడేదెలా? అభివృద్ధి అంటే ఆకాశాన్నంటే భవనాలు, ఎక్స్‌ప్రెస్‌ రహదారులు, వేగంతో దూసుకెళ్లే రైళ్లు మాత్రమే కాదు. కోట్లాదిమంది విద్యార్థులకు విద్యాగంధం అందించి వారిని రేపటి పౌరులుగా తీర్చిదిద్దడం కూడా. అందుకవసరమైన ప్రణాళికలు రచించుకుని, వాటిని సక్రమంగా అమలు చేయడానికి పూనుకోవడం ప్రభుత్వాల బాధ్యత. ప్రపంచబ్యాంకు తాజా నివేదిక చూశాకైనా మన ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. ప్రాథమిక విద్యారంగంపై శ్రద్ధబూనాలి. దానికి జవసత్వాలు కల్పించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top