జారుడు బండపై ట్రంప్‌!

జారుడు బండపై ట్రంప్‌!


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అందరూ అనుకున్నకంటే చాలా ముందుగానే తన పదవికి చేటు తెచ్చుకునేలా ఉన్నారు. ఇటీవలి వరస పరిణామాలు ఆయన్ను ఆ దిశగా తీసుకెళ్తున్నాయి. ట్రంప్‌కొచ్చిన కష్టాలు ఇప్పుడు ‘వాటర్‌గేట్‌ పరిమా ణానికీ, స్థాయికీ చేరాయ’ని రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ జాన్‌ మెకెయిన్‌ అన్నారంటే ఆయన ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నారో అర్ధమవుతుంది. నిజానికి 1974లో రిచర్డ్‌ నిక్సన్‌ను పదవీభ్రష్టుణ్ణి చేసిన వాటర్‌గేట్‌ కుంభకోణాన్ని కూడా దీనితో సరి పోల్చలేం. ఎందుకంటే అది ఎన్నికల సమయంలోప్రత్యర్థి పార్టీ ప్రధాన కార్యా లయంలో జరిగే సంభాషణలు రికార్డు చేయడం, అక్కడి టెలిఫోన్‌లను ట్యాపింగ్‌ చేయడం వగైరాలకు సంబంధించింది.ట్రంప్‌ అంతకన్నా పెద్ద నిందను ఎదుర్కొం టున్నారు. అది అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో రష్యాతో ట్రంప్‌ బృందం సభ్యులు కుమ్మక్కు కావడానికి సంబంధించింది. ఇందులో నిజానిజాలేమిటో తేల డానికి ఇంకా సమయముంది. కానీ ఈలోగానే ఆ విషయంలో నేరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేల్‌ ఫ్లిన్‌ను కాపాడటానికి దొడ్డి దోవన ప్రయత్నించి ట్రంప్‌ దొరికిపోయారు. జాతీయ భద్రతా సలహా దారుగా ఫ్లిన్‌ ఉన్నది కేవలం 23 రోజులే. ఆయనగారు రష్యా రాయబారితో పరిధికి మించి మాట్లాడిన మాటలు వెల్లడి కావడంతో తప్పుకోవాల్సివచ్చింది. మేం అధికారంలోకొచ్చాక మీపై ఉన్న ఆంక్షలు ఎత్తేస్తామని అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ రాయబారితో ఫ్లిన్‌ అన్నారని మీడియా వెల్లడించింది.అక్కడితో ట్రంప్‌ బుద్ధిగా మెలిగితే సరిపోయేది. ఆ విషయమై దర్యాప్తు చేస్తున్న ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. దర్యాప్తు ఆపేందుకు కోమీ నిరా కరించడంతో ఆయన్ను తొలగించారు. ఇలా చేజేతులా తనంతతానే సమస్యల వలయంలో చిక్కుకున్నారు. ఇప్పటికే సెనేట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ తమ ముందు సాక్ష్యమీయవలసిందిగా కోమీకి కబురంపింది. దీంతోపాటు పదవికి రాజీనామా చేసేముందు వైట్‌హౌస్‌ అధికారులతో కోమీ జరిపిన చర్చలకు సంబంధించిన పత్రాలుంటే అందజేయమని ప్రస్తుత ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ మెక్‌ కాబ్‌ను ఆదేశించింది. అటు సెనేట్‌ ఓవర్‌సైట్‌ కమిటీ సైతం కోమీ–ట్రంప్‌ చర్చలకు సంబంధించిన రికా ర్డుల కోసం ప్రయత్నిస్తోంది.ఇవి చాలవన్నట్టు తాజాగా రాష్యాతో ట్రంప్‌ బృందం సంబంధాలపై దర్యాప్తునకు ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ రాబర్ట్‌ మూలర్‌ను ప్రత్యేక అటార్నీగా నియమిస్తూ అమెరికా న్యాయ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్లిన్‌ విషయంలో కోమీని ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్టు రుజువైన పక్షంలో ట్రంప్‌ అభిశంసనకు గురై పదవి కోల్పోవడం మాత్రమే కాదు... 20 ఏళ్లపాటు జైలులో ఉండాల్సివస్తుంది. అమెరికా చరిత్రలో ఇంతవరకూ ఇద్దరే ఇద్దరు అధ్య క్షులు రిచర్డ్‌ నిక్సన్, బిల్‌ క్లింటన్‌ అభిశంసనకు లోనయ్యారు.

పరిస్థితి చేయి దాటుతున్నదని ట్రంప్‌కు కూడా అర్ధమయ్యే ఉండాలి. అందుకే తనను అందరూ అన్యాయంగా వెంటాడుతున్నారని వాపోయారు. కానీ ఇదంతా స్వయంకృతం.ఎన్నికల ప్రచారం సమయానికే దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఫ్లిన్‌ వ్యవహరించారన్న ఆరోపణలొచ్చాయి. సిరియాలోని ఐఎస్‌ రహస్య స్థావ రంపై ఒబామా ప్రభుత్వం జరపబోయిన దాడి విషయంలో టర్కీ ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా ఫ్లిన్‌ నడుచుకున్నారని, అందుకు భారీ మొత్తంలో ఆయన నేతృత్వం లోని సంస్థకు ముడుపులు ముట్టాయని ఆరోపణలొచ్చాయి.  ఆ సంగతి తెలిసినా తన ప్రచార బృందంలో ఫ్లిన్‌ను కొనసాగనిచ్చారు. ఎన్నికల ప్రచారంలో హిల్లరీ విజయావకాశాలను దెబ్బతీసేందుకు రష్యా అమలు చేసిన చాటుమాటు వ్యవహా రాలన్నిటా అతని హస్తమున్నదని ఆరోపణలొస్తున్నా ట్రంప్‌ పట్టించు కోలేదు. తనకు ఫ్లిన్‌ ఎంత సన్నిహితుడైనా ఆయనను రక్షించడానికి ప్రయత్నిస్తే తానూ ఇరుక్కుపోతానన్న సంగతి ట్రంప్‌కు తెలియలేదంటే ఆయన అధ్యక్ష పదవికి అన ర్హుడనే అనుకోవాలి. ట్రంప్‌ను చుట్టుముట్టిన కష్టాల్లో మీడియా పాత్ర కీలకమైనది. అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే ట్రంప్‌ మీడియాను దూరం పెట్టాలని నిర్ణయిం చినప్పుడు వైట్‌ హౌస్‌ ప్రెస్‌ కోర్‌ ఆయనను తీవ్రంగా హెచ్చ రించింది.పాలనకు సంబంధించిన సమాచారాన్ని అందించడం ఆపేస్తే దాన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో సాధించడం తమకు కష్టం కాదని చెప్పింది. అందుకు తగ్గట్టే ట్రంప్‌ ప్రతి చర్యనూ గమనిస్తూ లొసుగులను ఎప్పటికప్పుడు బయ టపెట్టింది. దీన్నంతటినీ అడ్డుకోవడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. వైట్‌హౌస్‌ సిబ్బందిని సమావేశపరిచి అందరూ ఒకే మాటపై ఉండాలని సూచించి 24 గంటలు గడవక ముందే ట్రంప్‌కూ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కూ మధ్య జరిగిన సంభాషణ లీకయింది. ఇజ్రాయెల్‌ అమెరికాకు అందజేసిన ఒక రహస్య సమాచారాన్ని ట్రంప్‌ ఆయనకు వెల్లడించారన్నది దాని సారాంశం.రాగల రోజుల్లో ట్రంప్‌పై మరిన్ని ఆరోపణలు ముసురుకునే ప్రమాదం ఉంది. హెచ్‌ 1బి వీసాలపై ఆంక్షలతోసహా వలసలను అరికట్టడానికి ట్రంప్‌ సర్కారు ఎన్నో చర్యలు తీసుకుంటే ట్రంప్‌ అల్లుడు కుష్నర్‌ మాత్రం తమ వ్యాపారంలో 5 లక్షల డాలర్లు పెట్టుబడి పెడితే ఈబీ5 వీసాను అందజేస్తామని చైనా సంపన్నులకు ఆశచూపాడు. ఆయన కుమార్తె ఇవాంకా సైతం అధికార కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నట్టు తరచు వార్తలొస్తున్నాయి. లేని సంక్షోభాన్ని ఉన్నట్టుగా ఊహిం చుకుని ట్రంప్‌ రెచ్చగొట్టే ప్రసంగాలకు సులభంగా లొంగిపోయి భయంతో, అప నమ్మకంతో, జాత్యహంకార ధోరణులతో ఓట్లేసిన జనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పట్ల ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరం. ట్రంప్‌ తనకు తానే చేటు తెచ్చుకోవడాన్ని గమనిస్తే మన పురాణాల్లోని భస్మాసురుడు గుర్తుకొస్తాడు. ఎన్ని కల ప్రచారంలో ఇష్టానుసారం మాట్లాడితే ఓట్లు రాలాయిగానీ... పదవిలోకొచ్చాక ఆ బాణీనే కొనసాగిస్తే, అలాగే ప్రవర్తిస్తే ముప్పు తప్పదని ట్రంప్‌కు ఇప్పట్లో అర్థ మయ్యే సూచనలు కూడా కనబడటం లేదు.

Back to Top