ఇంత దారుణమా!

Editorial Article On Unnav Case - Sakshi

ప్రభుత్వాలు ఏం చెబుతున్నా, నాయకులు ఎలాంటి హామీలిస్తున్నా వాస్తవంలో జరిగేదేమిటో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి కుటుంబంపై గత రెండేళ్లనుంచి నిరంతరాయంగా సాగుతున్న అఘాయిత్యాలు గమనిస్తే తేటతెల్లమవుతుంది. ఆ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది మొదలుకొని ఆ కుటుంబం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆమె తన తండ్రిని, బాబాయిని కోల్పోయింది. నిరంతం బెదిరింపులు ఎదుర్కొంటూనే ఉంది. చివరికిప్పుడు ఆ బాలిక న్యాయస్థానానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ‘రోడ్డు ప్రమాదం’లో చిక్కుకుని చావు బతుకుల్లో ఉంది. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న పిన్ని, మేనత్త ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించగా వారి న్యాయవాది పరిస్థితి సైతం ఆందోళనకరంగా ఉంది. ఆ కుటుంబంపై ఇంత వరకూ జరిగిన నేరాలూ, ఘోరాలు గమనిస్తే అసలు మనం ఏ యుగంలో ఉన్నామన్న అనుమానం తలెత్తుతుంది.

మన దేశంలో మైనర్లపై జరిగే లైంగిక నేరాలకు కఠిన శిక్షలు విధించే పోక్సో చట్టం ఉంది. తమ ప్రాణాలకు ముప్పు ఉన్నదని అత్యాచార బాధితులు  ఫిర్యాదు చేసిన పక్షంలో ఉన్నత స్థాయి పోలీసు అధికారులు దాన్ని స్వయంగా పరిశీలించి, వెనువెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలున్నాయి. కానీ ఆ నిస్సహాయ బాలిక కుటుంబానికి ఏదీ అక్కరకు రాలేదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా మన నేతల నోట ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంద’న్న గంభీరమైన పలుకులు వినిపిస్తాయి. ఈసారీ అవే వినిపించాయి. నిజమే... ఉత్తరప్రదేశ్‌లో గత రెండేళ్లుగా అది తనకలవాటైన పద్ధతిలోనే ‘పని’ చేస్తూ పోతోంది. ఆ బాలిక కుటుంబం మాత్రం బిక్కుబిక్కుమంటూ బతుకుతోంది.  

ఈ ఘటనల క్రమం గమనిస్తే ఎవరికైనా దిగ్భ్రాంతి కలుగుతుంది. మొదట  2017 జూన్‌లో ఆ బాలికను అపహరించి పది రోజుల తర్వాత వేరే ఊళ్లో ఎక్కడో దుండగులు వదిలేసి పోయినప్పుడు ఆమె స్థానిక ఎమ్మెల్యే కులదీప్‌ సెంగార్‌ మనుషులు తనను అపహరించారని ఆరోపించింది. తనపై ఆ ఎమ్మెల్యే, అతని సోదరుడు రోజుల తరబడి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని రోదించింది. ఎక్కడా నోరెత్తకుండా ఉంటే ఉద్యోగం చూపిస్తామన్నారని తెలిపింది. ఇవన్నీ ఆమె కుటుంబం ఫిర్యాదులో పొందుపరిస్తే పోలీసులు మాత్రం ఎఫ్‌ఐఆర్‌లో వేరేవిధంగా నమోదు చేశారు. ఆమెను అపహరించడం (ఐపీసీ సెక్షన్‌ 363), బలవంతంగా పెళ్లాడేందుకు ప్రయత్నించడం(ఐపీసీ సెక్షన్‌ 366) వంటి ఆరోపణలు మాత్రమే అందులో ఉన్నాయి. ఆ ఫిర్యాదు చేసింది మొదలు ఆ కుటుంబం నరకాన్ని చవిచూసింది. స్థానిక పోలీసులు కుమ్మక్కయ్యారన్న అనుమానంతో సీఎం మొదలుకొని ఉన్నతాధికారుల వరకూ ఆ బాలిక లేఖలు రాస్తూనే ఉంది. గత్యంతరం లేక ఆ బాలిక తల్లి న్యాయస్థానంలో కేసు దాఖలు చేస్తే ఆ తర్వాత కూడా జరిగిందేమీ లేదు. చివరకు న్యాయస్థానానికెళ్లొస్తున్న ఆ కుటుంబంపై ‘గుర్తు తెలియని వ్యక్తులు’ దాడి చేసి తండ్రిని  తీవ్రంగా కొట్టారు.

ఆ తర్వాత పోలీసులకు అప్పజెప్పారు. వారు అతని దగ్గర అక్రమ ఆయుధాలున్నాయంటూ కేసు పెట్టారు. ఎమ్మెల్యే సోదరుడి నాయకత్వంలోని గూండాలు తనపై దాడి చేసి కొట్టారని నెత్తురు కక్కుకుంటూ ఆయన చెప్పిన మాటలు వీడియోలో రికార్డయ్యాయి. అవి మీడియాలో వెల్లడై నిరసనలు పెల్లుబికాక ఎమ్మెల్యే సోదరుణ్ణి అరెస్టు చేశారు.  నిరుడు ఏప్రిల్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ఇంటి ముందు ఆమె ఆత్మహత్యాయత్నం చేశాక ఈ ఘోరాలన్నీ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఆ తర్వాతగానీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు కాలేదు. ఈలోగా తీవ్రంగా గాయపడిన ఆమె తండ్రి సరైన వైద్యసాయం అందక మరణించాడు. ఈ కేసు రోజురోజుకీ తీవ్రమవుతున్నదని అర్ధమయ్యాక రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఆ తర్వాత చాన్నాళ్లకు ఎమ్మెల్యే అరెస్టయ్యాడు. ఎమ్మెల్యేకు సహకరించి, అత్యాచారానికి తోడ్పడిందన్న ఆరోపణపై ఒక మహిళను కూడా అరెస్టు చేశారు. ఇంతలోనే కేసులో సాక్షిగా ఉన్న ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించారు.

నిజమే... ఆరోపణలొచ్చినంత మాత్రాన ఎవరూ దోషి కాదు. అవి కోర్టులో రుజువయ్యేవరకూ ఎవరైనా నిర్దోషే అని మన చట్టాలు చెబుతాయి. కానీ అసలు ఫిర్యాదులొచ్చినప్పుడు కేసు నమోదు చేయకపోతే, నిందితుడిని కనీసం అదుపులోనికి తీసుకుని ప్రశ్నించకపోతే ఏమనాలి? బాధితురాలి కుటుంబానికి నిరంతరం బెదిరింపులు రావడం, ఆ కుటుంబంలోనివారిపై వరసగా దాడులు జరగడం ఎలా అర్ధం చేసుకోవాలి? తనపై అత్యాచారం జరిగిందని ఆ బాలిక ఆరోపించేనాటికే పోక్సో చట్టం ఉనికిలో ఉంది. దాన్ని మరింత కఠినం చేస్తూ రెండు దఫాలు చట్ట సవరణలు కూడా తీసుకొచ్చారు. నిర్దిష్ట వ్యవధిలో ఇలాంటి కేసుల విచారణ పూర్తయి నిందితులకు శిక్షపడాలని అందులో నిర్దేశించారు. కానీ బాలిక కుటుంబం వరస దాడులతో తల్లడిల్లుతూనే ఉంది. వీటన్నిటికీ పరాకాష్టగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

బాధితురాలికి రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఆ వాహనంలో లేకపోవడం, అందుకు పొంతన లేని కారణాలు చెబుతుండటం గమనిస్తే ఇది హత్యాయత్నమని ఎవరికైనా అనుమానం కలగకమానదు. ఎమ్మెల్యేపై హత్య, హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి. కానీ ఆ రాష్ట్ర అదనపు డీజీపీకి మాత్రం ఇది ప్రమాదంగానే కనబడుతోంది! ఏడేళ్లక్రితం దేశ రాజధాని నగరంలో నిర్భయ ఉదంతం జరిగాక నేరగాళ్లకు కఠినమైన శిక్షలతో నిర్భయ చట్టం వచ్చింది. కానీ ఆచరణలో బాధిత కుటుంబాలకు న్యాయం ఎండమావే అవుతోందని ఉన్నావ్‌ ఉదంతం నిరూపిస్తోంది. ఎమ్మెల్యేపై వెనువెంటనే కేసు నమోదయ్యేలా, ఆయన అరెస్టయ్యేలా చర్యలు తీసుకోవడంలో యోగి సర్కారు మొదట్లో తాత్సారం చేయడంవల్లే ఇన్ని దారుణాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని తగిన ఆదేశాలిచ్చి బాధిత కుటుంబానికి రక్షణగా నిలవాలి. న్యాయం దక్కేలా చూడాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top